KTR Padayatra : ప్రజల్లోకి బీఆర్ఎస్...! త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ పాదయాత్ర-ktr announced that he will do a state wide padayatra in the upcomming days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr Padayatra : ప్రజల్లోకి బీఆర్ఎస్...! త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ పాదయాత్ర

KTR Padayatra : ప్రజల్లోకి బీఆర్ఎస్...! త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ పాదయాత్ర

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 01, 2024 02:00 PM IST

పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో నెటిజన్లతో సంభాషించిన కేటీఆర్…పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపంగా మారిందని విమర్శించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో నెటిజన్లతో సంభాషించిన కేటీఆర్… పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపంగా మారిందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రం ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన పతనం నుంచి తెలంగాణ కోలుకోవడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన కొట్లాడడమే ప్రస్తుతం తమ బాధ్యతని చెప్పుకొచ్చారు.

పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయి పాదయాత్రను నిర్వహిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ సంపూర్ణ అరోగ్యంతో ఉన్నారని.. పార్టీకీ మార్గదర్శనం చేస్తున్నారని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. పార్టీ నేతలపై వేధింపులు, అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై తమ సోషల్ మీడియా వారియర్లు అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు.

2025లో కేసీఆర్ జనంలోకి వస్తారని కేటీఆర్ మరో ప్రశ్నకు బదులిచ్చారు. హామీలపై ఈ ప్రభుత్వానికి కావాలనే ఒక సంవత్సరం సమయం ఇచ్చామన్నారు. 2025లో కాంగ్రెస్ హామీలపై ప్రభుత్వాన్ని కేసీఆర్ నిలదీస్తారని చెప్పారు.

ప్రస్తుత రాజకీయాల్లో కుటుంబ సభ్యులను సైతం వదలడం లేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన 18 ఏళ్ల ప్రజా జీవితంలో తన కుటుంబసభ్యులు, పిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చారు. ఒక దశలో రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్నానని పేర్కొన్నారు. కానీ ప్రజల కోసం పోరాడాలని నిర్ణయించుకునే రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు తెలిపారు. హీరో విజయ్ కొత్త పార్టీపై నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ… బెస్ట్ విషెస్ అంటూ రిప్లే ఇచ్చారు. మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ… రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీని నమ్మవద్దని చెబుతానంటూ బదులిచ్చారు.

 

Whats_app_banner

సంబంధిత కథనం