Mla Rajasingh : మొన్న రేవంత్ రెడ్డి, నేడు రాజాసింగ్- సచివాలయం గేటు దాటనివ్వని పోలీసులు!-hyderabad bjp suspended mla raja singh faced humiliation police stopped enter into secretariat ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mla Rajasingh : మొన్న రేవంత్ రెడ్డి, నేడు రాజాసింగ్- సచివాలయం గేటు దాటనివ్వని పోలీసులు!

Mla Rajasingh : మొన్న రేవంత్ రెడ్డి, నేడు రాజాసింగ్- సచివాలయం గేటు దాటనివ్వని పోలీసులు!

Mla Rajasingh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ సచివాలయంలో గ్రేటర్ ప్రతినిధుల మీటింగ్ కు వచ్చిన రాజాసింగ్ ను పోలీసులు సెక్రటేరియట్ గేటు వద్ద అడ్డుకున్నారు.

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Twitter )

Mla Rajasingh : బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ కు తెలంగాణ నూతన సచివాలయం వద్ద ఘోర అవమానం ఎదురైంది. ఓ సమావేశం కోసం సచివాలయానికి వచ్చిన రాజాసింగ్ ను సెక్యురిటీ సిబ్బంది గేటు వద్దే నిలిపివేశారు. లోపలికి అనుమతిలేదని తేల్చిచెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానం మేరకు మీటింగ్ వచ్చానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పినా భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. అయితే ఈ పరిణామాలపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం ఏర్పాటు చేశామని, నగరంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలందరినీ ఆహ్వానించామని మంత్రి తలసాని చెప్పారు. దీంతో బుల్లెట్ పై సచివాలయానికి వచ్చిన రాజాసింగ్ ను పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు. సచివాలయం లోపలికి అనుమతి లేదని చెప్పడంతో రాజాసింగ్ చాలాసేపు గేటు వద్దే వేచిఉండి వెనుదిరిగారు.

సచివాలయంలోకి అనుమతించకపోవడంపై రాజాసింగ్ ఆగ్రహం

ఈ ఘటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ సీరియస్ అయ్యారు. పోలీసులు తనను సచివాలయంలోపలికి అనుమతించకపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పేషీ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు సమావేశానికి వచ్చానన్నారు. అయితే పోలీసులు తనను అడ్డుకుని అవమానకరంగా ప్రవర్తించారని రాజాసింగ్ ఆరోపించారు. టైంపాస్ కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం పెట్టారా? అని ప్రశ్నించారు. సచివాలయంలోకి ఎమ్మెల్యేలు, ఎంపీలను అనుమతించకపోతే ఇంకెవరిని అనుమతిస్తారని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో కట్టిన సెక్రటేరియట్ లోకి ప్రజాప్రతినిధులను అనుమతించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను అడ్డుకోవాలని పోలీసులకు ఎవరు ఆదేశాలు ఇచ్చారో చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

అయితే ఈ ఘటనపై మంత్రి పేషీ మరోలా సమాధానం ఇస్తుంది. రాజాసింగ్ కు ఆహ్వానం పంపామని, ఆయన సమావేశానికి రాలేదని పేర్కొంది. గేటు వద్ద జరిగిన విషయంపై తమకు సమచారంలేదని తెలిపింది.

టి.కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సేమ్ సీన్ రిపీట్

ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కూడా నూతన సచివాలయంలోకి పోలీసులు అనుమతించలేదు. ఓఆర్ఆర్ టోల్ విషయంలో స్కామ్ జరిగిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి... ఆ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సెక్రటేరియట్ కు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం గ్రహించిన పోలీసులు రేవంత్ రెడ్డిని టెలిఫోన్ భవన్ వద్ద అడ్డగించారు. సచివాలయం గేటు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి తనకు ఆహ్వానం లేదని గవర్నర్ తమిళి సై కూడా ఇటీవల విమర్శలు చేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన సచివాలయంలోకి ప్రజాప్రతినిధులను అనుమతించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలకే అనుమతి లేకపోతే సమస్యలు చెప్పుకోడానికి వచ్చే సామాన్య ప్రజల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు.