TG Liquor Sales : వామ్మో.. 9 రోజుల్లోనే రూ.713 కోట్ల మద్యం తాగేశారు.. బీర్ల కంటే లిక్కర్ అమ్మకాలే ఎక్కువ!
TG Liquor Sales : తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. దసరా పండగ నేపథ్యంలో.. కేవలం 9 రోజుల్లోనే 7 వందల కోట్ల రూపాయలకు పైగా అమ్మకాలు జరిగాయి. శుక్రవారం లిక్కర్ విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో దసరా ముందు మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. కేవలం 9 రోజుల్లో రూ.713.25 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. శనివారం దసరా కావడంతో.. శుక్రవారం సేల్స్ ఎక్కువగా జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే రూ.350 కోట్ల అమ్మకాలు అదనంగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈసారి బీర్ల కంటే.. లిక్కర్ అమ్మకాలే ఎక్కువ జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
మందు బాబులకు బ్యాడ్ న్యూస్..
దసరా పండగ వేళ మందుబాబులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు అధికారులు. రెండ్రోజుల పాటు మద్యం దుకాణలు బంద్ కానున్నాయి. నిర్మల్ జిల్లాలో 2 రోజులు మద్యం దుకాణాలు మూసివేయాలని జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు గురువారం (అక్టోబర్ 10) రోజున ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్లో ఈనెల 12న దుర్గాదేవి నిమజ్జనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. అక్టోబర్ 13 ఉదయం 10 గంటల వరకు మద్యం దుకాణలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ముధోల్, భైంసాలో 13న దుర్గాదేవి నిమజ్జనం సందర్భంగా అక్టోబర్ 12 ఉదయం 10 నుంచి అక్టోబర్ 14 ఉదయం 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూసేయాలని ఆదేశించారు. సున్నితమైన ప్రాంతాల్లో ఎటువంటి ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. దసరా పండగ వేళ మంద్యం దుకాణాలు మూసివేయటంపై మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో దోపిడి..
ఏపీ.. ప్రభుత్వ మద్యం దుకాణాలకు మంగళం పాడాలని కూటమి సర్కారు నిర్ణయించింది. దీంతో మద్యం దుకాణాల్లో గత రెండు వారాలుగా కొరత ఏర్పడింది. మొదట్లో దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో విక్రయాలకు అంతరాయం ఏర్పడింది. విధిలేని పరిస్థితుల్లో విక్రయాలు చేస్తున్నా ఎటూ పోయే ఉద్యోగం ఉంటే ఎంత, పోతే ఎంత అనుకుని అందిన కాడికి వసూలు చేస్తున్నారు.
ప్రతి బాటిల్‌పై రూ.10 నుంచి రూ.25వరకు బ్రాండ్‌ను బట్టి అదనంగా వసూలు చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు పూర్తిగా మూతబడనుండటంతో ప్రభుత్వ దుకాణాల్లో విక్రయాలపై ఆంక్షల్ని లెక్క చేయడం లేదు. ఏపీబీసీఎల్ నుంచి మద్యం దుకాణాలకు సరఫరా చేసే బ్రాండ్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. దుకాణాలకు బదులు బార్‌లకు సరఫరా చేయడం మేలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు.
(Disclaimer : మద్యపానం ఆరోగ్యానికి హానికరం)