SI Pre Wedding Shoot : పోలీస్ స్టేషన్ లో ఎస్సైల ప్రీ వెడ్డింగ్ షూట్, సీపీ ఆనంద్ ఏమన్నారంటే?-hyderabad panjagutta police station police couple pre wedding shooting cp cv anand responds ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Si Pre Wedding Shoot : పోలీస్ స్టేషన్ లో ఎస్సైల ప్రీ వెడ్డింగ్ షూట్, సీపీ ఆనంద్ ఏమన్నారంటే?

SI Pre Wedding Shoot : పోలీస్ స్టేషన్ లో ఎస్సైల ప్రీ వెడ్డింగ్ షూట్, సీపీ ఆనంద్ ఏమన్నారంటే?

Bandaru Satyaprasad HT Telugu
Sep 17, 2023 05:02 PM IST

SI Pre Wedding Shoot : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎస్సైల ప్రీ వెడ్డింగ్ షూటింగ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై సీపీ సీవీ ఆనంద్ స్పందించారు.

పోలీసు జంట్ ప్రీ వెడ్డింగ్ షూట్
పోలీసు జంట్ ప్రీ వెడ్డింగ్ షూట్

SI Pre Wedding Shoot : ఇటీవల కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్ లకు క్రేజ్ పెరిగింది. పెళ్లికి ముందు వధూవరులు ఓ వీడియోను షూట్ చేసి, దానిని బంధువులు, స్నేహితులకు పంపి పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఇద్దరు ఎస్సైల ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్ అవుతోంది. ఇద్దరు తెలంగాణ పోలీసు అధికారులు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. వధూవరులిద్దరూ పోలీసులే కావడంతో...వారి ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ విభిన్నంగా ప్లాన్ చేశారు. పోలీస్ యూనిఫామ్ లో, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఈ వీడియోలో నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. పోలీసు యూనిఫామ్‌ను సొంత అవసరాల కోసం వాడుకున్నారని కొందరు విమర్శలు చేశారు. ఇందులో తప్పేముందని మరికొందరు వారిని సపోర్ట్ చేశారు. ఈ ఘటనపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ కూడా స్పందించారు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తోన్న భావన, అదే స్టేషన్ లో ఏఆర్ ఎస్సైగా పనిచేస్తున్న రావూరి కిషన్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. పెళ్లికి ముందు గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకోవాలని నిర్ణయించుకుని, తాము పనిచేసే పోలీస్ స్టేషన్ ను వేదికగా చేసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో యూనిఫామ్ లోనే ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో తీయించుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విషయం సీపీ సీవీ ఆనంద్ వరకూ వెళ్లింది.

స్పందించిన సీపీ ఆనంద్

ఈ వీడియోను రీట్వీట్ చేసిన సీపీ సీవీ ఆనంద్... పెళ్లి చేసుకోబోతున్నామన్న ఆనందంలో ఇద్దరు ఎస్సైలు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. పెళ్లి వారికి గొప్ప విషయమే కావొచ్చు కానీ, పోలీస్ స్టేషన్ లో ప్రీ వెడ్డింగ్ వీడియో కొంచెం ఎబ్బెట్టుగా ఉందన్నారు. పోలీసు ఉద్యోగం అంటే కత్తిమీద సాములాంటిందన్నారు. మహిళలకైతే మరింత కష్టమని తెలిపారు. ఈ ఉద్యోగంలో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు మూడు ముళ్ల బంధంతో ఒక్కతవ్వడం సంతోషించాల్సిన విషయం అని సీవీ ఆనంద్ తెలిపారు. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లో పోలీస్‌ దుస్తుల్ని, చిహ్నాలను ఉపయోగించడాన్ని తాను తప్పుబట్టడం లేదన్నారు. కానీ ఈ విధమైన చర్యలకు వారు ముందే అనుమతి తీసుకుంటే బాగుండేదన్నారు. వాళ్లు నన్ను పెళ్లికి పిలవకపోయినా, వెళ్లి ఆశీర్వదించాలని ఉందన్నారు. ఇకపై అనుమతి తీసుకోకుండా ఈ పనులు చేయొద్దని సున్నితంగా హెచ్చరించారు.

Whats_app_banner