Sitaram Yechury death: వామపక్ష రాజకీయాల పట్టుగొమ్మ సీతారాం ఏచూరి; విద్యార్థి దశ నుంచే ఎర్ర జెండా పట్టిన నేత-sitaram yechury the stalwart of left wing politics a leader who carried the red flag since his student days ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sitaram Yechury Death: వామపక్ష రాజకీయాల పట్టుగొమ్మ సీతారాం ఏచూరి; విద్యార్థి దశ నుంచే ఎర్ర జెండా పట్టిన నేత

Sitaram Yechury death: వామపక్ష రాజకీయాల పట్టుగొమ్మ సీతారాం ఏచూరి; విద్యార్థి దశ నుంచే ఎర్ర జెండా పట్టిన నేత

Sudarshan V HT Telugu
Sep 12, 2024 05:10 PM IST

Sitaram Yechury: భారతదేశంలో వామపక్ష రాజకీయాలకు, సామ్యవాద సిద్ధాంతాలకు దశాబ్దాలుగా ఆచరణాత్మక మద్ధతుదారుగా నిలిచిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం ఢిల్లీలో కన్నుమూశారు.

వామపక్ష రాజకీయాల పట్టుగొమ్మ సీతారాం ఏచూరి
వామపక్ష రాజకీయాల పట్టుగొమ్మ సీతారాం ఏచూరి (HT_PRINT)

Sitaram Yechury: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి క‌న్నుమూశారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో సీతారాం ఏచూరి ఆగ‌స్టు 19న ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌)లో చేరారు. అప్ప‌టి నుంచి స్పెషలిస్ట్‌ల డాక్టర్ల బృందం ఆయ‌కు వైద్యం అందించారు. ఏడుగురు డాక్ట‌ర్ల బృందం ఆయ‌న‌కు వైద్యం అందించింది. సీతారాం ఏచూరి పరిస్థితి మెరుగవుతోందని ఆగ‌స్టు 31న సీపీఎం తెలిపింది. అయితే మ‌ళ్లీ కొన్ని రోజుల‌కే ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని మరో ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేట‌ర్‌పైన‌ తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వ్యాధితో దాదాపు 23 రోజుల చికిత్స అనంత‌రం వాయ‌న క‌న్నుమూశారు. ఆయనకు 72 ఏళ్లు.

వామపక్ష, ప్రగతిశీల, లౌకిక ఉద్యమాల నాయకుడు

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త. వామపక్ష, ప్రగతిశీల, లౌకిక ఉద్యమాల నాయకుడు. ఆయ‌న‌ ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత అయిన సీమా చిస్తీని వివాహం చేసుకున్నారు. బీబీసి ఢిల్లీ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లలో పనిచేసిన సీమా చిస్తీ ప్రస్తుతం 'ది వైర్' ఎడిటర్‌గా ఉన్నారు. సీతారాం ఏచూరి (Sitaram Yechury) పిల్లలైన అఖిల ఏచూరి ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం, సెయింట్ ఆండ్రూస్ యూనివర్శిటీ అధ్యాపకురాలుగా ఉన్నారు. కుమారుడు, జర్నలిస్టు ఆశిష్ ఏచూరి 2021 ఏప్రిల్ 22న క‌రోనాతో మ‌ర‌ణించారు.

2015 లో తొలిసారి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా..

1975 లో సీపీఎంలో చేరిన సీతారాం ఏచూరి పార్టీలో పలు బాధ్యతలను నిర్వర్తించారు. అందులో

  • 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ సీపీఎం అఖిల భార‌త మ‌హాస‌భ‌లో తొలిసారిగా ఏచూరి పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు.
  • మళ్లీ తెలంగాణ‌లోని హైదరాబాద్‌ (2018)లో జ‌రిగిన 22వ అఖిల భార‌త మ‌హాస‌భ‌, కేర‌ళ‌లోని కన్నూర్ (2022)లో జ‌రిగిన 23 అఖిల భార‌త మ‌హాస‌భ‌ల్లో వ‌రుస‌గా రెండు, మూడు సార్లు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
  • 1985లో కేంద్ర క‌మిటీ స‌భ్యుడు అయ్యారు. 1992లో చెన్నైలో జరిగిన 14వ పార్టీ అఖిల భార‌త మ‌హాస‌భ‌లో పొలిట్‌బ్యూరో సభ్యుడయ్యారు.
  • 2005 నుంచి 2017 వరకు బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. సిపిఎం రాజ్యసభ పక్ష నేతగా, పార్టీ సెంట్రల్ వీక్లీ పీపుల్స్ డెమోక్రసీ సంపాదకుడిగా పనిచేశారు.
  • ప్రజా సమస్యలపై, మతతత్వం, నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఏచూరి పార్లమెంటులో అత్యుత్తమ ప్ర‌సంగాలు చేశారు.
  • రవాణా, పర్యాటకం, సాంస్కృతి స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా, ఆయ‌న‌ ముఖ్యమైన నివేదికల తయారీకి నాయకత్వం వహించాడు.
  • 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం, 2004లో మొదటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఆయ‌న యూపీఏ, లెఫ్ట్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడుగా ఉన్నారు.
  • 2014 నుండి ఏచూరి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం, ఆందోళనలకు నాయకత్వం వహించారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్ర‌తిపక్షాల మ‌ధ్య ఐక్యతను ఏర్పరచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సమస్యాత్మక జమ్మూ-కాశ్మీర్, మణిపూర్ సహా ప్రాంతాలను సందర్శించారు.

జేఎన్‌యూ నుంచి రాజకీయ జీవితం

జేఎన్‌యూలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఎస్‌ఎఫ్‌ఐలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత జాయింట్‌ సెక్రటరీగా, ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1975 లో సీపీఎంలో అధికారికంగా చేరారు. 1984లో పార్టీ కేంద్ర కమిటీలో శాశ్వత సభ్యునిగా చేరారు. 1985లో జరిగిన 12వ పార్టీ అఖిల భార‌త మ‌హాస‌భ‌లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

సీనియర్ నాయకులతో కలిసి..

పి. సుందరయ్య, ఇఎంఎస్, బిటిఆర్, హరికిషన్ సింగ్ సూర్జిత్, బసవ పున్నయ్య, జ్యోతిబసు వంటి సీనియర్ నాయకులతో కలిసి పనిచేశారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఏచూరి ఆటోమొబైల్ ఇంజనీర్. ప్రభుత్వ అధికారి అయిన తల్లి కల్పకం ఏచూరి సామాజిక కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకునేవారు.

1952 లో జననం

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ‌కు చెందిన సర్వేశ్వర సోమయాజులు ఏచూరి చెన్నైలో నివసిస్తున్నప్పుడు 1952 ఆగస్టు 12న సీతారాం ఏచూరి జన్మించారు. సోమయాజులు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో ఉద్యోగంలో చేరడంతో కుటుంబం హైదరాబాద్‌కు వెళ్లింది. తన తండ్రి తరచూ స్థానచలనం చెందడం వల్ల సీతారాం ఏచూరి అమ్మమ్మ దగ్గర పెరిగారు. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా ఏచూరి మేన‌మామ.

హైదరాబాద్ లో విద్యాభ్యాసం

ఏచూరి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు హైద‌రాబాద్‌లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్‌లో చదివారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమం సమయంలో న్యూఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్ 11వ తరగతి చదివారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఈ) హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్‌లో ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించాడు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి అర్థ‌శాస్త్రంలో బిఎ ఆనర్స్ పూర్తి చేశారు. అర్థ‌శాస్త్రంలో ఎంఎ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU)లో పూర్తి చేశారు. రెండింటిలోనూ ప్రథమ శ్రేణిని సాధించారు. పిహెచ్‌డి కోసం జెఎన్‌యులో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో ఆయ‌న అరెస్టు కావడంతో పీహెచ్డీ పూర్తి చేయలేకపోయారు.

ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం

1975లో ఎమర్జెన్సీ సమయంలో జెఎన్‌యులో విద్యార్థిగా ఉన్నప్పుడే ఏచూరి అరెస్టయ్యారు. అతను అరెస్టుకు ముందు, ఎమర్జెన్సీకి ఆందోళ‌న నిర్వ‌హించ‌డంతో కొంతకాలం ర‌హస్య‌ జీవితం గ‌డిపారు. ఎమర్జెన్సీ త‌రువాత ఏడాదిలోనే (1977-78) మూడోసారి జెఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. జెఎన్‌యులో అజేయమైన వామపక్ష కోటను సృష్టించడంలో ప్రకాష్ కారత్‌తో పాటు సీతారాం ఏచూరి కీలకపాత్ర పోషించారు.

సోషలిస్ట్ దేశాల్లో పర్యటనలు

ఏచూరి పార్టీ అంతర్జాతీయ విభాగానికి నేతృత్వం వహించారు. పార్టీ ఆయ‌న‌ను చాలా సోషలిస్ట్ దేశాల పార్టీ సమావేశాలకు ప్రతినిధిగా పంపించేది. 1978లో ఏచూరి ఎస్ఎఫ్ఐ అఖిల భారత జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1984లో ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడిగా బాధ్య‌తలు నిర్వ‌ర్తించారు. తన రాజకీయ జీవితం ప్రారంభం నుండి లౌకిక, ప్రజాస్వామ్య ప్రజానుకూల ప్రభుత్వాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయ‌న‌ ఎల్లప్పుడూ ప్రజల ప్రాథమిక హక్కుల కోసం పోరాడారు. "భిన్నత్వంలో ఏకత్వం" ఉండాల‌ని ఆయ‌న స్ప‌ష్టంగా చెబుతారు. హింసకు వ్యతిరేకంగా ఆయన ఎప్పుడూ తన స్వరం ఎత్తారు.

హిందూస్థాన్ టైమ్స్‌లో ‘లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్‌’

సీతారాం ఏచూరి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. జాతీయ మీడియాలో ఎన్నో చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. ఎన్నో పుస్తకాలు రాశారు. హిందూస్థాన్ టైమ్స్‌లో పక్షం రోజుల కాలమ్ ‘లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్‌’ను రాసేవారు. ఏచూరి జూలై 2005లో పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయ‌న‌ అనేక సమస్యలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమైన సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తారు.

మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా..

2015 మార్చి 3 పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగానికి ఏచూరి ఒక సవరణను ప్రవేశపెట్టారు. రాజ్యసభలో దీనిపై ఓటింగ్ జ‌రిగి ఏచూరి తీర్మానం ఆమోదం పొందింది. ఇది మోదీ ప్రభుత్వానికి ఇబ్బందిని తెచ్చిపెట్టింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్ర‌తిపక్షాలు చేసిన సవరణ ఆమోదం పొందడం రాజ్యసభ చరిత్రలో ఇది నాలుగోసారి. అమెరికా విదేశాంగ విధానాన్ని ఏచూరి తీవ్రంగా విమర్శించేవారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటనను కూడా ఆయన విమర్శించారు. అమెరికా ఆధిపత్య వైఖరికి కూడా తీవ్రంగా వ్య‌తిరేకించేవారు.

- జగదీశ్వరరావు జరజాపు

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు