Raksha Bandhan Tragedy: సోదరులకు రాఖీ కట్టి తుదిశ్వాస విడిచిన చెల్లి.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం
Raksha Bandhan Tragedy: రాఖీ పండగ రోజున మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. సోదరులకు రాఖీ కట్టిన గంటల వ్యవధిలోనే ఓ చెల్లి తుదిశ్వాస విడిచింది. దీంతో ఆ కుటుంబలో విషాదం నెలకొంది. అయితే.. ఆమె మృతికి కారణం ఓ ఆకతాయి అని తెలుస్తోంది.
రాఖీ పండగ రోజున మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో విషాదం జరిగింది. సోదరులకు రాఖీ కట్టిన ఆమె గంటల వ్యవధిలోనే చనిపోయింది. కోదాడలో డిప్లొమా చదువుతున్న యువతిని ప్రేమ పేరుతో ఆకతాయిలు వేధించారు. వేధింపులను తట్టుకోలేక ఆ యువతి గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆసుపత్రిలో కొన ఊపిరితో ఉన్న యువతి.. రాఖీ పండగ నాటికి ప్రాణాలతో ఉంటానో లేదోనని బాధతో.. శనివారం రాత్రే సోదరులకు రాఖీ కట్టింది. రాఖీ కట్టిన కొన్ని గంటల్లోనే ప్రాణం వదిలింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
రాఖీ పండగ సమయంలోనే తమ సోదరి చనిపోవడంతో.. ఆమె సొదరులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ సోదరి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై నర్సింహులపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అతనిపై ఎస్సీ ఎస్టీ, పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వేధింపులకు గురి చేసిన ఆకతాయి కోసం గాలిస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని యువతి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.