Hyderabad Mayor Vijayalakshmi : అర్ధరాత్రి వరకూ భారీ శబ్దాలతో హంగామా, హైదరాబాద్ మేయర్ కు షాకిచ్చిన పోలీసులు- కేసు నమోదు-hyderabad police filed case on mayor gadwala vijayawada lakshmi on midnight dj music ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Mayor Vijayalakshmi : అర్ధరాత్రి వరకూ భారీ శబ్దాలతో హంగామా, హైదరాబాద్ మేయర్ కు షాకిచ్చిన పోలీసులు- కేసు నమోదు

Hyderabad Mayor Vijayalakshmi : అర్ధరాత్రి వరకూ భారీ శబ్దాలతో హంగామా, హైదరాబాద్ మేయర్ కు షాకిచ్చిన పోలీసులు- కేసు నమోదు

Bandaru Satyaprasad HT Telugu
Oct 13, 2024 11:10 PM IST

Hyderabad Mayor Vijayalakshmi : హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి బంజారాహిల్స్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. ఈ నెల 10న అర్ధరాత్రి వరకు అధిక శబ్ధాలతో బతుకమ్మ నిర్వహించినందుకు మేయర్ పై సుమోటాగా కేసు నమోదు చేశారు. మరో ఇద్దరు వ్యక్తులపై కూడా కేసులు నమోదు అయ్యాయి.

అర్ధరాత్రి వరకూ భారీ శబ్దాలతో హంగామా, హైదరాబాద్ మేయర్ కి షాకిచ్చిన పోలీసులు- కేసు నమోదు
అర్ధరాత్రి వరకూ భారీ శబ్దాలతో హంగామా, హైదరాబాద్ మేయర్ కి షాకిచ్చిన పోలీసులు- కేసు నమోదు

హైదరాబాద్ సిటీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పోలీసులు షాకిచ్చారు. బంజారాహిల్స్ పోలీసులు మేయర్ పై కేసు నమోదు చేశారు. ఈ నెల 10న బతుకమ్మ వేడుకల సందర్భంగా అర్ధరాత్రి వరకు భారీ శబ్దాలతో హంగామా చేశారని, ఆమెపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. పోలీసులు నిర్దేశించిన సమయం తర్వాత అనుమతించిన డెసిబుల్స్ కంటే భారీ శబ్దాలతో స్థానికులకు ఇబ్బందులు కలిగించారని అభియోగాలు నమోదు చేశారు. మేయర్ విజయలక్ష్మితో పాటు ఈవెంట్ ఆర్గనైజర్స్ విజయ్ కుమార్, గౌస్‌‌పైనా కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నగర పరిధిలో మతపరమైన కార్యక్రమాలకు డీజేలు, బాణసంచా వాడకాన్ని నిషేధిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. సౌండ్ సిస్టమ్‌లకు నిర్దేశిత డెసిబుల్స్ సౌండ్ తో అనుమతించారు. ఈ నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొ్న్నారు.

ఈనెల 10న అర్ధరాత్రి వరకు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ ఈవెంట్ లో భారీ శబ్దాలు చేస్తున్నారని పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులను అడ్డుకున్న మేయర్, ఆమె అనుచరులు... వేడుకలు చేసుకోవద్దా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. భారీ సౌండ్స్ పెట్టిన పాటలకు మేయర్ విజయలక్ష్మి డ్యాన్స్ చేశారు. పోలీసులు చెప్పినా వినకుండా వాయు కాలుష్యానికి కారణమయ్యారని, ఇవాళ సుమోటోగా కేసు నమోదు చేశారు. డీజే శబ్ధాలతో ఇబ్బంది పెట్టారని స్థానికులు సైతం మేయర్ పై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పోలీసులతో మేయర్ గొడవ పడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

హైదరాబాద్ డీజేలపై నిషేధం

హైదరాబాద్ నగరంలో డీజేల వినియోగంపై హైదరాబాద్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి బారాత్‌లు, ఊరేగింపులు, రాజకీయ ర్యాలీలు, ఏ కార్యక్రమం అయినా డీజేలు వినియోగించవద్దని, టపాసులు కాల్చవద్దని పోలీసులు తెలిపారు. డీజేలు, ఫైర్‌ క్రాకర్స్‌పై నిషేధం విధిస్తూ హైదరాబాద్ సీవీ ఆనంద్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. సీపీ సీవీ ఆనంద్‌ అన్ని పార్టీల నేతలు, మతపెద్దలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు, డయల్ 100 కు వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. భారీ శబ్దాలతో డీజేలు పెట్టి సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారన్న వస్తున్న ఫిర్యాదులతో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించారు.

డీజే, సౌండ్‌ మిక్సర్‌, హైసౌండ్‌ ఎక్విప్‌మెంట్‌ పై నిషేధం విధించారు. నగరంలోని నాలుగు జోన్లలో సౌండ్‌ సిస్టమ్‌లు పెట్టడానికి డెసిబుల్స్‌ను నిర్దేశించారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుది. అనుమతి ఉన్న ప్రాంతాల్లో తక్కువ శబ్దంతో వీటిని అనుమతిస్తారు. జనావాసాల్లో ఉదయం 55 డెసిబుల్స్‌, రాత్రి 45 డెసిబుల్స్‌ సౌండ్స్‌ మించకూదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, కోర్టు ప్రాంగణాలకు వంద మీటర్ల దూరంలో డీజేలపై విధించారు. అలాగే మతపరమైన ర్యాలీల్లో బాణాసంచా కాల్చడంపై పూర్తిగా నిషేధిస్తున్నామని సీపీ చెప్పారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

Whats_app_banner

సంబంధిత కథనం