CM Revanth Reddy : ఆడబిడ్డలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్- కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్దిదారులకు తులం బంగారం!-hyderabad news in telugu cm revanth reddy orders budget estimation on tulam gold for kalyana lakshmi scheme ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : ఆడబిడ్డలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్- కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్దిదారులకు తులం బంగారం!

CM Revanth Reddy : ఆడబిడ్డలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్- కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్దిదారులకు తులం బంగారం!

Bandaru Satyaprasad HT Telugu
Jan 27, 2024 05:55 PM IST

CM Revanth Reddy : కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్దిదారులకు నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అధ్యయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. త్వరలో కులగణన చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్దిదారులకు నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అధ్యయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేసించారు. బీసీ, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్స్ తో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నిర్వహణకు అవసరమైన పూర్తి బడ్జెట్ ను అంచనా వేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంచనా వ్యయం ఆధారంగా గ్రీన్ ఛానెల్ ద్వారా బడ్జెట్ విడుదల చేద్దామన్నారు.

ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్

అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని సీఎం ఆదేశించారు. అవసరమైన చోట సొంత భవనాలు నిర్మించేందుకు భూమిని గుర్తించాలని ఆదేశించారు. ఆ తరువాత సొంత భవనాలు నిర్మించేందుకు అంచనా వ్యయాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు. కల్యాణమస్తు పథకం ద్వారా నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అంచనా బడ్జెట్ ను రూపొందించాలన్నారు. పార్లమెంట్ నియోజకవర్గం ఒక యూనిట్ గా బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు అంశంపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎన్నికల సమయంలో షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథకం కింద ప్రతీ ఆడబిడ్డకు రూ. లక్ష ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

త్వరలో రాష్ట్రంలో కుల గణన

త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపడుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సూచించారు. వీటికి సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి సరిపడే స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో స్కూల్ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేయాలని అన్నారు.

ఎడ్యుకేషన్ హబ్ లు ఏర్పాటు

మహాత్మ జ్యోతిభాపూలే ఓవర్ సీస్ స్కాలర్ షిప్ స్కీమ్ ను మరింత సమర్ధంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పుడున్న దాని కంటే ఎక్కువ మంది అర్హులైన విద్యార్థులకు మేలు జరిగేలా చూడాలని అన్నారు. విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల ర్యాంకింగ్ ల ఆధారంగా టాప్ యూనివర్సిటీలను గుర్తించి ఫ్రేమ్ వర్క్ తయారు చేయాలని అన్నారు. వాటిలో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ఈ స్కీమ్ లో మొదటి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ వేర్వేరు చోట్ల విడివిడిగా కాకుండా ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటేడ్ హబ్ నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. దీంతో స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ కూడా మరింత మెరుగ్గా చేసే వీలుంటుందని అన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదువుకోవటం ద్వారా వారిలో ప్రతిభా పాఠవాలు పెరుగుతాయని, పోటీ తత్వం పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. వెంటనే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎడ్యుకేషన్ హబ్ ల నిర్మాణానికి సరిపడే స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. నియోజకవర్గ కేంద్రంలో వీలు కాకుంటే ప్రత్యామ్నాయంగా అదే సెగ్మెంట్లో మరో పట్టణం లేదా మండల కేంద్రాలను ఎంచుకోవాలని సూచించారు. ఇప్పటికే 20 ఎకరాలకుపైగా విస్తీర్ణమున్న స్కూల్ ప్రాంగణాల్లో మిగతా భవనాలు నిర్మించి హబ్ గా తీర్చిదిద్దే అవకాశాలుంటే పరిశీలించాలని అన్నారు.

పెళ్లి కానుకగా తులం బంగారం

ఎడ్యుకేషన్ హబ్ ల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థల, కంపెనీల సహకారం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) ఫండ్స్ ను సమీకరించాలని, ముందుకు వచ్చే దాతల నుంచి విరాళాలు స్వీకరించి ఈ భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, పుస్తకాలకు కూడా సీఎస్ఆర్ ద్వారా నిధులు సమీకరించాలని సూచించారు. కల్యాణ మస్తు, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అంచనా బడ్జెట్ ను రూపొందించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పుడున్న బీసీ స్టడీ సర్కిళ్లను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్ గా ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Whats_app_banner