Karimnagar Politics : హీటెక్కిన కరీంనగర్ మున్సిపల్ రాజకీయం, మేయర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు-karimnagar municipal politics sc st atrocity case registered on mayor sunil rao on corporator complaint ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Politics : హీటెక్కిన కరీంనగర్ మున్సిపల్ రాజకీయం, మేయర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

Karimnagar Politics : హీటెక్కిన కరీంనగర్ మున్సిపల్ రాజకీయం, మేయర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

HT Telugu Desk HT Telugu
Oct 09, 2024 10:28 PM IST

Karimnagar Politics : కరీంనగర్ మున్సిపల్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. మేయర్ వర్సెస్ కార్పొరేటర్ ఫైట్ లో ఉద్యోగులు నలిగిపోతున్నారు. ఇప్పటికే మేయర్ పై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాగా... కమిషనర్ పై కూడా కేసు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హీటెక్కిన కరీంనగర్ మున్సిపల్ రాజకీయం, మేయర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
హీటెక్కిన కరీంనగర్ మున్సిపల్ రాజకీయం, మేయర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

కరీంనగర్ మున్సిపల్ రాజకీయాలు కలకలం సృష్టిస్తున్నాయి. మేయర్ వర్సెస్ కార్పొరేటర్ ల మధ్య ఆఫీసర్స్ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. దళిత వర్గానికి చెందిన కార్పొరేటర్ మెండి శ్రీలత ఫిర్యాదుతో మేయర్ వై.సునీల్ రావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ తేజస్విని ఫిర్యాదుతో కార్పొరేటర్ శ్రీలత భర్త చంద్రశేఖర్ అరెస్టు అయి జైల్ పాలై బెయిల్ పై విడుదలయ్యారు. శ్రీలత చంద్రశేఖర్ దంపతులు ఎస్సీ కమిషన్ తోపాటు కోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుత మేయర్ పై కేసు నమోదయింది. త్వరలో కమిషనర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. పాలకవర్గంలో నెలకొన్న సమన్వయ లోపంతో అధికారులు పావులుగా మారుతున్నారు. గత కొంతకాలంగా మున్సిపల్ కార్పొరేషన్ పని తీరు రాజకీయ విమర్శలకు వేదికై కేసులో పెట్టుకునే స్థాయికి వెళ్ళింది. తాజాగా 44 డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత మేయర్ తన పట్ల వివక్షత చూపుతూ కులం పేరుతో దూషించారని.. దళితులకు నిధులు కేటాయించాలనే రూల్ ఉందా? అంటు వ్యాఖ్యానించి అవమాన పరిచారనే ఫిర్యాదుతో మేయర్ సునీల్ రావుపై టూ టౌన్ పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన మేయర్ సునీల్ రావు గడిచిన ఏడాది కాలంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ తో సయోధ్య కుదరకపోవడం.. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తో తరుచూ పలు వేదికలను పంచుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో మేయర్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎస్సీ మహిళా కార్పొరేటర్ మెండి శ్రీలత మేయర్ తనను రెండుమార్లు కులం పేరుతో దూషించారంటూ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే కొంతకాలంగా ఈ ఫిర్యాదును పోలీసులు పెండింగ్ లో పెట్టడంతో శ్రీలత ఎస్సీ కమీషన్ తో పాటు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశంతో మేయర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

శ్రీలత భర్త చంద్రశేఖర్ అరెస్టు..బెయిల్ పై విడుదల

మేయర్ తో వైరం పెట్టుకున్న కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్ దంపతులకు అటు అధికారులతో సైతం సఖ్యత లేకుండా పోయింది. ఇటీవల ఓ భవన నిర్మాణానికి సంబంధించిన సమస్యను టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ తేజస్విని దృష్టికి చంద్రశేఖర్ తీసుకెళ్లగా టీపీఎస్ కు చంద్రశేఖర్ కు మధ్య చోటు చేసుకున్న వాగ్వివాదం వివాదాస్పదంగా మారింది. టీపీఎస్ తేజస్విని కంటతడి పెడుతూ కమిషనర్ కు చంద్రశేఖర్ పై ఫిర్యాదు చేయగా వెనువెంటనే చంద్రశేఖర్ టీపీఎస్ తీరు పై కమిషనర్ ను కలిసేందుకు ప్రయత్నించగా కమిషనర్ ఆగ్రహంతో గేట్ ఔట్ అంటు మండిపడ్డారు. దీంతో చంద్రశేఖర్ సైతం కమీషనర్ తో వాగ్వివాదం చోటుచేసుకుంది. చంద్రశేఖర్ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు దాడికి యత్నించాడని, ఫైల్ ఎత్తుకెళ్లారని వన్ టౌన్ పోలీసులకు టీపీఎస్ ఫిర్యాదు చేశారు.

వన్ టౌన్ పోలీసులు చంద్రశేఖర్ పై కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. బెయిల్ పై ఇటీవల విడుదలైన చంద్రశేఖర్ దళితుడను కావడంతోనే కమీషనర్ వివక్షత చూపుతూ అవమాన పరిచారని కమీషనర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పోలీసులు పెండింగ్ లో పెట్టడంతో కోర్టును ఆశ్రయించారు. ఎస్సీ కమీషన్ కు సైతం పిర్యాదు చేశారు. త్వరలో కమిషనర్ పై సైతం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పరస్పరం కేసులతో రాజకీయ దుమారం

మేయర్ సునీల్ రావు కార్పొరేటర్ దంపతులు శ్రీలత చంద్రశేఖర్ మధ్య పొలిటికల్ వార్ అధికారుల మెడకు ఉచ్చు బిగిసేలా మారుతుంది. ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ ప్రముఖులు జోక్యం చేసుకున్నా ఫలితం లేకుండా పోయిందని ప్రచారం జరిగుతుంది. పొన్నం ప్రభాకర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మేయర్, మంత్రి ఒకే వేదికను పంచుకోకపోవడం.. మేయర్ తరుచూ మంత్రి పొన్నం ప్రభాకర్ పై విమర్శలు గుప్పించడం కాంగ్రెస్ వర్గాలకు ఆగ్రహం తెప్పించింది. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం మున్సిపల్ సమీక్షా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే, మేయర్ కు సమాచారం కూడా ఇవ్వకపోవడంతో మేయర్ మరోమారు ఫైర్ అయ్యారు.

ఇటీవల సెక్రటేరియట్ లో జరిగిన స్మార్ట్ సిటీ సమావేశానికి కూడా మేయర్ ఉన్నతాధికారులతో మాత్రమే సమావేశమై వెనుదిరగగా.. ఆ తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులతో కలిసి స్మార్ట్ సిటీ పనుల ప్రగతిపై సమీక్షించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వంలో సునీల్ రావు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరి మేయర్ అయ్యారు. పలుమార్లు పొన్నం తీరును సునీల్ రావు ఫైర్ అయ్యారు. ప్రతికారంగా పొన్నం, మేయర్ ను ఇరకాటంలో పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఆసక్తిని రేకెత్తిస్తున్న రాజకీయాలు

కరీంనగర్ మున్సిపల్ రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. స్వపక్షంలోనే విపక్షమై విమర్శలు సంధించుకున్న పరిస్థితుల్లో మేయర్ అటు అధికార పార్టీకి ఇటు విపక్షానికి కొరగాని కోయగా మారారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మేయర్ సునీల్ రావుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ శ్రీలతతో పాటు ఇటీవల డిప్యూటీ మేయర్ స్వరూప రాణి, నగర బీఆర్ఎస్ అద్యక్షుడు హరిశంకర్ విమర్శలు గుప్పించారు. మేయర్ అమెరికా టూర్ తో మేయర్, డిప్యూటీ మేయర్ మధ్య అంతర్గతంగా నెలకొన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్యే జోక్యంతో వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరకుండా సద్దుమణికినప్పటికీ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన మెండి శ్రీలతతో పాటు పలువురు కార్పొరేటర్ లు మేయర్ పై గుర్రుగా ఉన్నారు. మేయర్ మాత్రం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరస్పరం కేసులు, విమర్శలు మున్సిపల్ రాజకీయాలు సర్వత్రా చర్చనీయంశంగా మారాయి.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ , హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం