Munugodu Bypoll: టీఆర్ఎస్ కు షాక్ మీద షాక్… ఫలిస్తున్న కోమటిరెడ్డి ప్లాన్స్..!-komatireddy rajgopal reddy master plans in munugodu over focus on trs leaders ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Munugodu Bypoll: టీఆర్ఎస్ కు షాక్ మీద షాక్… ఫలిస్తున్న కోమటిరెడ్డి ప్లాన్స్..!

Munugodu Bypoll: టీఆర్ఎస్ కు షాక్ మీద షాక్… ఫలిస్తున్న కోమటిరెడ్డి ప్లాన్స్..!

HT Telugu Desk HT Telugu
Sep 24, 2022 03:14 PM IST

bjp strategy in munugodu: తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు వార్ కీలకంగా మారింది. వచ్చే ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న ఈ పోరులో ప్రధాన పార్టీలు ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మాత్రం... తనదైన స్టైల్ లో దూసుకెళ్తున్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (ఫైల్ ఫొటో)
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (ఫైల్ ఫొటో) (twitter)

bjp on munugodu bypoll: రాష్ట్ర రాజకీయ పరిస్థితులను మార్చే ఉపఎన్నిక కావడంతో అందరి చూపు మునుగోడు వైపు మళ్లింది. కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు చేయటంతో పాటు గ్రౌండ్ లో సీరియస్ గా తిరిగేస్తోంది. ఇక ఆత్మీయ సమ్మేళనాల పేరుతో టీఆర్ఎస్ కూడా ఓ మాత్రం తగ్గటం లేదు. వీరిద్దరూ ఇలా ఉంటే... బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ధీటుగా పావులు కదిపేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను తనవైపు తిప్పేసుకుంటున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలను బీజేపీలోకి రప్పించటంలో సక్సెస్ అవుతున్నారు. ఈ పరిణామాలే రెండు ప్రధాన పార్టీలకు మింగుడుపడటం లేదు.

కీలక నేతలపై ఫోకస్...

ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న వేళ రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో పావులు కదిపేస్తున్నారు. ఓవైపు క్షేత్రస్థాయిలో తిరుగుతూనే స్థానికంగా బలంగా ఉన్న నేతలపై ఫోకస్ పెడుతున్నారు. వారిని తనవైపు తిప్పుకునేలా అడుగులు వేస్తున్నారు. బలం పెంచుకునేందుకు పూర్తిగా చేరికపైనే దృష్టి పెట్టారు. వారం రోజుల నుంచి ప్రజా ప్రతినిధులను, నాయకులను రాజగోపాల్‌ రెడ్డి పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన పలువురిని బీజేపీలో రప్పించటంలో పక్కా ప్లాన్స్ వేస్తూ సక్సెస్ అవుతున్నారు.

తాజాగా చండూరు జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం(టీఆర్ఎస్) ను బీజేపీలో చేరారు.ఈ పరిణామం అధికార టీఆర్ఎస్ గట్టి షాక్ ఇచ్చేలా చేసింది. గట్టుప్పల్ కు చెందిన కొందరూ ముఖ్య నేతలు కూడా కాషాయకండువా కప్పేసుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని పలువురు సర్పంచ్‌లను, వార్డు సభ్యులను, ఇతర పార్టీ కార్యకర్తలను పదుల సంఖ్యలో రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ పరిణామాలన్నీ టీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. పలువురు ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీలు కూడా చేపడుతోంది అధికార పార్టీ. అయితే బీజేపీ నేతలు మాత్రం... తమదైన శైలిలో కౌంటర్లు విసురుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్ కూడా చేర్చుకుందని... వాటిపై ఏం చెబుతారని ప్రశ్నిస్తోంది. చౌటుప్పల్ మండల పరిధిలోని పలువురు ప్రజాప్రతినిధులు కూడా బీజేపీకి గూటికి చేరారు.

మొత్తంగా అధికార పార్టీకి మునుగోడు ఉప ఎన్నిక సవాల్ గా మారిన నేపథ్యంలో ఈ చేరికలు కూడా నిద్రలేకుండా చేస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. కీలక నేతలు రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్తుండటంతో కేడర్ డైలామాలో పడిపోతుంది. అయితే నేతలు వెళ్లినంత మాత్రన కేడర్ అలాగే ఉందని... మునుగోడులో గెలిచేది తామే అంటూ టీఆర్ఎస్ చెబుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా టీఆర్ఎస్, బీజేపీలో చేరిపోయారు. అయితే నాయకత్వం మాత్రం... ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా కార్యాచరణను రూపొందించింది. కీలక నేతలంతా నియోజకవర్గంలో తిరిగేలా ముందుకెళ్తోంది.

మరోవైపు స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసిన బీజేపీ... శనివారం భేటీ అయింది. మునుగోడు ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం వంటి పలు అంశాలపై చర్చించనుంది.ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

WhatsApp channel