CPM Leaders Meets CBN: చంద్రబాబుకు సీపీఎం నేతల అభినందనలు, పోలవరం బాధితులకు పరిహారం, ప్రజా సమస్యలపై వినతులు-cpm leaders congratulations to chandrababu compensation for victims of polavaram pleas on public issues ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cpm Leaders Meets Cbn: చంద్రబాబుకు సీపీఎం నేతల అభినందనలు, పోలవరం బాధితులకు పరిహారం, ప్రజా సమస్యలపై వినతులు

CPM Leaders Meets CBN: చంద్రబాబుకు సీపీఎం నేతల అభినందనలు, పోలవరం బాధితులకు పరిహారం, ప్రజా సమస్యలపై వినతులు

Sarath chandra.B HT Telugu
Jul 26, 2024 06:58 AM IST

CPM Leaders Meets CBN: ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల హామీలను నెరవెర్చే క్రమంలో డిఎస్సీ ఉద్యోగాల భర్తీ, పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఉత్తర్వులు ఇచ్చినందుకు సీపీఎం పార్టీ నేతలు సిఎం చంద్రబాబును అభినందించారు.

సీఎం చంద్రబాబుకు వినతి పత్రం ఇస్తున్న సీపీఎం నేతలు
సీఎం చంద్రబాబుకు వినతి పత్రం ఇస్తున్న సీపీఎం నేతలు

CPM Leaders Meets CBN: ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును సిపిఎం పార్టీ నేతలు అభినందించారు. గురువారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు యం.ఏ.గఫూర్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్.బాబురావు, కె ప్రభాకర్ రెడ్డి కలిసి ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై సీఎంకు అభినందనలు తెలిపారు.

ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు మెగా డీఎస్సీ ప్రకటించి 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు నిర్ణయం, పెన్షన్లు రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంపు, త్వరలో అన్నక్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై సంతకాలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం నుండి రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు సాధించాలని సీఎంను కోరారు.

సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం ఇవ్వాలని, పోలవరం నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరారు. టిడ్కో ఇళ్లు పూర్తి చేయడంతో పాటు మౌళిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందించాలన్నారు.

ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, మెగా డిఎస్సీ వంటి ఐదు ముఖ్యమైన ఫైల్స్‌పై సంతకం చేసి అమల్లోకి తీసుకురావడాన్ని హర్షిస్తున్నట్టు సిపిఎం నేతలు పేర్కొన్నారు. ‘సూపర్‌ 6’తో సహా కొన్ని వాగ్దానాలు అమలు జరిపేందుకు కాల పరిమితితో కూడిన షెడ్యూలును ప్రకటించగలరని సీపీఎం నేతలు చంద్రబాబును కోరారు. దీర్ఘ కాలిక ప్రణాళికలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ఐదు సంవత్సరాలలో అమలు చేయగలిగిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని సూచించారు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి అన్యాయం జరిగిందని, దాన్ని సరిదిద్దేందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామని పార్లమెంట్‌లో ప్రకటించిందని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసినా అది ఇంతవరకు ఆచరణ రూపం ధరించలేదని గుర్తు చేశారు. ఈ హామీకి విరుద్ధంగా పార్లమెంటులో ప్రత్యేక హోదా ఇవ్వలేమని పదే పదే ప్రకటించిందని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో కూడా మీరు భాగస్వామిగా ఉన్నందువల్ల ప్రత్యేక హోదాను పట్టు పట్టి సాధించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర విభజన సందర్భంగా ప్రకటించిన అనేక పథకాలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని, కడప ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం జాతీయ ప్రాజెక్టుకు, దాని నిర్మాణంలో ముఖ్యభాగమైన నిర్వాసితుల పునరావాసానికి నిధులు, రాజధాని నిర్మాణం, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి, విశాఖ రైల్వే జోన్‌, కేంద్ర విద్యా సంస్థలు ఇంతవరకు పూర్తి కాలేదు. అవసరమైన నిధులు కేటాయించలేదు. ఈ బడ్జెట్‌లోనైనా న్యాయం జరుగుతుందనుకుంటే నిరాశ మిగిలింది. కావున మీ ప్రభుత్వం తరపున శ్రద్ద తీసుకొని అన్ని పక్షాలను కూడగట్టి కేంద్రం నుండి సత్వర న్యాయం జరిగేటట్లు చూడగలరని కోరారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరించుకునేటట్లు ఒత్తిడి చేయాలని, విశాఖకు సొంత గనులు కేటాయించాలని, పెట్టుబడి సమకూర్చేలా కేంద్రంపై ఒత్తిడి చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న గనులను కేటాయించాలని సూచించారు. . రుణ సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలని, ప్రైవేటీకరణ జరగకుండా లాభాల బాటలో నడిపేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కాపాడాలని సీపీఎం నేతలు కోరారు.

పోలవరం నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం, అలాగే రాజ్యాంగం 5వ షెడ్యూలు నిబంధనల ప్రకారం భూమికి భూమితో పాటు నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీ తాజాపరిచి అమలు చేయాలి. ప్రస్తుతం 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఆర్‌అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలి. షెడ్యూల్‌ ప్రాంతంలోనే వారికి కాలనీలు నాణ్యత కలిగినవి కట్టించి ఇవ్వాలని, కాలనీలలో నివాసయోగ్యమైన సౌకర్యాలు అన్నిటిని కల్పించాలని డిమాండ్ చేశారు.

Whats_app_banner