Jagtial : ఆఫీస్‌లో లిక్కర్ దావత్.. జగిత్యాల ఫారెస్ట్ రేంజ్ అధికారి అరుణ్ కుమార్ సస్పెండ్-jagtial forest range officer arun kumar suspended due to liquor party in office ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagtial : ఆఫీస్‌లో లిక్కర్ దావత్.. జగిత్యాల ఫారెస్ట్ రేంజ్ అధికారి అరుణ్ కుమార్ సస్పెండ్

Jagtial : ఆఫీస్‌లో లిక్కర్ దావత్.. జగిత్యాల ఫారెస్ట్ రేంజ్ అధికారి అరుణ్ కుమార్ సస్పెండ్

Basani Shiva Kumar HT Telugu
Oct 14, 2024 01:58 PM IST

Jagtial : ఫారెస్ట్ ఆఫీసులో పార్టీ చేసుకున్న ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. జగిత్యాల ఫారెస్ట్ రేంజ్ అధికారిని సస్పెండ్ చేశారు. ఈ ఇష్యూపై విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తయ్యాక మరికొందరిపై వేటు పడే అవకాశం ఉంది. ఈనెల 11న ఫారెస్ట్ ఆఫీసులో పార్టీ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఫారెస్ట్ ఆఫీసులో అధికారుల విందు
ఫారెస్ట్ ఆఫీసులో అధికారుల విందు

జగిత్యాల ఫారెస్ట్ రేంజ్ అధికారి అరుణ్ కుమార్ సస్పెండ్ అయ్యారు. ఆయన్ను సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు చీఫ్ కన్జర్వేటర్ శరవణన్. ఈ నెల 11న జగిత్యాల అటవీ శాఖ కార్యాలయంలో దావత్ ఏర్పాటు చేసి.. అధికారులు, సిబ్బంది మద్యం సేవించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. విచారణ అనంతరం మరికొందరిపై వేటు పడే అవకాశం ఉంది.

జగిత్యాల ఫారెస్ట్ ఆఫీస్‌లో లిక్కర్ దావత్ చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వన్య ప్రాణి మాంసంతో ఫారెస్ట్ ఆఫీసర్లు దసరా దావత్ చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నెమలి, అడవి పంది మాంసంగా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఫారెస్ట్ ఆఫీసులో పార్టీ చేసుకున్న వారు తిన్న మాంసం శాంపిల్ తీసుకుని ల్యాబ్‌కి పంపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శాంపిల్‌కు పంపిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ దావత్‌లో జిల్లా ఫారెస్ట్ సిబ్బంది, కొందరు బీట్, సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే.. పార్టీ జరుగుతుండగా.. కొందరు మీడియా ప్రతినిధులు ఇదేంటని ప్రశ్నించగా.. వారిపట్ల దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది.

దీనిపై మీడియా ప్రతినిధులు జిల్లా అటవీశాఖ అధికారిని వివరణ కోరగా.. నిజంగానే ఫారెస్ట్ ఆఫీసులో ఇలాంటి పనులు చేస్తే.. శాఖా పరమైన చర్యలు ఉంటాయని జిల్లా అధికారి స్పష్టం చేశారు. ఇటు నెటిజన్లు ఈ ఘటనపై సెటైర్లు వేస్తున్నారు. వారికి మాత్రం దసరా పండగ లేదా అని పంచ్‌లు పేలుస్తున్నారు. తాజాగా పార్టీ చేసుకున్న వారిపై వేటు పడింది.

జూన్ నెలలో ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. రవాణాశాఖ కార్యాలయంలో బీరు తాగుతూ విధులు నిర్వహించిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి సురేశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. అతడి పేరును బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు.. జిల్లా ట్రాన్స్‌పోర్ట్‌ అధికారి, ఎంవీఐ ఎండీ గౌస్‌పాషాకు ఉన్నతాధికారులు ఛార్జ్‌మెమో జారీ చేశారు. కార్యాలయంలోకి మద్యం తీసుకొచ్చిన ఇద్దరు ఆర్టీఏ ఏజెంట్లు మధు, సాధిక్‌తోపాటు సురేశ్‌పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Whats_app_banner