TS CPGET 2024 : టీఎస్ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల, మే 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభం-hyderabad ts cpget 2024 notification released online application start from may 18 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Cpget 2024 : టీఎస్ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల, మే 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

TS CPGET 2024 : టీఎస్ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల, మే 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

Bandaru Satyaprasad HT Telugu
May 15, 2024 10:21 PM IST

TS CPGET 2024 : టీఎస్ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు మే 18 నుంచి జూన్ 17 ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

టీఎస్ సీపీజెట్ నోటిఫికేషన్ విడుదల
టీఎస్ సీపీజెట్ నోటిఫికేషన్ విడుదల

TS CPGET 2024 : తెలంగాణ సీపీగెట్ (TS CPGET 2024) నోటిఫికేషన్ ఇవాళ విడుదలైంది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉన్నత విద్యామండలి ఆఫీసులో నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంపీఈడీ కోర్సు ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ సీపీగెట్ నిర్వహిస్తోంది. టీఎస్ కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఎంట్రన్స్ టెస్ట్ (TS CPGET) జులై 5న నిర్వహించనున్నారు. మే 18 నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు సమర్పించవచ్చని అధికారులు తెలిపారు.

yearly horoscope entry point

మే 18 నుంచి దరఖాస్తులు

రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో ఉన్న 297 పీజీ కాలేజీల్లో 51 కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్‌ నిర్వహిస్తున్నట్లు బుర్రా వెంకటేశం తెలిపారు. మే 18 నుంచి జూన్‌ 17 వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరించనున్నారు. రూ.500 ఆలస్య రుసుముతో జూన్‌ 25వ తేదీ వరకు, రూ.2 వేల ఆలస్య రుసుముతో జూన్‌ 30 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సీపీగెట్ ను జులై 5న కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త పీజీ కోర్సులు ప్రవేశపెడుతున్నామన్నారు. సీపీగెట్‌ పూర్తి వివరాలను www.osmania.ac.in, www.ouadmissions.com, www.cpget.tsche.ac.in వెబ్‌సైట్లలో పొందవచ్చని చెప్పారు.

టీఎస్ దోస్త్ అడ్మిషన్లు

తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ(DOST 2024) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 6 నుంచి 25 వరకు ఫేజ్ -1 రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే గతంలో మే 15 నుంచి 27 వరకు ఫేజ్-1 వెబ్ ఆప్షన్లు ప్రకటించారు. విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల వినతిలో వెబ్ ఆప్షన్ తేదీల్లో మార్పు చేశారు. మే 20 నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు గడువు ఉంటుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి సూచించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి 20 నుంచి వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు.

ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్

తెలంగాణలోని డిగ్రీ కళాశాలల ప్రవేశాల కోసం ‘దోస్త్’(TS DOST 2024) నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. రాష్ట్రంలోని ఉస్మానియా వర్శిటీ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో దోస్త్ రిజిస్ట్రేషన్ల ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు. ఈ ఏడాదికి సంబంధించి మొత్తం మూడు విడతల్లో డిగ్రీ కాలేజీల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు రూ.200 చెల్లించాలి. ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 6వ తేదీ నుంచే ప్రారంభం అయ్యింది. అర్హత గల విద్యార్థులు మే 25వ తేదీ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. మే 20 నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. ఫస్ట్ ఫేజ్ సీట్లను జూన్ 3వ తేదీన కేటాయిస్తారు. జూన్ 10వ తేదీలోపు ఆయా కాలేజీల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయాలి. ఇక రెండో విడత రిజిస్ట్రేషన్లు జూన్ 4వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి.

Whats_app_banner