KTR vs Konda Surekha : మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్-ktr filed a defamation suit against minister konda surekha ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr Vs Konda Surekha : మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్

KTR vs Konda Surekha : మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్

Basani Shiva Kumar HT Telugu
Oct 10, 2024 02:06 PM IST

KTR vs Konda Surekha : కేటీఆర్ వర్సెస్ కొండా సురేఖ ఫైట్ ఇంకా కొనసాగుతోంది. తాజాగా మాజీమంత్రి కేటీఆర్.. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. అటు హీరో నాగార్జున కూడా మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు.

కేటీఆర్
కేటీఆర్

మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కొండా సురేఖపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు నాంపల్లి స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టును కోరుతూ.. కేటీఆర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ నెల 3వ తేదీన కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై కేటీఆర్ అనుచరులు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ కొండా సురేఖ ప్రెస్ మీట్‌లో సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ చాలామంది ఫోన్లు ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా.. నటి సమంత విడాకులకు కేటీఆరే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఘాటుగా స్పందించింది. కారు పార్టీకి చెందిన మహిళా కార్పోరేటర్లు కొండా సురేఖపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటు కేటీఆర్ కూడా కొండా సురేఖ కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకున్నారు. తనకు క్షమాపణలు చెప్పాలని నోటీసులు పంపారు. కొండా సురేఖ స్పందించకపోవడంతో.. పరువు నష్టం దావా వేశారు. దానిపై గురువారం విచారణ జరిగింది.

ఇటు హీరో అక్కినేని నాగార్జున కూడా మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు నాగార్జున మంగళవారం హాజరై స్టేట్‌మెంట్ ఇచ్చారు. నాగార్జునతో పాటు సాక్షులు సుప్రియ, వెంకటేశ్వర్లు కోర్టుకు హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖ వాస్తవ విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని.. దీంతో తమ కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లందని స్పష్టం చేశారు.

కోర్టుకు ఇచ్చిన స్టేట్మెంట్‌లో.. 'మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై అమర్యాద పూర్వక వ్యాఖ్యలు చేశారు. నా కుమారుడు నాగచైతన్య, సమంత విడాకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మా కుటుంబ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లింది. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి' అని నాగార్జున కోర్టుకు ఇచ్చిన స్టేట్మెంట్‌లో వివరించారు.

Whats_app_banner