CM KCR : కాంగ్రెస్ అంటేనే గోల్ మాల్ పార్టీ, గల్లీకో ముఖ్యమంత్రి అభ్యర్థి- సీఎం కేసీఆర్ సెటైర్లు-huzurnagar cm kcr satire on congress party every leader feels cm candidate ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Kcr : కాంగ్రెస్ అంటేనే గోల్ మాల్ పార్టీ, గల్లీకో ముఖ్యమంత్రి అభ్యర్థి- సీఎం కేసీఆర్ సెటైర్లు

CM KCR : కాంగ్రెస్ అంటేనే గోల్ మాల్ పార్టీ, గల్లీకో ముఖ్యమంత్రి అభ్యర్థి- సీఎం కేసీఆర్ సెటైర్లు

Bandaru Satyaprasad HT Telugu
Oct 31, 2023 04:10 PM IST

CM KCR : కాంగ్రెస్ పార్టీలో గల్లీకో ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. ప్రతీ ఒక్కరు నేనే ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకునే గోల్ మాల్ పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

CM KCR : కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. హుజూర్ నగర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్... కాంగ్రెస్ పార్టీలో పంచులు పేల్చారు. కాంగ్రెస్ లో నేను ముఖ్యమంత్రి అయితా అని ఒకడు, నేను బుడ్డర్ ఖాన్ అయితా అని ఒకడు బయలుదేరారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గోల్ మాల్ పార్టీ అంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ గెలిస్తే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల్లో ఒక్కో పార్టీ నుంచి ఒక వ్యక్తి మాత్రమే బరిలో నిలబడతారని, కానీ వారి వెనక పెద్ద పార్టీలు ఉంటాయన్నారు. ఆ పార్టీల వైఖరి, చరిత్ర, ప్రజల పట్ల వాటి దృక్పథం ఏంటనేదానిపై ప్రజలు ఆలోచించాలన్నారు. పార్టీల పనితీరు, గతంలో చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్రహ్మాండమైన ఆయుధం ఓటు హక్కు అన్నారు. ఏది నిజమో గ్రహించి ప్రజలు ఓటు వేయాలని సీఎం కేసీఆర్ అన్నారు.

yearly horoscope entry point

కాంగ్రెస్ నేతలకు పదవులు చాలు

తెలంగాణలో 30 నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నులు వడ్లు పండించే చోట ఈరోజు 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి నా కలను నిజం చేసిన మొనగాళ్లు తెలంగాణ రైతులు అని సీఎం కేసీఆర్ కితాబిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ తెలంగాణ ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్‌ నేతలు పోరాడలేదన్నారు. 1956లో తెలంగాణను ఏపీలో కలపాలని ప్రతిపాదన వచ్చినప్పుడు విద్యార్థులు, ఉద్యోగులు వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఇడ్లీ, సాంబారు గోబ్యాక్‌ ఉద్యమం చేశారని, ఆ సమయంలో కాల్పులు జరిగాయన్నారు. ఈ కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అప్పుడు కాంగ్రెస్‌ నేతలు కనీసం నోరు మెదపలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ప్రజల కోసం పోరాడలేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతలకు పదవులు ఉంటే చాలని, ప్రజలు ఎటు పోయినా పట్టించుకోరన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు ఏనాడూ నీటి కోసం అసెంబ్లీలో కొట్లాడలేదన్నారు.

వారం పది రోజుల్లో హుజూర్ నగర్ కు నీళ్లు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సాగునీరు, మంచినీటి కోసం అనేక క‌ష్టాలు ప‌డ్డామని సీఎం కేసీఆర్ అన్నారు. నేడు ఆ స‌మ‌స్యల‌ను అధిగ‌మించుకున్నామన్నారు. గిరిజ‌న తండాలను గ్రామ‌పంచాయ‌తీలుగా తీర్చిదిద్దుకున్నామని తెలిపారు. కృష్ణా న‌దిలో శ్రీశైలం వరకే నీరు వచ్చాయని, నాగార్జున సాగ‌ర్ దాకా నీళ్లు రాలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు ఫోన్ చేసి, పంటలు ఎండిపోతున్నాయని నీళ్లు వదలాలని కోరితే అధికారుల‌ను పిలిచి మాట్లాడి నీళ్లను వదలాలని ఆదేశించామన్నారు. హుజూర్‌న‌గ‌ర్‌కు వారం ప‌ది రోజుల పాటు మ‌ళ్లీ నీళ్లు పంపిస్తామన్నారు.

Whats_app_banner