Sitaram Yechury's death: సీతారాం ఏచూరి మృతిపై రాహుల్ గాంధీ సంతాపం-protector of idea of india rahul gandhi others on sitaram yechurys death ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sitaram Yechury's Death: సీతారాం ఏచూరి మృతిపై రాహుల్ గాంధీ సంతాపం

Sitaram Yechury's death: సీతారాం ఏచూరి మృతిపై రాహుల్ గాంధీ సంతాపం

Sudarshan V HT Telugu
Sep 12, 2024 06:15 PM IST

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) గురువారం కన్నుమూశారు. గత 20 రోజులుగా ఆయన శ్వాసకోశ సమస్యతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. సీతారాం ఏచూరి మృతిపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్బ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

సీతారాం ఏచూరితో రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)
సీతారాం ఏచూరితో రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో) (PTI)

సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న సీపీఎం ప్రధాన కార్యదర్శి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించడంతో గురువారం కన్నుమూశారు. సీతారాం ఏచూరి మృతిపై పలువురు రాజకీయ నాయకులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

రాహుల్ గాంధీ సంతాపం

ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (rahul gandhi) సీతారాం ఏచూరిని ‘‘మన దేశంపై లోతైన అవగాహన ఉన్న భారతదేశం అనే భావనను పరిరక్షించే వ్యక్తి’’ అని అభివర్ణించారు. ‘‘మేం జరిపిన సుదీర్ఘ చర్చలను మిస్ అవుతున్నాను. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఏచూరి మంచి మనిషి అని, అలుపెరగని మార్క్సిస్టు అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కొనియాడారు. ‘‘మా అనుబంధం మూడు దశాబ్దాలకు పైగా కొనసాగింది మరియు మేము వివిధ సందర్భాల్లో సన్నిహితంగా కలిసి పనిచేశాము. ఆయనకు రాజకీయ రంగాలకు అతీతంగా స్నేహితులు ఉన్నారు’’ అని జైరాం రమేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

మమత బెనర్జీ సంతాపం

సీతారాం ఏచూరిని మరణం జాతీయ రాజకీయాలకు తీరని లోటని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. 'సీతారాం ఏచూరి కన్నుమూశారని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన సీనియర్ పార్లమెంటేరియన్. ఆయన మరణం జాతీయ రాజకీయాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, సహచరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని మమతా బెనర్జీ (mamata banerjee) ట్వీట్ చేశారు. సీపీఐ (ఎం) నాయకుడు సీతారాం ఏచూరి నిరాడంబరతను, ప్రజా విధానంపై లోతైన అవగాహనను తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ సోషల్ మీడియా పోస్ట్ లో గుర్తు చేశారు. ‘‘సీపీఎం (cpm) సీనియర్ నేత సీతారాం ఏచూరి మరణవార్త విని చాలా బాధపడ్డాను. గత కొన్నేళ్లుగా అనేక ప్రతిపక్ష సమావేశాల్లో ఆయనతో మాట్లాడే భాగ్యం నాకు కలిగింది. ఆయన నిరాడంబరత, ప్రజావిధానంపై లోతైన అవగాహన, పార్లమెంటరీ వ్యవహారాలపై లోతైన అవగాహన నిజంగా చెప్పుకోదగినవి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి!' అని పోస్ట్ చేశారు.