Sr Citizen Act: పెద్దపల్లి జిల్లాలో సీనియర్ సిటిజన్ యాక్ట్ అమలు.. తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు-implementation of senior citizen act in peddapally district cancellation of gift deed of son who ignores father ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sr Citizen Act: పెద్దపల్లి జిల్లాలో సీనియర్ సిటిజన్ యాక్ట్ అమలు.. తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు

Sr Citizen Act: పెద్దపల్లి జిల్లాలో సీనియర్ సిటిజన్ యాక్ట్ అమలు.. తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు

HT Telugu Desk HT Telugu
Sep 06, 2024 07:38 AM IST

Sr Citizen Act: తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు బిడ్డలకు షాక్ ఇచ్చారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష.‌ వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్ ను పట్టించుకోకుంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ అమలు చేయక తప్పదని స్పష్టం చేశారు.కొడుకు పేరిట ఉన్న గిఫ్ట్ డీడ్ రద్దుచేసి ఆరు ఎకరాలను తిరిగి తండ్రీ పేరిట మార్చారు.

తల్లిదండ్రుల్ని పట్టించుకోని కొడుకు  గిఫ్ట్‌ డీడ్ రద్దు చేసిన పెద్దపల్లి కలెక్టర్
తల్లిదండ్రుల్ని పట్టించుకోని కొడుకు గిఫ్ట్‌ డీడ్ రద్దు చేసిన పెద్దపల్లి కలెక్టర్

Sr Citizen Act: తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు, కూతుళ్లకు షాక్ ఇచ్చారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.‌ వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్ ను పట్టించుకోకుంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ అమలు చేయక తప్పదని స్పష్టం చేశారు. తండ్రిని పట్టించుకోని కొడుకు పేరిట ఉన్న గిఫ్ట్ డిడిని రద్దుచేసి ఆరు ఎకరాల భూమిని తిరిగి తండ్రీ పేరిట మార్చారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ అమలు చేసిన తొలి కలెక్టర్ గా రికార్డుకు ఎక్కారు.

ధర్మారం మండలం పైడిచింతలపల్లి గ్రామానికి చెందిన గడ్డం బాపురెడ్డి తన కుమారుడైన గడ్డం స్వామిరెడ్డికి వివిధ సర్వే నంబర్లలోని తనకున్న 6 ఎక రాల 5 గుంటల భూమిని గిఫ్ట్ డీడ్ చేశారు. అయితే కొంతకాలంగా తన బాగోగులు చూసుకోవట్లేదని కొడుకుపై పెద్దపల్లి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.

దీంతో విచారణ చేపట్టిన ఆర్డీవో.. స్వామిరెడ్డికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా కొడుకు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన బాపురెడ్డి గతంలో తన కొడుకు పేరిట చేసిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసేందుకు దరఖాస్తు సమర్పించారు. ఆ దరఖాస్తును అప్పీలుగా స్వీకరించి ఇరువర్గాలకు నోటీసులు జారీ చేసి కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరిపారు. ఆర్డీవో ఉత్తర్వుల అమల్లో స్వామిరెడ్డి నిర్లక్ష్యం వహించినట్లు కలెక్టర్ నిర్ధారించారు.

తల్లిదండ్రులను పట్టించుకోకుంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవు... కలెక్టర్.

వయోవృద్ధుల సంక్షేమ చట్టం-2007 ప్రకారం గడ్డం బాపురెడ్డి కొడుకు పేరిట చేసిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసి తిరిగి తండ్రి పేరిట బదిలీ చేయాలని నిర్ణయించారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు పేరిట చేసిన ఆస్తి గిఫ్ట్ డీడ్ ను తిరిగి తండ్రి పేరిట బదిలీ చేస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు. తండ్రి పోషణకు ప్రతి నెలా రూ. 10 వేలను ఆయన బ్యాంకు ఖాతాలో జమ చేయాలని కుమారుడు స్వామి రెడ్డి, కుమార్తె సింగిరెడ్డి లతను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. తల్లి దండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత సంతానంపై ఉంటుందని.. ఈ విషయంలో నిర్లక్ష్యం చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.

కలెక్టర్ నిర్ణయం తో సర్వాత్రా హర్షం

సీనియర్ సిటిజన్ యాక్ట్ ను అమలు చేసి కొడుకు బిడ్డకు తగిన బుద్ధి చెప్పిన కలెక్టర్ తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. నవమాసాలు మోసి పేగు తెంచుకుని పుట్టిన పిల్లల భాగోగుల కోసం పేరెంట్స్ పడరాని పాట్లు పడి పిల్లలను ప్రయోజకుల్ని చేస్తే కొందరు బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా నిర్లక్ష్యంగా చూస్తున్నారని సీనియర్ సిటిజన్ తెలిపారు.

అలాంటి వారికి సీనియర్ సిటిజన్ యాక్ట్ ద్వారా బుద్ది చెప్పాలని కోరుతున్నారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ గురించి విస్తృతంగా ప్రచారం చేసి తల్లిదండ్రుల పట్ల కఠినంగా వ్యవహరించే పిల్లలకు తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner