YS Sharmila On Sajjala : మీ సంబంధాలు మాకు అవసరం లేదు, సజ్జలకు వైఎస్ షర్మిల కౌంటర్-hyderabad ysrtp president ys sharmila counter to sajjala on congress alliance ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ys Sharmila On Sajjala : మీ సంబంధాలు మాకు అవసరం లేదు, సజ్జలకు వైఎస్ షర్మిల కౌంటర్

YS Sharmila On Sajjala : మీ సంబంధాలు మాకు అవసరం లేదు, సజ్జలకు వైఎస్ షర్మిల కౌంటర్

Bandaru Satyaprasad HT Telugu
Nov 06, 2023 04:41 PM IST

YS Sharmila On Sajjala : జగన్ పై అక్రమ కేసులు పెట్టిన కాంగ్రెస్ తో కలిశారన్న సజ్జల వ్యాఖ్యలపై...వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. తిరిగి సంబంధం పెట్టుకోవాలనుకుంటే, మీ సంబంధాలు మాకు అవసరం లేదన్నారు.

వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల

YS Sharmila On Sajjala : వైఎస్ జగన్ పై అక్రమ కేసులు పెట్టి వేధించిన కాంగ్రెస్ తో షర్మిల జట్టుకట్టారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. సజ్జల వ్యాఖ్యలపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. తాను తెలంగాణ రాజకీయాలకు వచ్చినప్పుడు మాకు సంబంధం లేదన్న సజ్జల.. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తిరిగి సంబంధం పెట్టుకోవాలనుకుంటే.. మాకు మీ సంబంధాలు అవసరం లేదన్నారు. సజ్జల అయినా జగన్ అయినా ఒకటే సమాధానమని, మీ కథ మీరు చూసుకోండని స్పష్టంచేశారు.

సజ్జలకు కౌంటర్

గతంలో వైఎస్ఆర్టీపీతో సంబంధం లేదన్న సజ్జల, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని షర్మిల ప్రశ్నించారు. మాతో సంబంధం గురించి సజ్జలనే అడగాలని, ఆయనే సమాధానం చెప్పాలన్నారు. సింగిల్ రోడ్డు ఉంటే ఏపీ, డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ, చీకట్లు ఉంటే ఏపీ, వెలుగులు ఉంటే తెలంగాణ అని కేసీఆర్ ఏపీ పరిస్థితి విమర్శలు చేశారని, ముందు దానికి సజ్జల సమాధానం చెప్పుకోవాలన్నారు. ముందు మీ కథ మీరు చూసుకోండని షర్మిల ఎద్దేవా చేశారు.

వ్యతిరేక ఓటు చీలకూడదనే

బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనకుండా ఉన్నామని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. ఎవరో తమకు కిరీటాలు పెట్టాలని కోరుకోవడం లేదని స్పష్టంచేశారు. అన్ని పార్టీల్లో దొంగలు ఉంటారని, కానీ ఆ దొంగలు సీఎంలు కాకూడదనే తన అభిప్రాయం అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై కేసు కొట్టేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు.

కాంగ్రెస్ కు మద్దతు

కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం చేస్తారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. అయితే వైఎస్ షర్మిల కోరిన స్థానాలు కేటాయించకపోవడంతో విలీనం ఆగిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ముందు ఒంటరిగానే పోటీ చేయాలని భావించిన షర్మిల... ఆ తర్వాత పోటీ నుంచి విరమించుకున్నారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టు షర్మిల ప్రకటించారు.

సజ్జల ఏమన్నారంటే?

తెలంగాణలో కాంగ్రెస్ కు షర్మిల మద్దతిచ్చారు. ఈ నిర్ణయంపై సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ పై అక్రమ కేసులు పెట్టి వేధించిన పార్టీతో షర్మిల కలిశారని సజ్జల ఆరోపించారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు పెట్టిందని, జగన్‌పై అక్రమ కేసులు పెట్టి వేధించిందని ఆరోపించారు. షర్మిల ఓ పార్టీకి అధ్యక్షురాలని, ఆమె నిర్ణయాలు ఆమె ఇష్టమంటూ సజ్జల వ్యాఖ్యానించారు. తమకు ఏపీకి చెందిన విషయాలే ముఖ్యమని సజ్జల అన్నారు.

Whats_app_banner