Jeedimetla Accident : మద్యం మత్తులో అతివేగంగా డ్రైవ్ చేసి ప్రాణం తీశారు, గాజులరామారం ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు!
Jeedimetla Accident : మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో ఘోర ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కొందరు యువకులు అతివేగంగా కారు నడిపి రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి.
Jeedimetla Accident : మద్యం తాగి వాహనాలు నడుపుతూ...ఎదుటి వారి ప్రాణాలు బలితీసుకుంటున్న సంఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజురామారంలో ఈ తరహా ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కొందరు యువకులు వాహనాన్ని అతివేగంగా నడిపి పాదచారుడిని ఢీకొట్టారు.
ఆదివారం ఉదయం గాజుల రామారంలో ఓ విద్యార్థి తన స్నేహితులతో కారును అతి వేగంగా నడిపి పాదచారుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో బాధితుడు గోపి(38) అక్కడికక్కడే మృతి చెందాడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డు అయ్యింది. నిందితుడు మనీష్‌కు స్వల్ప గాయాలు కాగా, ప్రస్తుతం అతడిని జీడిమెట్ల పోలీసులు విచారణ చేస్తున్నారు. బాధితుడు గోపి స్థానికంగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గోపిని అతి వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. దీంతో అతడు ఒక్కసారి ఎగిరి పడ్డాడు. వాహనం పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని సైతం ఢీకొట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. అన్యాయంగా ఓ వ్యక్తిని బలితీసుకున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తు్న్నారు.
పరారీలో నిందితులు
గాజులరామారం క్రాసింగ్ వద్ద అతివేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా ఉన్న సెక్యూరిటీ గార్డు గోపిని బలంగా ఢీకొట్టింది. దీంతో గోపి ఒక్కసారిగా ఎగిరి అవతల పడ్డాడు. కారు బలంగా ఢీ కొట్టడంతో గోపీ స్పాట్ లోనే మృతి చెందాడు. కారులోని వ్యక్తులు మెల్లగా బయటకు దిగి ఫోన్ మాట్లాడుకుంటూ ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. అయితే డ్రైవింగ్ చేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కారులో ఉన్న మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడు గోపి తండ్రి ఇటీవల మరణించాడు. అయితే గోపి సెక్యూరిటీగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా...ఈ ఘోర ప్రమాదం జరిగింది. మద్యం తాగి డ్రైవ్ చేస్తున్న యువకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
సంబంధిత కథనం