CM Revanth Reddy : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించేందుకే శ్వేతపత్రం, ఎవరినీ కించపరిచేందుకు కాదు- సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో జరిగిన చర్చ జరిగింది. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల ముందు పెట్టాడానికే శ్వేతపత్రం విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాడీవేడిగా చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టామన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. అర్హులైన వారికి సంక్షేమం అందించి దేశంలోనే తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఆదాయం, అవసరాలకు సంబంధించి రిజర్వు బ్యాంకు వద్ద నుంచి వివరాలు తీసుకున్నామన్నారు. బీఆర్ఎస్ కు అధికారం అప్పగించే నాటికి.. రిజర్వ్ బ్యాంకు వద్ద మన నిధుల నిల్వలు సగటున 303 రోజులు ఉండేవని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సగటున ఇందులో సగం రోజులు కూడా లేవని విమర్శించారు. రోజూ అప్పు కావాలని వాళ్ల దగ్గర నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. కొన్ని వాస్తవాలు కఠోరమైనవన్నారు.
అఖిలపక్షం సలహాలు తీసుకుంటాం
"శ్వేత పత్రం ఎవరినో కించపరచడానికి, అవమానించడానికి కాదు. మేం ప్రకటించిన గ్యారంటీలను ఎగ్గొట్టడానికి కాదు. వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకే ఈ శ్వేతపత్రం. ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం పెట్టి ఇచ్చిందే ఈ నివేదిక. మీకు ఏవైనా అపోహలు ఉంటే తొలగించుకోండి. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానిని కలిసేందుకు కిషన్ రెడ్డికి నేను ఫోన్ చేశాను. స్వార్థ రాజాకీయాల కోసం కాకుండా ప్రజల కోసం మేం ఆలోచిస్తున్నాం. బీఆర్ఎస్ కుటుంబ తగాదాలను సభలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. మా ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయానికి ముందు అఖిలపక్షం సలహాలు, సూచనలు తీసుకుంటాం"- సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ కీర్తిని పెంచే దిశగా
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ కీర్తిని పెంచే దిశగా పని చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అప్పులు తీసుకోకుండా రాష్ట్రాన్ని ముందుగా తీసుకొస్తామని చెప్పారు. శ్వేతపత్రం విడుదల వెనక ఇతర ఉద్దేశాలు లేవన్నారు. తెలంగాణలో ఏం జరిగిందని చెప్పటం కోసం ఈ శ్వేతపత్రాన్ని ప్రకటించామన్నారు. రాష్ట్రం దివాలా తీసిందనే చెప్పే ప్రయత్నం చేయటం లేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో మాట్లాడుతామని అన్నారు. అన్నివర్గాలను పిలిచి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగ్, ఆర్బీఐ నివేదికలు ఆధారంగా శ్వేత పత్రం రూపొందించామన్నారు. శ్వేత పత్రాన్ని వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరంలేదన్నారు.
కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దుర్వినియోగం
" బీఆర్ఎస్ నేతలు ఇంకా అబద్దాలతో సభను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దుర్వినియోగం చేశారు. అబద్దాలతో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడేమో సత్యహరిశ్చంద్రుల్లా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ సృష్టించిన సంపదను తనఖా పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు తెచ్చింది. కాంగ్రెస్ కూడబెట్టిన రూ.4,972 కోట్ల విద్యుత్ శాఖ ఆస్తులను బీఆర్ఎస్ తనఖా పెట్టింది. గత ప్రభుత్వం పదేళ్లలో రూ.13 లక్షల 72 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇంత ఖర్చు చేసినా.. ప్రజలకు చేసిందేం లేదు. పేదలకు డబుల్ బెడ్రూంలు ఇవ్వలేదు. దళితులకు మూడెకరాలు ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వలేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయని పరిస్థితి. మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు ఇవ్వలేదు. సెక్రటేరియట్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి. ప్రతీ నెలా మొదటి తారీఖున రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి. పెద్దకొడుకును అని చెప్పుకున్న పెద్దమనిషి ఆసరా పెన్షన్లు ఇవ్వని పరిస్థితికి తీసుకొచ్చారు. నాలుగు నెలల ముందే వైన్స్ టెండర్లు వేసి ఉన్నదంతా దోచుకున్నారు"-సీఎం రేవంత్ రెడ్డి
గత ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని బీఆర్ఎస్ నెరవేర్చలేదన్నారు. లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారని, ప్రతీ నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి కడతామని మోసం చేశారన్నారు. నిజాలు చెబితే పరువు పోతుందంటున్నారు. కానీ ఊరుకుంటే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందని, అందుకే వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు.