Encounter Death: భద్రాద్రి కొత్తగూడెం–ములుగు సరిహద్దులో ఎన్ కౌంటర్,నక్సలైట్ మృతి.. బుద్ధారం గ్రామంలో విషాదం-encounter at bhadradri kothagudem mulugu border naxalite killed tragedy in buddharam village ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Encounter Death: భద్రాద్రి కొత్తగూడెం–ములుగు సరిహద్దులో ఎన్ కౌంటర్,నక్సలైట్ మృతి.. బుద్ధారం గ్రామంలో విషాదం

Encounter Death: భద్రాద్రి కొత్తగూడెం–ములుగు సరిహద్దులో ఎన్ కౌంటర్,నక్సలైట్ మృతి.. బుద్ధారం గ్రామంలో విషాదం

HT Telugu Desk HT Telugu
Jul 26, 2024 05:29 AM IST

Encounter Death: కొద్దిరోజులుగా మావోయిస్టుల కదలికలతో అలజడి చెలరేగిస ములుగు జిల్లాలో తుపాకుల మోత మోగింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా సరిహద్దులోని దామరతోగు, అల్లిగూడెం అటవీ ప్రాంతంలో గురువారం ఎన్ కౌంటర్ జరిగింది.

ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్‌ మృతి
ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్‌ మృతి

Encounter Death: గ్రే హౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక నక్సలైట్ మృతి చెందాడు. దీంతో తుపాకుల మోతతో అటు భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ములుగు జిల్లాలో కలకలం చెలరేగింది. ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో కొద్ది రోజులుగా మావోయిస్టుల కదలికలపై గ్రే హౌండ్స్ బలగాలు ఫోకస్ పెట్టాయి.

అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే మావోయిస్టులపై నిఘా పెట్టగా, తరచూ చెదురుమొదురు ఘటనలతో పోలీసులు, నక్సలైట్ల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇదిలాఉంటే మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కొద్ది రోజులుగా గ్రే హౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు స్థావరాలు ఏర్పాటు చేసుకుని, కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతమైన దామెరతోగు, అల్లిగూడెం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా, పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన నల్లమారి అశోక్ అలియాస్ విజేందర్ ప్రాణాలు కోల్పోయాడు.

ఏడేళ్ల కిందట ఉద్యమ బాట

బుద్ధారం గ్రామానికి చెందిన నల్లమారి వీరస్వామి–రాజమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు సంతానం. అందులో రెండో కొడుకైన నల్లమారి అశోక్ అదే గ్రామంలో ఏడో తరగతి వరకు చదివాడు. ఆ తరువాత చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో డీసీఎం వ్యాన్ డ్రైవర్ గా పని చేశాడు. అప్పటికే గ్రామం నుంచి ఉద్యమ బాట పట్టడంతో కొంతకాలానికి అశోక్ జనశక్తి పార్టీ సానుభూతి పరుడిగా పని చేశాడు. ఆ తరువాత విషయం బాహ్య ప్రపంచానికి తెలియడంతో 2017 సంవత్సరంలో మావోయిస్టులతో జత కలిశాడు. గ్రామానికి వీడి ఉద్యమ బాటలో అజ్ఞాతంలోకి వెళ్లాడు.

తండ్రి సంవత్సరీకం రోజునే..

నల్లమారి అశోక్ తల్లి రాజమ్మ చాలా ఏళ్ల కిందటనే మరణించింది. కాగా తండ్రి వీరస్వామి గత సంవత్సరం జులై 26న చనిపోయినట్లు తెలిసింది. కాగా 2017లో అడవి బాట పట్టిన అశోక్ ఏడేళ్ల పాటు ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించి, గురువారం (జులై 26న) ఎన్ కౌంటర్ లో ప్రాణాలు వదిలాడు. కాగా గురువారం అశోక్ తండ్రి వీరస్వామి సంవత్సరీకం కొడుకు అశోక్ కూడా ఎన్ కౌంటర్ లో మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది.

ఇదిలాఉంటే నల్లమారి అశోక్ అలియాస్ విజేందర్ పోలీసుల ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడంతో విషయం తెలుసుకున్న బుద్ధారం గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. దాదాపు ఏడేళ్ల కిందట గ్రామాన్ని వీడిన అశోక్ ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడో.. ఉద్యమంలో ఎవరితో పని చేశాడో కూడా తెలియదని గ్రామస్థులు చెబుతున్నారు. కాగా ఉద్యమ పోరులో అశోక్ నేలకొరగడంతో బుద్ధారం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

పోలీసులు హై అలర్ట్

దామరతోగు అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరగడం, అందులో అశోక్ ప్రాణాలు కోల్పోవడంతో ఎదురు కాల్పుల్లో నక్సలైట్లు ఎవరెవరు పాల్గొన్నారనే కోణంలో ఆ సమీపంలోని మణుగూరు, గుండాల, పినపాక తదితర స్టేషన్ల పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. అంతేగాకుండా ములుగు జిల్లా ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి పోలీసులు కూడా మావోయిస్టుల గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం.

ఎన్ కౌంటర్ లో ఎవరెవరు పాల్గొన్నారనే విషయం ఆరా తీయడంతో పాటు బుద్ధారం గ్రామంపైనా నిఘా పెంచినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం సాయంత్రం గ్రామంలో పోలీసులు బలగాలు మోహరించడంతో స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది.

ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది..: ఆజాద్

అడవుల్లో జరుగుతున్న ఎన్ కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు డివిజన్ కార్యదర్శి ఆజాద్ మండిపడ్డారు. ఈ మేరకు ఎన్ కౌంటర్ అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ఎన్ కౌంటర్లు నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కయి మావోయిస్టు పార్టీ నిర్మూలన కోసం కగార్ దాడులను తీవ్రం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8 నెలల కాలంలో బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తూ విప్లవ కారులను హత్య చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు డివిజన్ కార్యదర్శి ఆజాద్ విడుదల చేసిన లేఖలో ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుందంటూ కామెంట్స్ చేయడం కలకలం రేపుతుండటంతో, ప్రతి దాడులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner