KTR : అందుకే కవిత అరెస్ట్ కాలేదు, అంతేకానీ బీజేపీతో ఎలాంటి అవగాహన లేదు - కేటీఆర్-kavitha not arrested thanks to sc intervention no understanding with bjp k t rama rao ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr : అందుకే కవిత అరెస్ట్ కాలేదు, అంతేకానీ బీజేపీతో ఎలాంటి అవగాహన లేదు - కేటీఆర్

KTR : అందుకే కవిత అరెస్ట్ కాలేదు, అంతేకానీ బీజేపీతో ఎలాంటి అవగాహన లేదు - కేటీఆర్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 12, 2024 09:54 PM IST

BRS Party News : బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ బీజేపీకి 'బీ' టీమ్ కాబోదన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్ లో మాట్లాడిన ఆయన.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ సుప్రీంకోర్టు జోక్యం వల్లే జరగలేదని చెప్పారు. అంతేకానీ బీఆర్ఎస్ - బీజేపీ మధ్య ఎలాంటి అవగాహన లేదన్నారు.

కేటీఆర్
కేటీఆర్ (BRS Twitter)

BRS Working President K T Rama Rao: బీఆర్‌ఎస్‌కు బీజేపీ బీ టీమ్ అయితే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టేదా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ బీ టీమ్ కాదని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మాట్లాడిన కేటీఆర్…. కవిత అరెస్టు కాకపోవడానికి సుప్రీంకోర్టు జోక్యం తప్ప బీజేపీతో ఎలాంటి అవగాహన లేదన్నారు.

yearly horoscope entry point

ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ ఓడించిందని గుర్తు చేశారు కేటీఆర్. బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య అవగాహన కుదిరిందని ఆరోపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి బీఆర్‌ఎస్‌ను ఓడించాయని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్, బీజేపీల మధ్య కుదిరిన అవగాహన కారణంగానే ఇటీవల రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపించారు కేటీఆర్. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ తీరుపై హైకోర్టును ఆశ్రయించినా బీఆర్‌ఎస్‌కు నిరాశే ఎదురైందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ మతాన్ని వాడుకుంటోందని విమర్శించిన కేటీఆర్… యాదాద్రిలోని ప్రసిద్ధ నరసింహ స్వామి ఆలయం నుంచి అక్షతలు పంపిణీ చేసి ఉంటే నల్గొండ, భువనగిరి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిచేదేమో అంటూ కామెంట్స్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం యాదాద్రి ఆలయాన్ని పెద్దఎత్తున పునరుద్ధరించిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నిజమైన లౌకిక పార్టీ అని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌ను పూర్తిగా ప్రజలు తిరస్కరించలేదన్నారు కేటీఆర్. ప్రజలు తప్పు చేశారనడం సరికాదని… రెండుసార్లు మనల్ని గెలిపించింది కూడా మన ప్రజలే అని చెప్పారు.. 14 చోట్ల వందల్లో, వేలల్లో మాత్రమే మనకు మెజార్టీ తగ్గిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు సమీక్షించుకోవాలని,,, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించాలని కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేశారు.

మరోవైపు సంక్రాంతి పండగ సందర్భంగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలకు రేపటి నుండి ఈ నెల 16 వరకు విరామం ఇచ్చారు. మళ్ళీ 17 వ తేదీ నుంచి యథావిధిగా సమావేశాలు సాగుతాయని బీఆర్ఎస్ పార్టీ వెల్లడించింది. 16న జరగాల్సిన నల్గొండ పార్లమెంటు సన్నాహక సమావేశం ఈ నెల 22న జరుగుతుందని పేర్కొంది.

Whats_app_banner