Sitaram Yechury health : సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమం- దిల్లీకి సీపీఎం నేతలు!-sitaram yechury health worsens updates delhi aiims ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sitaram Yechury Health : సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమం- దిల్లీకి సీపీఎం నేతలు!

Sitaram Yechury health : సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమం- దిల్లీకి సీపీఎం నేతలు!

HT Telugu Desk HT Telugu
Sep 10, 2024 01:07 PM IST

Sitaram Yechury health updates : దిల్లీ ఎయిమ్స్​లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలో సీపీఎం కీలక నేతలు దిల్లీకి బయలుదేరారు.

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి..
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.. (PTI)

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు సీపీఎం కేంద్ర కార్యాలయం మంగళవారం హెల్త్ బులెటిన్​ని విడదల చేసింది. దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో ఏచూరి చికిత్స పొందుతున్నారని, ఆయన వెంటిలేటర్​పై ఉన్నారని తెలిపింది. ఈ సమయంలో క్లిష్టంగా ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితిని మల్టీ-డిసిప్లీనరీ వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు మురళీధరన్ తెలిపారు.

శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో సీతారాం ఏచూరి ఆగ‌స్టు 19న దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌)లో చేరారు. అప్ప‌టి నుంచి స్పెషలిస్ట్‌ల డాక్టర్ల బృందం ఆయ‌కు వైద్యం అందిస్తున్నారు. ఏడుగురు డాక్ట‌ర్ల బృందం ఆయ‌న‌కు వైద్యం అందిస్తోంది. వాస్తవానికి ఎయిమ్స్​ చేరిన తర్వాత సీతారాం ఏచూరి ఆరోగ్యం మెరుగుపడింది. ఈ విషయాన్ని ఆగ‌స్టు 31న సీపీఎం తన బులిటెన్‌లో వెల్లడించింది. డాక్ట‌ర్ల ఇస్తున్న వైద్యానికి ఆయ‌న స‌హ‌క‌రిస్తున్నార‌ని, ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని పేర్కొంది. కొద్దిమేర ప‌రిస్థితి బాగుండ‌టంతో ఆయ‌న‌ను ఎమర్జెన్సీ వార్డు నుంచి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కి కూడా మార్చారు. సెప్టెంబర్ 5 వ‌ర‌కు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి ఆయ‌న‌కు వైద్యం అందించారు. అయితే సెప్టెంబర్ 6న రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో ఒక్క‌సారిగా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి సంక్లిష్టంగా మారింది. దీంతో ఆయ‌న‌్ని వెంటిలేట‌ర్‌పైకి మార్చారు.

తాజాగా సోమవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. దీంతో సీపీఎం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో సీపీఎం కీలక నేతలంతా దిల్లీకి బయలుదేరారు. సీపీఎం ‌పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్. పుణ్యవతి దిల్లీకి చేరుకున్నారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న బీవీ రాఘవులు, అనంతరం హైదరాబాద్ ‌నుంచి దిల్లీకి వెళ్లారు.

గత 20 రోజులుగా సీతారాం ఏచూరి ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వస్తోంది. ఇటీవ‌లి ఆయ‌న‌కు ఎయిమ్స్‌లో కంటి ఆప‌రేష‌న్ కూడా జ‌రిగింది.

సీతారాం ఏచూరి గురించి..

కాకినాడ వాసి అయిన ఏచూరి తెలుగు రాష్ట్రాల్లో సుప‌రిచితులు. తెలుగు రాజ‌కీయాల‌పై త‌న పాత్ర‌ను ఎంతో ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో పార్ల‌మెంట్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు జ‌రుగుతున్న అన్యాయంపై గ‌ల‌మెత్తారు. అలాగే తెలంగాణ హ‌క్కుల గురించి కూడా మాట్లాడారు. పార్ల‌మెంట‌రీ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న సీతారాం ఏచూరి ప్ర‌భుత్వాల ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ప‌దునైనా విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టేవారు. క‌మ్యూనిస్టుల మ‌హోన్న‌తులైన పీ. సుందరయ్య, ఈఎంఎస్, బీటీఆర్, హరికిషన్ సింగ్ సూర్జిత్, బసవ పున్నయ్య, జ్యోతిబసు వంటి సీనియర్ నాయకులతో సీతారాం ఏచూరి కలిసి పనిచేశారు.

--జగదీశ్వరరావు జరజాపు

సంబంధిత కథనం

టాపిక్