TGPSC Group 1 Prelims : తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్, హాల్ టికెట్ పై ఫొటో అతికించడం తప్పనిసరి
TGPSC Group 1 Prelims : తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచన చేసింది. ఈ నెల 9న జరిగే ప్రిలిమ్స్ కు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష హాల్ లోకి వెళ్లే ముందు హాల్ టికెట్లపై ఇటీవల దిగిన ఫొటో అతికించాలని పేర్కొంది.
TGPSC Group 1 Prelims : తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. గ్రూప్-1 ప్రిలిమినరీ టెస్ట్ ను ఓఎమ్ఆర్ విధానంలో ఈ నెల 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు పాటించాల్సిన సూచనలను హాల్ టికెట్లపై ప్రింట్ చేశామని టీజీపీఎస్సీ తెలిపింది. అయితే తాజాగా మరోసారి అభ్యర్థులకు సూచనలు చేసింది. హాల్ టికెట్ పై మూడు నెలలలోపు దిగిన పాస్ పోర్ట్ సైజు ఫొటోను అతికించాలని కమిషన్ పేర్కొంది. పరీక్ష హాల్ లోకి వెళ్లే ముందు పరీక్ష కేంద్రం వద్ద హాల్ టికెట్ పై అభ్యర్థి ఫొటోను అతికించాలని తెలిపింది. ఫొటో అతికించకపోతే పరీక్ష హాల్ లోకి అనుమతించమని పేర్కొంది. ఈ సూచనను హాల్ టికెట్ లో ప్రస్తావించినట్లు తెలిపింది.
ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి
అదే విధంగా అభ్యర్థి పరీక్ష హాలులో ఇన్విజిలేటర్ సమక్షంలో హాల్ టికెట్ పై సంతకం చేయాల్సి ఉందని కమిషన్ పేర్కొంది. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించడానికి హాల్ టికెట్ తప్పనిసరి అని తెలిపింది. హాల్ టికెట్ తో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డు ఒరిజినల్ అభ్యర్థి తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వం జారీ చేసిన పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వీటిల్లో ఏదైనా ఒకటి పరీక్ష కేంద్రం వద్ద సిబ్బందికి చూపించాలని తెలిపింది.
జూన్ 9న ప్రిలిమ్స్
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ కు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ కు సంబంధించి హాల్ టికెట్లను అధికారులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు పరీక్ష జరుగుతుంది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్(OMR) పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. గ్రూప్-1కు(Group- 1 Prelims)కు 4.03 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. దీంతో పరీక్షను ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులు ముందుగా ప్రిలిమ్స్, రెండో దశలో మెయిన్స్ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తేనే మెయిన్స్ కు క్వాలిఫై అవుతారు. ప్రిలిమ్స్ కు హాజరైన అభ్యర్థులను లెక్కలోకి తీసుకుని నిర్దిష్ట కటాఫ్ మార్కులు నిర్ణయిస్తారు. రెండో దశలో మెయిన్స్ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ విభాగాల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు ఉంటాయి. ప్రిలిమ్స్ పరీక్షను 2.30 గంటల సమయంలో నిర్వహిస్తారు. గ్రూప్-1 మెయిన్స్ ను పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. వీటికి 900 మార్కులు కేటాయిస్తారు. ఈ 6 పేపర్లకు అదనంగా జనరల్ ఇంగ్లిష్ అర్హత పేపర్‌గా ఉంటుంది. ఈ పేపర్ ను 150 మార్కులకు నిర్వహిస్తారు. దీనికి 3 గంటల సమయం కేటాయిస్తారు.
సంబంధిత కథనం