Kamareddy Crime : కామారెడ్డిలో దారుణం, కన్న కూతుర్ని మంటల్లోకి విసిరేసిన కిరాతక తండ్రి
Kamareddy Crime : కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ తండ్రి కన్న కూతురిని మంటల్లోకి విసిరేశాడు.
Kamareddy Crime : మద్యం మత్తులో ఓ తండ్రి కిరాతకుడిగా మారిపోయాడు. కన్న కూతుర్ని(7) మంటల్లోకి విసిరేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బరంగెడ్గిలో ఆదివారం చోటుచేసుకుంది. బరంగెడ్గి గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలున్నారు. పాఠశాలకు సెలవు కావడంతో ఇద్దరు చిన్నారులు ఇంటి వద్ద ఆడుకుంటున్నారు. ఆ సమయంలో సాయిలు ఇంటి పక్కనే ఉన్న గొట్టల గంగాధర్‌కు చెందిన గడ్డివాముకు నిప్పు అంటుకుని కాలిపోయింది. ఈ విషయమై గంగాధర్ సాయిలుతో గొడవపడ్డాడు. మీ పాపే గడ్డివాముకు నిప్పుపెట్టిందని గంగాధర్ సాయిలుతో గొడవకు దిగాడు. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న సాయిలు కోపంతో తన కుమార్తె అంకితను కాలుతున్న గడ్డి వాములో పడిశాడు. అక్కడే ఉన్న గంగాధర్ వెంటనే గడ్డివాములోకి దూకి చిన్నారిని రక్షించాడు. చిన్నారి అంకితకు కాళ్లు, చెయ్యి కాలడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాలిక ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మద్యం మత్తుల్లో కిరాతకంగా వ్యవహరించిన సాయిలుపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇద్దరు పిల్లల్ని హత్య చేసి తల్లి?
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి కన్న బిడ్డలను తేర్చించింది. ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన కర్నూలు జిల్లా కౌతాళం మండలం హాల్విలో శనివారం చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న రామకృష్ణ, శారదమ్మ భార్యాభర్తలు, శనివారం వీరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపంతో శారదమ్మ తన ఇద్దరి పిల్లల్ని నీటి బకెట్ లో ముంచి హత్య చేసింది. ఆ తర్వాత తాను వాస్మాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను చికిత్స కోసం ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై హాల్వి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేసు నమోదు
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... హాల్వి గ్రామంలో ఉంటున్న రామకృష్ణ, శారద దంపతులకు వెంకటేష్(3), భరత్( ఆరు నెలలు) కుమారులు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం శారద ఇద్దరు కుమారులను నీటి బకెట్లో ముంచింది. దీంతో పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. భర్త రామకృష్ణతో కలిసి పిల్లలను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే ఇద్దరు పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్ట్ మార్టం నిమిత్తం చిన్నారుల మృతదేహాలను ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు చిన్నారులను చంపినట్లు తెలిస్తే కుటుంబ సభ్యులు ఊరుకోరన్న భయంతో శారద వాస్మాయిల్ తాగింది. ఇంట్లో వాళ్లు గమనించి శారదను ఆసుపత్రికి తరలించారు. శారద తన పిల్లలను కావాలనే చంపిందా? లేదంటే క్షణికావేశంలో జరిగిందా? అనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు అంటున్నారు.