West Bengal rape case : పశ్చిమ్ బెంగాల్ అత్యాచారం- హత్య కేసు నిందితుడికి మరణ శిక్ష
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమెను హత్య చేసిన నిందితుడికి పశ్చిమ్ బెంగాల్‌లోని ఓ కోర్టు మరణ శిక్ష విధించింది. గతేడాది ఈ ఘటన జరగ్గా, తాజాగా తీర్పును వెలువరించింది.
మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి పశ్చిమ్ బెంగాల్‌లోని సిలిగురి కోర్టు మరణ శిక్ష విధించింది. కోల్‌కతా వైద్యురాలి రేప్, హత్య కేసులో న్యాయం జరగాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్న తురణంలో ఈ వార్తకు ప్రాధాన్యత సంతరించుకుంది.
గతేడాది ఈ ఘటన జరగ్గా, కేసులో నిందితుడు ఎండీ అబ్బాస్‌కు అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి మరణశిక్ష విధించారు.
“నిందితుడికి మరణ శిక్ష విధించాలని మేము గతంలో కోరాము. ఎందుకంటే నిందితుడిపై రుజువైన అన్ని సెక్షన్లలోని మూడు సెక్షన్స్‌లో ఉరి శిక్ష ఉంది. ఇదే విషయంపై గంటన్నర పాటు విచారణ జరిగింది. ఇది అరుదైన కేసు,” అని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బివాస్ ఛటర్జీ తెలిపారు. సెక్షన్ 302, పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద మరణశిక్ష విధించారని ఛటర్జీ వెల్లడించారు.
33 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి ప్రాసిక్యూషన్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న అదనపు సెషన్స్ జడ్జి అనితా మెహ్రోత్రా మాథుర్ ఈ కేసును ముగించారు.
2023 ఆగస్టు 21న పాఠశాలకు వెళ్తున్న మైనర్ బాలిక సిలిగురి మాటిగర పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతంలో దారుణంగా అత్యాచారం, హత్యకు గురైంది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నేరం జరిగిన ఆరు గంటల్లోనే నిందితుడు ఎండీ అబ్బాస్‌ను అరెస్టు చేశారు.
కోల్‌కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌పై అత్యంత పాశవికంగా అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ తీర్పు వెలువడింది. ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్‌ని పోలీసులు అరెస్టు చేశారు. రాయ్ ఒక్కడే ఈ దారుణానికి పాల్పడ్డాడని, ఈ ఘటనలో గ్యాంగ్ రేప్ జరగలేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ట్రయల్ కోర్టుకు ఇచ్చిన రిమాండ్ నోట్లో పేర్కొంది.
రేప్ కేసుల్లో ఇలాంటి తీర్పులు..
ఎర్నాకుళం జిల్లాలో 2016లో 30 ఏళ్ల న్యాయ విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసులో ఏకైక దోషి మహ్మద్ అమీర్ ఉల్ ఇస్లాంకు ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను కేరళ హైకోర్టు ఈ ఏడాది మేలో సమర్థించింది.
అసోంకు చెందిన ఓ 22 ఏళ్ల వలస కూలీ.. 2016 ఏప్రిల్ 28న పెరుంబవూర్ సమీపంలోని ఓ యువతి ఇంట్లోకి చొరబడి దారుణానికి పాల్పడి పారిపోయాడు. తల్లితో కలిసి నివసిస్తున్న లా విద్యార్థిని తన నివాసంలో హత్యకు గురైంది. హత్యకు ముందు ఆమెపై అత్యాచారం చేసి పదునైన ఆయుధాలతో దారుణంగా కొట్టారని పోలీసులు తెలిపారు.
ఐదేళ్ల క్రితం గురుగ్రామ్‌లోని ఓ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన 'భండారా'కు బయలుదేరిన మూడేళ్ల బాలికను అపహరించి, హత్య చేసిన కేసులో 28 ఏళ్ల వ్యక్తికి ఈ ఏడాది ఫిబ్రవరిలో సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. 2018 నవంబర్ 11న ఈ దారుణం జరిగింది.
అడిషనల్ సెషన్స్ జడ్జి శశి చౌహాన్ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఫిబ్రవరి 3న అతడిని దోషిగా తేల్చింది.
ఐపీసీ సెక్షన్ 376ఏబీ (12 ఏళ్ల లోపు మహిళపై అత్యాచారం), సెక్షన్ 302 (హత్య) కింద అతనికి మరణశిక్ష, రూ.25 వేల జరిమానా విధించింది.