Minister KTR : తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే పాలమూరులో అడుగుపెట్టాలి- ప్రధానికి కేటీఆర్ డిమాండ్
Minister KTR : తెలంగాణపై ముందు నుంచీ ప్రధాని మోదీ విషం కక్కుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రధాని ఏ ముఖం పెట్టుకుని పాలమూరుకు వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి రాష్ట్రానికి రావాలని డిమాండ్ చేశారు.
Minister KTR : పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును అవమానించిన ప్రధాని మోదీ...రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ లోనే కాకుండా అనేక సందర్భాల్లో ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటును కించపరిచారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అగౌరవించడం అంటే రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన వేలాది అమరులతో పాటు తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల ప్రజలను అవమానించినట్టేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ అంటే ఎందుకింత చిన్న చూపని ప్రధానిని ప్రశ్నించారు. తెలంగాణపై ముందు నుంచి ప్రధాని విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని ఏ ముఖం పెట్టుకొని పాలమూరుకు వస్తున్నారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో పాలమూరు ప్రాంతాన్ని కరువు, నీటి కొరత, వలసలు పీడించేవని అలాంటి సందర్భంలో గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటా కోసం ప్రధానికి ముఖ్యమంత్రి లేఖ రాస్తే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి పదేళ్లు అవుతున్నా కృష్ణా నదిలో తెలంగాణ వాటా ఎంతో ట్రిబ్యునల్ కు లేఖ రాసే తీరిక ఈ దేశ ప్రధానికి లేదా అని ప్రశ్నించారు. ఆ వాటా తేల్చకపోగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులకు మాత్రం జాతీయ హోదా కల్పించడానికి ప్రధానికి మనసు ఒప్పట్లేదా అని ఎద్దేవా చేశారు. ప్రధాని ఓట్ల కోసమే పాలమూరుకు ఖాళీ చేతులతో వచ్చి వేళతారని కేటీఆర్ స్పష్టం చేశారు.
గవర్నర్ పై మండిపడ్డ కేటీఆర్
ఎమ్మెల్సీలుగా కేబినెట్ ప్రతిపాదించిన పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించడంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గవర్నర్ గా పదవి చేపట్టక ముందు ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారని గుర్తు చేశారు. ఆమె సరిగ్గా ఆలోచించి ఉంటే తిరస్కరించకపోయి ఉండేవారన్నారు. తిరస్కరించిన అనంతరం తమిళి సై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. గవర్నర్ తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఎవరిని నామినేట్ చేయాలనేది తమ ఇష్టమన్నారు. అసలు దేశానికి గవర్నర్ వంటి పోస్టులు అవసరమా? అని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన బదులిచ్చారు. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌ను, జ్యోతిరాదిత్య సింధియా తదితరులను రాజ్యసభకు ఎలా పంపించారో చెప్పాలన్నారు. కర్ణాటకలో మంత్రిగా పనిచేసిన మహిళను ఎమ్మెల్సీగా చేశారని చెప్పారు. ఇలా ఒక్కరిని కాదు... ఎంతోమందిని పెద్దల సభకు పంపించారన్నారు. అందరు అర్జున అవార్డు గ్రహీతలకు ఇవ్వాలంటే బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎందరికి ఇచ్చారో వారే చెప్పాలన్నారు. గవర్నర్ కు మరోసారి ఎమ్మెల్సీల పేర్లను ప్రతిపాదిస్తూ పంపిస్తామని కేటీఆర్ వెల్లడించారు. సర్కారియా కమిషన్ ను తుంగలో తొక్కేది బీజేపీ నేని విమర్శించారు.
కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా అర్హత లేని వ్యక్తి
బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం సహకరించుకుంటున్నాయని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణపై పగ బట్టాయన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ఆయన అసమర్థుడని, కేంద్ర మంత్రుల్లో అత్యంత అర్హత లేని వ్యక్తి కిషన్ రెడ్డి అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చెయ్యకుండా పారిపోయిన వ్యక్తి కిషన్ రెడ్డి అని ఆరోపించారు. కనీసం తన సొంత నియోజకర్గమైన అంబర్ పేట్ లో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్లైఓవర్ ను ఇన్నేళ్లు అయిన పూర్తిచేయాలేని అసమర్థుడు కిషన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాజకీయ జిమ్మిక్కు అని, అటెన్షన్ డైవర్షన్ కోసమే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ,ఇంటింటికీ తాగు నీరు ఇస్తామన్న మోదీ ఏం చేశారో చెప్పాలన్నారు.