Bypoll 2022: మునుగోడులోనూ నిజామాబాద్ సీన్ తప్పదా..?-land victims ready to contest in munugodu bypoll 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bypoll 2022: మునుగోడులోనూ నిజామాబాద్ సీన్ తప్పదా..?

Bypoll 2022: మునుగోడులోనూ నిజామాబాద్ సీన్ తప్పదా..?

Mahendra Maheshwaram HT Telugu
Aug 12, 2022 06:48 AM IST

Munugodu Bypoll 2022: రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మునుగోడు ముచ్చటే నడుస్తోంది. బైపోల్ వస్తుందా..? వస్తే గెలిచేదెవరు అంటూ చర్చోపచర్చలూ వినిపిస్తున్నాయి. ఇక బరిలో ఉండే పార్టీల పరిస్థితి చెప్పేదేలేదు. వారిలో పనిలో వారు ఉంటే.... ఈ ఉప ఎన్నికను సరికొత్త అస్త్రంగా ప్రయోగించేందుకు సిద్ధమైవుతున్నారు నియోజకవర్గ పరిధిలోని భూనిర్వాసితులు. అన్ని రాజకీయ పార్టీలతో పోలిస్తే... అధికార టీఆర్ఎస్ కు మాత్రం సెగ తాకేలా కనిపిస్తోంది.

మునుగోడు బైపోల్ బరిలో భూనిర్వాసితులు?
మునుగోడు బైపోల్ బరిలో భూనిర్వాసితులు?

మునుగోడు... సామాజికంగా, రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం..! సాయుధ పోరాటమైనా... సామాజిక పోరైనా... ఇక్కడి ప్రజలు ముందువరసలో ఉండి పోరాడినవారే...!! ఫ్లొరైడ్ రక్కసి నుంచి తమ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ఇక్కడి బుద్ధిజీవులు చేయని పోరాటమంటూ లేదు..! సాక్షాత్తు ప్రధానిగా ఉన్న వాజ్ పేయ్ ను కూడా కన్నీళ్లు పెట్టించిన సందర్భాలు ఉన్నాయి. కేవలం పోరాటం ద్వారే కాదు... ఎన్నికల ప్రక్రియలోనూ సరికొత్త చరిత్రను లిఖించిన సందర్భాలు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఉంది. అయితే ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలోనూ తమ సత్తా చాటాలని... తమను మోసం చేస్తున్న పార్టీలను ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు డిండి ఎత్తిపొతల ప్రాజెక్ట్ భూనిర్వాసితులు. ఈ నేపథ్యంలో భూనిర్వాసితుల ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందని అధికార పార్టీ టీఆర్ఎస్ టెన్షన్ పడుతుంటే... ప్రతిపక్ష పార్టీలు మాత్రం వారిని తమవైపు ఎలా తిప్పుకోవాలని చూస్తున్నాయి. అయితే వారు మాత్రం పక్కా ప్లాన్ తో రాజకీయ పార్టీలకు సవాల్ విసిరే దిశగా కార్యాచరణను మొదలుపెట్టారు. ఇప్పుడు వీరి అంశం కూడా... నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.

తెరపైకి భూనిర్వాసితుల సమస్యలు...

charlagudem reservoir victims: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నల్గొండ జిల్లా పరిధిలో పలు రిజర్వాయర్లను నిర్మిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా మునుగోడు నియోజకవర్గం పరిధిలో శివన్నగూడెంతో పాటు కిష్టరాయంపల్లి పరిధిలో భారీ రిజర్వాయర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయటంతో ముమ్మరంగా పనులు కూడా జరుగుతున్నాయి. 2015 జూన్ 12న చర్లగూడెంలో శివన్నగూడెం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ స్వయంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భూములు ఇచ్చిన నిర్వాసితులకు భారీగా హామీలు ఇచ్చారు. ఎకరానికి ఐదు లక్షలతో పాటు ఇంటికో ఉద్యోగంతో పాటు ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తామని చెప్పారు. అయితే పనులు ప్రారంభమైనప్పటికీ... భూనిర్వాసితులకు తగిన పరిహారం అందలేదు. పైగా మల్లన్నసాగర్ లో ఎకరానికి పది లక్షలకు పైగా పరిహారం ఇవ్వటంతో... అదే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు ఇక్కడి నిర్వాసితులు. తమ డిమాండ్లను నేరవెర్చకుండా పనులు జరగనివ్వమంటూ తేల్చి చెబుతూ వచ్చారు. అప్పటి నుంచి... ఇవాళ్టి వరకు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. కలెక్టరేట్ ముట్టడి కూడా చేపట్టారు. ఈ విషయంలో ప్రభుత్వం... నిర్వాసితులతో జరిపి పలు అంశాలపై స్పష్టత ఇచ్చి పనులను ముందుకుసాగేలా ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ తమ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదుంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాజీనామా ఇప్పుడు వారికి ఆయుధంగా మారే ఛాన్స్ ఉంది. ఇదే అనుగుణంగా... ప్రభుత్వాన్ని కదిలించేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు భూనిర్వాసితులు...!!

నామినేషన్లు వేసేందుకు ప్లాన్...

మునుగోడు బై ఎన్నికలు రాబోతున్న తరుణంలో పోటీలో నిలబడేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో ఫ్లోరైడ్ రక్కసికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన విధంగానే బై పోల్ నేపథ్యంలో 100మందికి పైగా నామినేషన్లు వేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, 120 జీవో ప్రకారం పరిహారం, డబుల్ బెడ్రూం, ఇంటికి ఉద్యోగ కల్పన ప్రధాన డిమాండ్ తో పోరుబాట పట్టనున్నారు. నోటిఫికేషన్ రాగానే గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి భూ నిర్వాసితులను మరింత చైతన్యం తీసుకొచ్చేలా పావులు కదుపుతున్నారు. సుమారు 1200 కుటుంబాల ముంపు బాధితులు ఉండగా... ఎలాగైనా తమ సత్తా ఏంటో అధికార పార్టీకి చూపాలని చూస్తున్నారు.

డిమాండ్లు ఇవే....

భూసేకరణ చట్టంలోని 120 జీవో ప్రకారం మల్లన్నసాగర్ ప్రాజెక్టుల మాదిరిగా ఇవ్వాలని ఇక్కడి నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. భూ రిజిస్ట్రేషన్ వాల్యూ రెండుసార్లు ప్రభుత్వం పెంచినప్పటికీ నిర్వాసితులకు మాత్రం పరిహారం పెంచలేదు. ఎకరాకు 5లక్షల 15వేలు మాత్రమే ఇస్తుండటంతో పెంచాలంటున్నారు. కేంద్రం జారీ చేసిన 2013 జీవో భూసేకరణ చట్టం ప్రకారం ఇంటి నిర్మాణానికి లక్షా25వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించడంతో దానిని కూడా ఇక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. జీవో 120 ప్రకారం ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని కోరుతున్నారు.

గతంలోనూ ఇదే తరహాలో...

ఫ్లోరైడ్ కు ఉమ్మడి నల్గొండ జిల్లా కేరాఫ్ గా ఉండేది. అయితే సమస్యను తీర్చాలని... ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమాలు జరిగాయి.ఇక జలసాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్లోరోసిస్ విముక్తి కోసం సుదీర్ఘ ఉద్యమమే జరిగింది. ఈ అంశాన్ని జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయస్థాయికి కూడా తీసుకెళ్లారు. పలు వేదికలపై చర్చ జరిగేలా చూశారు. అయితే 1996లో నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల్లో 480 మంది నామినేషన్లు వేశారు. అప్పట్లో అత్యధికంగా నామినేెషన్లు వేసిన నియోజకవర్గంగా మునుగోడు చరిత్రపుటల్లో చేరింది. నాడు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి 2019లో జరిగిన ఎన్నికల్లో ఆర్మూరు, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల నుంచి 236 మంది రైతులు నామినేషన్లు వేశారు. ఇదీ కూడా దేశంలో పెద్ద చర్చే అయింది. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న కేసీఆర్ కుమార్తె కవిత ఓటమిపాలైన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఇదే రీతిలో మునుగోడు నియోజకవర్గ పరిధిలోని భూనిర్వాసితులు కూడా ప్లాన్ చేస్తున్నారు. భారీస్థాయిలో నామినేషన్లు వేసి... తమ సమస్యలపై చర్చ జరిగేలా వ్యూహలు రచిస్తున్నారు. చర్లగూడెం ప్రాజెక్టు పరిధిలోని నాలుగు గ్రామాల ప్రజలు ఇంటికో నామినేషన్ వేయాలని భావిస్తున్నారు.

మొత్తంగా మునుగోడు బైపోల్... రసవత్తరంగా సాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయపార్టీలు వ్యహాలు, ప్రతివ్యూహాలు రచించే పనిలో ఉంటే... భూనిర్వాసితులు కూడా ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు పావులు కదుపుతుండటంతో... ఆసక్తిగా మారింది.

IPL_Entry_Point