Hyderabad Rains : హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్, విద్యుత్ కు అంతరాయం- సహాయ చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష-hyderabad heavy rains traffic jam power cuts in city cm revanth reddy reviewed situation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Rains : హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్, విద్యుత్ కు అంతరాయం- సహాయ చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Hyderabad Rains : హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్, విద్యుత్ కు అంతరాయం- సహాయ చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Bandaru Satyaprasad HT Telugu
May 07, 2024 10:45 PM IST

Hyderabad Rains : అకాల వర్షం హైదరాబాద్ ను అతలాకుతలం చేసింది. మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్

Hyderabad Rains : హైదరాబాద్ లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈదురుగాలులతో పలుచోట్ల చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ వాతావరణ పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. వ‌రంగ‌ల్ ప‌ర్యట‌న‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచే జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ రోనాల్డ్ రోస్‌, సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ కె.శ్రీ‌నివాస రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ఎస్‌.ఏ.ఎం రిజ్వి, ఇత‌ర ఉన్నతాధికారుల‌తో స‌మీక్షించారు. భారీ వ‌ర్షాలు, ఈదురుగాలుల‌తో ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింద‌ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంట‌నే స‌మ‌స్యను ప‌రిష్కరించి విద్యుత్ స‌ర‌ఫ‌రాను పున‌రుద్ధరించాల‌ని ఆదేశించారు. లోత‌ట్టు ప్రాంతాల్లో జ‌ల‌మ‌య‌మైన కాల‌నీల్లో ప్రజ‌ల‌కు అవ‌స‌ర‌మైన చేయూత‌ను అందించాల‌ని సూచించారు. న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్యను సాధ్యమైనంత త్వర‌గా క్లియ‌ర్ చేసి వాహ‌న‌దారులు త్వర‌గా ఇళ్లకు చేరుకునేలా చూడాల‌ని పోలీసు అధికారుల‌ను ఆదేశించారు. వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది చేప‌ట్టే స‌హాయ‌క చ‌ర్యల్లో భాగ‌స్వాములు కావాల‌ని, స‌మ‌స్య తీవ్రత ఎక్కువ‌గా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల‌ని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యక‌ర్తల‌కు సూచించారు.

కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్, మెట్రోలో రద్దీ

భారీ వర్షం హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తింది. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడ్డాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, బేగంపేట్, ఇతర ప్రధాన ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు ఎక్కడికక్కడ రోడ్డపై నిలిచిపోయాయి. భారీ వర్షంతో పాటు ఈదురు గాలుల వీయడంతో భారీ వృక్షాలు నేలకొరిగాయి. హోర్డింగ్స్ , కొన్ని చోట్ల చెట్లు కూలి వాహనాలపై పడ్డాయి. దీంతో నగరంలో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితులు చక్కదిద్దుతున్నారు. ట్రాఫిక్ జామ్ సమస్యతో చాలా మంది మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రో స్టేషన్లలో భారీగా రద్దీ నెలకొంది. చాలా మెట్రో స్టేషన్లలో జనాలు కిక్కిరిసిపోయారు.

హైదరాబాద్ లోని కొంపల్లి, నిజాంపేట్, కూకట్ పల్లి, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. వాతావరణ పరిస్థితుల్లో ఒక్కసారి మార్పులు వచ్చి భారీ వర్షాలు , ఈదురుగాలులు వీచాయి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్‌లో భారీ వర్షం కురిసింది. బాలానగర్, ఫతేనగర్, సనత్‌నగర్‌, జీడిమెట్ల, చింతల్‌, షాపూర్‌, కుత్‌బుల్లాపూర్‌, మియాపూర్‌, చందానగర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.

Whats_app_banner

సంబంధిత కథనం