Praja Palana : ఆరు గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు-hyderabad news in telugu cm revanth reddy appointed cabinet sub committee on praja palana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Praja Palana : ఆరు గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Praja Palana : ఆరు గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Jan 08, 2024 06:56 PM IST

Praja Palana : ప్రజాపాలన కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆరు గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

Praja Palana : ప్రజాపాలన కార్యక్రమంపై సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు, ప్రజాపాలన నోడల్‌ ఆఫీసర్లు పాల్గొ్న్నారు. ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రజాపాలన అప్లికేషన్ల డేటా ఎంట్రీలో తప్పులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ నెల చివరి డేటా ఎంట్రీకి పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు.

సీఎం సమీక్ష

తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు అభయ హస్తం హామీలపై దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాపాలన కార్యక్రమంలో 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు.

కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

ఆరు గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రస్తుతం 30 వేల మంది ఆపరేటర్లతో ఈ అప్లికేషన్ల డేటా ఎంట్రీ జరుగుతోందన్నారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఎన్నికల్లో చెప్పామన్నారు. 40 రోజుల్లో నెరవేరుస్తామని ఎక్కడా చెప్పాలేదన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ నియమించారన్నారు. ఈ కమిటీ ఛైర్మన్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవహరించనున్నారని తెలిపారు. సభ్యులుగా మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తాను ఉంటామని పొంగులేటి స్పష్టం చేశారు.

ప్రజాపాలనలో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు

'ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ జరిగిన పది రోజుల్లో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో ఐదు గ్యారెంటీల కు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు రాగా, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 దరఖాస్తులు ఉన్నాయి. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,623 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సభలను నిర్వహించగా.....గ్రామ సభల్లో మొత్తం 1,11,46,293 మంది పాల్గొన్నారు. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో మొత్తం 3,714 అధికార బృందాలు పాల్గొనగా దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర వ్యాప్తంగా 44,568 కౌంటర్లను ఏర్పాటు చేశారు' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

ఈ ప్రజాపాలన సజావుగా జరిగేందుకు పది ఉమ్మడి జిల్లాలు, జీహెచ్ఎంసీలోని అయిదు జోన్లకు ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ దరఖాస్తులనన్నింటినీ జనవరి 17వ తేదీలోగా డేటా ఎంట్రీని పూర్తి చేయాలని సంబంధిత కలెక్టర్లను భట్టి విక్రమార్క ఆదేశించారు. అయితే నెలాఖరు వరకు సమయం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.