Karimnagar Hotels Raids : ప్రజారోగ్యంతో ప్రముఖ హోటళ్ల చెలగాటం, కాలం చెల్లిన పదార్థాలతో ఆహారాలు తయారీ!
Karimnagar Hotels Raids : కరీంనగర్ లో ప్రముఖ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు, సరైన ప్రమణాలు పాటించకుండా ఆహార పదార్థాల తయారీని గుర్తించి చర్యలు తీసుకున్నారు.
Karimnagar Hotels Raids : కాలం చెల్లిన ఆహార పదార్థాలు.. వారం పదిరోజుల క్రితం వండిన వంటకాలు.. అపరిశుభ్రమైన వాతావరణంతో ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నాయి హోటళ్లు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా చెలగాటం ఆడుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ఎక్స్ ఫైరీ ఆహార పదార్థాలు బయటపడ్డాయి. కరీంనగర్ లో ప్రముఖ హోటళ్లలో... ఫుడ్ సేప్టీ డిపార్ట్మెంట్ కమిషనర్ ఆదేశంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. శ్వేత, ప్రతిమతోపాటు పలు హోటళ్లలో వరంగల్ కు చెందిన అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృత శ్రీ నేతృత్వంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించింది. తనిఖీలలో కాలం చెల్లిన ఆహార ఉత్పత్తులు, వండిన వంటకాలను గుర్తించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో కాలం చెల్లిన ఆహార పదార్థాలను చూసి పుడ్ సేప్టీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్ఘాంతపోయారు. స్టార్ హోటళ్లను తలపించేలా ఉండే హోటళ్లలో అపరిశుభ్రమైన వాతావరణంలో వంటకాలను, కాలం చెల్లిన ఆహార పదార్థాలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ నిర్వాహకులను మందలించి జరిమానా విధించి తదుపరి చర్యలకు పైఅధికారులకు సిపార్సు చేశారు.
జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తాం
ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఫుడ్ సేప్టీ డిపార్ట్మెంట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు శ్వేత హోటల్ లో 70 వేల రూపాయల విలువ చేసే కాలం చెల్లిన ఫుడ్ ఐటమ్ గుర్తించారు. వారం క్రితం వండి స్టోర్ చేసిన పుడ్ ను గుర్తించారు. కిచెన్ రూమ్ తోపాటు స్టోర్ రూమ్ లను క్షుణంగా తనికీ చేసి ఆహార పదార్థాలు ఎక్కువ శాతం కాలం చెల్లినవిగా గుర్తించారు. హోటల్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి జరిమానా విధిస్తున్నట్లు అసిస్టెంట్ పుడ్ కంట్రోలర్ అమృత శ్రీ తెలిపారు. తనిఖీలు నిరంతరాయంగా కొనసాగిస్తామని తెలిపారు. నగరంలోని అన్ని హోటళ్లలో తనిఖీలు చేస్తామని చెప్పారు. ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యంగా ఫుడ్ సేప్టీ కమిషనర్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాజా మెస్ పై చర్యలు ఏవి?
నగరంలో ప్రముఖ హోటళ్లపై తనిఖీలు చేసిన పుడ్ సేప్టీ అధికారులను నిలదీసినంత పనిచేశారు సామాజిక వేత్తలు. నగరంలో అనేక హోటళ్లు అపరిశుభ్రమైన వాతావరణంలో వంటకాలు తయాలు చేసి నాణ్యత లేని భోజనాల పెడుతున్నారని ఆరోపించారు. ఇదివరకు కోతిరాంపూర్ లోని రాజా మెస్ లో బిర్యానీలో బొద్దింక వచ్చిందని ఫిర్యాదు చేస్తే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అదే విధంగా రహదారి ప్రక్కన ఉండే హోటళ్లు, దాబాలలో సరైన ప్రమాణాలు పాటించకుండా వంటకాలు తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం అడుతున్నారని ఆలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఇప్పటికైనా ఫుడ్ సెప్టీ అధికారులు నిరంతరాయంగా తనిఖీలు చేసి నాణ్యత లేని అపరిశుభ్రంగా ఉండే హోటళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాత్రి వరకు నగరంలోని పలు హోటళ్లలో తనిఖీలు చేసిన అధికారులు నాణ్యత ప్రమాణాలు పాటించనివారిపై చర్యలకు ఉన్నతాధికారులకు సిపార్సు చేస్తామని ప్రకటించారు.
HT తెలుగు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి
సంబంధిత కథనం