TS IPS Transfers : తెలంగాణలో 9 మంది ఐపీఎస్ ల బదిలీ- క్రైమ్ జాయింట్ సీపీగా ఏవీ రంగనాథ్
TS IPS Transfers : తెలంగాణ ప్రభుత్వం 9 మంది ఐపీఎస్ లను బదిలీ చేసింది. ఏవీ రంగనాథ్ హైదరాబాద్ సిటీ, క్రైమ్ జాయింట్ సీపీగా బదిలీ అయ్యారు.
TS IPS Transfers : తెలంగాణలో తొమ్మిది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ఆదివారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. పి.విశ్వప్రసాద్‌ను హైదరాబాద్ అడిషనల్ ట్రాఫిక్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. హైదరాబాద్ సిటీ, క్రైమ్ జాయింట్ సీపీగా ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. వెస్ట్ జోన్ డీసీపీగా ఎస్‌ఎం విజయ్‌కుమార్, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా జోయల్ డేవిస్, నార్త్ జోన్ డీసీపీగా రోహిని ప్రియదర్శిని, హైదరాబాద్ సీసీఎస్ డీసీపీగా ఎన్ శ్వేత, హైదరాబాద్ సిటీ ట్రాఫిక్-1 డీసీపీగా ఎల్.సుబ్బారాయుడు నియమితులయ్యారు. నిఖితా పంత్, గజరావ్ భూపాల్, చందనా దీప్తిలను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని సీఎస్ ఆదేశించారు. ఇటీవలె పలువురు ఐపీఎస్ లు బదిలీ అయ్యారు.
నాన్ కేడర్ ఎస్పీల బదిలీలు
రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు నాన్ కేడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఎన్.వెంకటేశ్వర్లు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్-3, డీసీపీగా బదిలీ అయ్యారు. డి.శ్రీనివాస్ ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. శ్రీ బాల దేవి హైదరాబాద్ టాస్క్ పోర్స్ డీసీపీగా బదిలీ అయ్యారు. జి.సందీప్ రైల్వేస్(అడ్మిన్) ఎస్పీగా నియమితులయ్యారు. జె.రాఘవేంద్రరెడ్డిని డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశాలు విడుదలయ్యాయి.
ఇటీవల బదిలీలు
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ సీపీగా 1994 బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాసుల రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. రాచకొండ సీపీగా సుధీర్‌బాబు, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతిలను నియమించింది. మరోవైపు సైబారాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను, రాచకొండ సీపీ దేవేంద్ర సింగ్ చవాన్‌లను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. హైదరాబాద్ సీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సందీప్ శాండిల్య నార్కోటిక్ వింగ్ డైరెక్టర్‌గా నియమించారు. 1993 బ్యాచ్‌కు చెందిన సందీప్ శాండిల్యను తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్‌గా నియమించారు.
ఐఏఎస్ ల బదిలీలు
తెలంగాణలో మరో 11 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అర్వింద్ కుమార్ ను విపత్తు నిర్వహణశాఖకు బదిలీ చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశంను నియమించారు. ఆయనకు కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిగా దానకిశోర్ నియమించారు. ఆయనకు హెచ్ఎండీఏ, సీడీఎంఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా క్రిస్టినా, ఆర్అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కె.ఎస్. శ్రీనివాసరాజును ప్రభుత్వం నియమించింది.