Rythu Bandhu Scheme Updates : 'రైతుబంధు' రాలేదా..? ఈ తేదీలోపు మీ ఖాతాల్లో జమ కానున్న డబ్బులు! తాజా అప్డేట్ ఇదే
Telangana Rythu Bandhu Scheme Updates: రైతుబంధు నిధుల జమకు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. నిధుల జమ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని… వచ్చే నెల 15వ తేదీలోపు అందరి ఖాతాల్లోకి డబ్బులు వస్తాయని స్పష్టం చేశారు.
Rythu Bandhu Funds 2024 Updates: రైతుబంధు నిధుల కోసం ఇంకా చాలా మంది రైతులు ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు తర్వాత… నిధులు జమ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు మూడు ఎకరాలలోపు ఉన్నవారికి మాత్రం డబ్బులు అందినట్లు తెలిసింది. గుంటల వారీగా డబ్బులను జమ చేస్తూ వచ్చిన సర్కార్… సంక్రాంతి పండగ తర్వాత వేగాన్ని పెంచింది. ప్రస్తుతం మూడు నుంచి మూడున్నర ఎకరాలోపు ఉన్న వారి ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే అంతకంటే ఎక్కువ భూమి కలిగిన రైతులు మాత్రం… తమకు డబ్బులు వస్తాయా లేదా అన్న ఆందోళనలో ఉన్నారు.
రైతుబంధు స్కీమ్ నిబంధనలను మార్చాలని భావిస్తోంది తెలంగాణ సర్కార్. కేవలం సాగు చేసే భూములకు ఇవ్వాలని నిర్ణయించింది. సాగు చేయకుండా ఉన్న భూములకు ఇవ్వకుండా… అర్హులైన వారికి మాత్రం ఇవ్వాలని యోచిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూస్వాములు, పడావు భూములు, కొండలు, గట్టులు, బీడు భూములు ఉన్నవారు కూడా పంట పెట్టుబడి సాయం అందుతున్నట్లు గుర్తించిన సర్కార్…. బ్రేకులు వేయాలని చూస్తుంది.
పంట పెట్టుబడి సాయం స్కీమ్ లో శాటిలైట్ సేవలను ఉపయోగించుకోవాలని చూస్తోంది. సంబంధిత సర్వే నెంబర్ లో నిజంగానే సాగు జరుగుతుందా లేదా అనేది శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించాలని భావిస్తుంది. అంతేకాకుండా గ్రామ స్థాయిలో సాగు భూమి ఎన్ని ఎకరాలు ఉందో తేల్చేందుకు సర్వేలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రతి వెయ్యి ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారిని నిర్వహించి మొత్తం సాగు భూమి ఎంత ఉంది, బీడు భూమి ఎంత ఉంది అనే వివరాలు సేకరించనుంది. దీని ద్వారా అసలైన లబ్దిదారులకు రైతుబంధు సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్యలతో ప్రభుత్వంపై వేల కోట్ల భారం తగ్గుతుంది. ఇదే సమయంలో… కౌలు రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేలా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. అసలైన సాగు భూమికి మాత్రమే పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తే ప్రభుత్వానికి రూ. 3,750 కోట్లు ఆదా కానున్నట్లు లెక్కలు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
మార్చి 15లోపు అందరికీ డబ్బులు..!
రైతుబంధు స్కీమ్ పై అనేక వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో… బుధవారం గురువారం కొడంగల్ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మార్చి 15 లోపు పంట పెట్టుబడి సాయాన్ని అందరి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. రైతులు ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. అయితే ఎన్ని ఎకరాలలోపు ఉన్న వారికి వేస్తారనేది తేలాల్సి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. సీలింగ్ పెట్టాలని గట్టిగా భావిస్తున్న కాంగ్రెస్ సర్కార్…. ఐదు ఎకరాలకు పరిమితం చేస్తుందా లేక పది ఎకరాల వరకు సీలింగ్ పెడుతుందా అనేది తేలాల్సి ఉంది. గతంలో మాదిరిగానే ఈసారికి రైతుబంధు నిధులను జమ చేస్తామని ప్రభుత్వం ఏర్పాటైన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. కానీ రైతుబంధు ప్లేస్ లో రైతుభరోసా స్కీమ్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఎకరానికి రూ. 15వేలు ఇస్తామని ప్రకటించింది. ఈ స్కీమ్ ను వచ్చే సీజన్ కు వర్తింపజేసే అవకాశం ఉంది.
గత ప్రభుత్వంలో రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు స్కీమ్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎకరానికి రూ. 5వేలను జమ చేస్తూ వచ్చింది. అయితే ఎన్నికల హామీలో భాగంగా... కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ పై ప్రకటన చేసింది. రైతుభరోసా స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం అందజేస్తామని పేర్కొంది. ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో రైతుబంధు స్కీమ్ త్వరలోనే రైతుభరోసాగా మారనుండగా… కీలకమైన మార్గదర్శకాలు కూడా వెలువడే అవకాశం ఉంది.