Alcohol: పెద్దలు మద్యం తాగితే వారి పిల్లలకు కూడా ఆ అలవాటు రావచ్చు, చెబుతున్న కొత్త అధ్యయనం-adults who drink alcohol may pass on the habit to their children a new study suggests ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Alcohol: పెద్దలు మద్యం తాగితే వారి పిల్లలకు కూడా ఆ అలవాటు రావచ్చు, చెబుతున్న కొత్త అధ్యయనం

Alcohol: పెద్దలు మద్యం తాగితే వారి పిల్లలకు కూడా ఆ అలవాటు రావచ్చు, చెబుతున్న కొత్త అధ్యయనం

Haritha Chappa HT Telugu
Mar 03, 2024 09:00 AM IST

Alcohol: ఇంట్లోని పెద్దవారు ఏ పనులు చేస్తారో, పిల్లలు కూడా అదే పనులను అనుకరిస్తారు. అదే విధంగా పెద్దలకు మద్యం తాగి అలవాటు ఉంటే వారి పిల్లలు కూడా పెద్దయ్యాక మద్యానికి బానిసలు అయ్యే అవకాశం ఉందని చెబుతోంది అధ్యయనం

ఆల్కహాల్
ఆల్కహాల్ (pexels)

Alcohol: ఇంట్లో తల్లిదండ్రులను చూసే ప్రతి విషయాన్ని పిల్లలు నేర్చుకుంటారు. ఇంట్లో తండ్రి ప్రతిరోజూ తాగి వస్తూ ఉంటే పిల్లల మనసుకు అది పెద్ద గాయమే చేస్తుంది. భవిష్యత్తులో వారు పెద్దయ్యాక మద్యానికి అలవాటు పడే అవకాశం ఉందని చెబుతోంది ఒక కొత్త అధ్యయనం. మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికి మద్యపానం చేసే అలవాటు ఉన్న పెద్దయ్యాక వారి పిల్లలకు కూడా ఆ అలవాటు వచ్చే అవకాశం చాలా ఎక్కువ అని వారి వివరిస్తున్నారు.

ఈ అధ్యయనంలో భాగంగా 2000 మంది మద్యపానం చేసే తల్లిదండ్రులను సేకరించారు. పదేళ్లపాటు వారిని, వారి పిల్లలను కూడా అనుసరించారు. తల్లిదండ్రులను చూసి పిల్లలు ఎలా మారుతున్నారో తెలుసుకున్నారు. అలా పదేళ్ల అధ్యయనంలో ఆల్కహాల్‌కు బానిసలైన తల్లిదండ్రుల వద్ద ఉంటున్న పిల్లలు కూడా త్వరగానే ఆ మద్యానికి అలవాటు పడుతున్నట్టు ఈ పరిశోధనలో తేలింది.

ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు... పిల్లల ముందే తాగడం, తాగాక గొడవలు పడడం, మత్తులో తూగుతూ రావడం... ఇవన్నీ పిల్లలు మెదడుపై, మనసుపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లలకు కూడా ఆ పానీయాలు తాగాలన్న ఆసక్తిని పెంచుతాయి. అలా వయసు పెరిగాక పిల్లలు కూడా ఆ పానీయాన్ని రుచి చూసే అవకాశం ఉంది. కొన్నాళ్లకు వారు మద్యానికి అలవాటు పడి తండ్రి లేదా తల్లిలాగే బానిసలైపోతారు... అని చెబుతున్నారు పరిశోధకులు.

కేవలం మద్యమే కాదు... ఐస్ క్రీములు, పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలకూ పిల్లలు బానిసలు అయ్యే అవకాశం ఉంది. ముందుగా తల్లిదండ్రులు వాటిని తినడం మానేయాలి. తల్లిదండ్రులకు వాటిని తినే అలవాటు ఎక్కువగా ఉంటే... పిల్లలకు కూడా అవి తినాలన్న కోరిక పుడుతుంది. ముఖ్యంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆహారాలను అధికంగా తింటే పుట్టే బిడ్డకూ అలాంటి ఆహారంపై ఆసక్తి ఉండవచ్చు.

ప్రాసెస్ చేసిన ఆహారాలు అధికంగా తినే పిల్లల్లో మధుమేహం, గుండె వ్యాధులు, అధిక రక్తపోటు వంటివి త్వరగా వస్తాయి. కాబట్టి మీ పిల్లల ఆరోగ్యాన్ని మీరే చెడగొట్టుకున్న వారు అవుతారు. తల్లిదండ్రులు ఎంత మంచి జీవనశైలిని అనుసరిస్తారో... వారి పిల్లలు కూడా అంతే పద్ధతిగా పెరుగుతారు. పిల్లల ముందే మద్యం తాగడం, వారి ముందే తూగుతూ కింద పడడం, కొట్లాడుకోవడం వంటి పనులను మానేయండి. పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు మీ వంతు బాధ్యతను నిర్వహించండి.

మీరు పండ్లు అధికంగా తింటే మిమ్మల్ని చూస్తున్న పిల్లలూ పండ్లు అధికంగా తింటారు. అలాగే తాజా కూరగాయలతో వండిన వంటలు, ఇంట్లో మాత్రమే వండిన వంటలు తినడం తల్లిదండ్రులు ఫాలో అయితే పిల్లలు కూడా అదే పద్ధతిని అనుసరిస్తారు. కాబట్టి ముందుగా పిల్లలు కాదు పెద్దలే మారాలి. పెద్దలను చూసి పిల్లలు ప్రతిదీ నేర్చుకుంటారు. మీరు ఎలాంటి పదజాలాన్ని వాడతారో పిల్లలూ అలాంటి మాటలు అన్ని నేర్చుకుంటారు. కాబట్టి వారు ఉత్తమ పౌరులుగా, మంచి వారిగా ఎదగాలంటే... ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూడండి.

టాపిక్