Congress Protest : రాహుల్ గాంధీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు-భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు-karimnagar congress leaders protest demands arrest tanwider singh comments on rahul gandhi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Congress Protest : రాహుల్ గాంధీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు-భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు

Congress Protest : రాహుల్ గాంధీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు-భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు

HT Telugu Desk HT Telugu
Sep 18, 2024 06:13 PM IST

Congress Protest : దిల్లీ బీజేపీ నేత తన్వీదర్ సింగ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీకి పట్టిన గతే రాహుల్ కు పడుతుందని తీవ్రంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. తన్వీదర్ సింగ్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

రాహుల్ గాంధీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు-భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు
రాహుల్ గాంధీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు-భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు

Congress Protest : దిల్లీ బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తన్వీదర్ సింగ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. పలు చోట్ల సింగ్ దిష్టిబొమ్మలు దగ్దం చేశారు. తన్వీదర్ సింగ్ అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తు ధర్నా రాస్తారోకో లు చేశారు. లేకపోతే భౌతిక దాడులు తప్పవని హెచ్చరించారు.

కరీంనగర్ లో స్వల్ప ఉద్రిక్తత

రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీదర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆందోళన కరీంనగర్ లో స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది.‌ తెలంగాణ చౌక్ లో సింగ్ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు దిష్టిబొమ్మ దగ్దం చేయకుండా అడ్డుకుని దిష్టిబొమ్మను లాక్కెళ్లారు. మరో వైపు నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు దిష్టి బొమ్మ దగ్దం చేశారు. ఇందిరా చౌక్ లో రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు.‌ ఆందోళనలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ పర్సన్ ఇన్ ఛార్జి విలాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి పాల్గొని బీజేపీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాలుక కోస్తాం...ముక్కలు చేస్తాం...సుడా ఛైర్మన్ నరేందర్ రెడ్డి

దిల్లీ బీజేపీ నాయకుడు సింగ్ ఖబడ్దార్ అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హెచ్చరించారు. ఇంకోసారి రాహుల్ గాంధీని ఉద్దేశించి అనుశ్చిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తామని, ముక్కలు ముక్కలు చేస్తామని హెచ్చరించారు. హోంశాఖ మంత్రి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. భారత్ కు దిక్సూచిగా ఉన్న రాహుల్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఉర్కోబోమన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం అయితే భౌతిక దాడులు చేయక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పెట్టిన భిక్ష తో 3 సార్లు ఎంఎల్ఏ అయిన సింగ్, గాంధీ అంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చూపెడతారు అనుకుంటున్నావా? ఖబడ్దార్ అని పద్మాకర్ రెడ్డి అన్నారు.

బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలి -వెలిచాల రాజేందర్ రావు డిమాండ్

తన్వీదర్ సింగ్ ను బీజేపీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జి వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ చేశారు. దిల్లీ పోలీసులు వెంటనే అతన్ని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాహుల్ గాంధీని బయటకు వస్తే చంపేస్తామని, మీ నానమ్మ ఇందిరా గాంధీకి పట్టిన గతే నీకు పడుతుందని బీజేపీ నేత తన్వీదర్ సింగ్ బహిరంగంగా మాట్లాడినా ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. దిల్లీ పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా వెనుక నుంచి అలా మాట్లాడించి ఉంటారనే అనుమానం కలుగుతుందని ఆరోపించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారిని చూస్తూ ఊరుకుంటే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు సంభవించే అవకాశం ఉందని, అలాంటి వారిని విడిచి పెట్టవద్దని సూచించారు.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం