Kolkata Doctor Rape Case : కోల్‌కతా హత్యాచార బాధితురాలికి నివాళిగా 'సారీ' చెప్పిన మమతా బెనర్జీ!
Kolkata Doctor Rape Case Updates : పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఆర్‌జి కర్ ఆసుపత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనపై నిరసనలు ఇంకా వ్యక్తమవుతూనే ఉన్నాయి. తాజాగా బంగాల్ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. మరోవైపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాళిలో భాగంగా బాధితురాలికి క్షమాపణలు చెప్పారు.
ఆగస్టు 28న బెంగాల్ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. టీఎంసీ పార్టీ విద్యార్థి విభాగమైన తృణమూల్ ఛత్ర పరిషత్ వ్యవస్థాపక దినోత్సవాన్ని కోల్‌కతా హత్యాచార బాధితురాలికి అంకితం చేశారు.
'ఈ రోజు తృణమూల్ ఛత్ర పరిషత్ వ్యవస్థాపక దినోత్సవాన్ని నా సోదరికి అంకితం చేస్తున్నాను. కొన్ని రోజుల క్రితం ఆర్‌జి కర్ ఆసుపత్రిలో జరిగిన విషాదకరమైన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను. సత్వర న్యాయం కోరుతున్న బాధితురాలి కుటుంబానికి, ఇలాంటి అమానవీయ చర్యలకు గురైన భారతదేశంలోని అన్ని వయసుల మహిళలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షమించండి.' అని మమతా బెనర్జీ అన్నారు.
బాధితురాలికి న్యాయం చేయాలంటూ నబన్నా అభియాన్ నిరసన ర్యాలీ హింసాత్మకంగా మారిన మరుసటి రోజే మమతా బెనర్జీ సోషల్ మీడియా ఇలా పోస్ట్ చేశారు. మరోవైపు బీజేపీ బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చింది. బుధవారం ఎలాంటి బంద్‌కు ప్రభుత్వం అనుమతించబోదని మమతా బెనర్జీ ముఖ్య సలహాదారు అలపన్ బందోపాధ్యాయ తెలిపారు. బీజేపీ పిలుపును ప్రజలు పాటించవద్దని, సాధారణ జనజీవనం దెబ్బతినకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
బస్సులు, రైళ్లు సహా ప్రజా రవాణా సేవలు యథావిధిగా నడుస్తాయని అధికారులు తెలిపారు. దుకాణాలు, మార్కెట్లు, ఇతర వ్యాపార సంస్థలు తెరిచే ఉంచాలని ఆదేశించారు.
మంగళవారం పశ్చిమ్ బంగా ఛత్ర సమాజ్, ఇతర సంస్థలు కోల్‌కతాలో నిర్వహించిన ర్యాలీ కాలేజ్ స్క్వేర్ నుంచి ప్రారంభమై పశ్చిమబెంగాల్ సెక్రటేరియట్ నబన్నాలో ముగిసింది. ఆందోళనకారులు పోలీసు బారికేడ్లను బద్దలుకొట్టి అధికారులతో ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత జరిగింది. హౌరాలోని సంత్రాగచ్చి వద్ద ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు.
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీగా చేస్తున్న 31 ఏళ్ల యువతి దారుణంగా హత్యాచారానికి గురైంది. ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా నిరసనలు, వైద్యుల సమ్మెలకు దారితీసింది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కేసు సీబీఐకి వెళ్లింది. సీబీఐ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఇప్పటికే నిందితుడితోపాటుగా మరికొందరికి పాలిగ్రాఫ్ పరీక్షలు చేశారు.