Hyderabad : హైదరాబాద్‌లో బాణసంచా పేలుడు.. భార్యభర్తలు మృతి, కుమార్తెకు తీవ్ర గాయాలు!-husband and wife killed in firecracker explosion at home in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : హైదరాబాద్‌లో బాణసంచా పేలుడు.. భార్యభర్తలు మృతి, కుమార్తెకు తీవ్ర గాయాలు!

Hyderabad : హైదరాబాద్‌లో బాణసంచా పేలుడు.. భార్యభర్తలు మృతి, కుమార్తెకు తీవ్ర గాయాలు!

Basani Shiva Kumar HT Telugu
Oct 29, 2024 09:44 AM IST

Hyderabad : హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదం జరిగింది. ఇంట్లో బాణసంచా పేలి.. ఇద్దరు మృతిచెందారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇళ్లల్లో బాణసంచా నిల్వ చేసుకోవద్దని సూచిస్తున్నారు. నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

హైదరాబాద్‌లో బాణసంచా పేలుడు
హైదరాబాద్‌లో బాణసంచా పేలుడు

హైదరాబాద్‌ నగరం యాకుత్‌పురాలోని ఓ ఇంట్లో తీవ్ర విషాదం జరిగింది. ఇంట్లో బాణసంచా పేలి భార్యభర్తలు మృతిచెందారు. వారి కుమార్తెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

yearly horoscope entry point

అసలు ఏం జరిగింది..

మోహన్ లాల్, ఉషారాణి దంపతులు. వీరు బాణసంచా దుకాణం నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి దుకాణం నుంచి బాణసంచాను ఇంటికి తీసుకెళ్లారు. రాత్రి సమయంలో ఇంట్లో ఆ దంపతులు పిండి వంటలు చేస్తున్నారు. పిండివంటలు తయారు చేస్తుండగా ప్రమాదం జరిగింది. వంటలు చేస్తున్న క్రమంలో ఇంట్లో ఉన్న బాణసంచాకు నిప్పు అంటుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటనలో భార్యాభర్తలు మోహన్ లాల్, ఉషారాణి దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు. కుమార్తె (18)కు తీవ్ర గాయాలు అవ్వగా.. మలక్‌పేట యశోదా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తోంది.

బాణసంచా నిల్వలు ఇంట్లో ఉంచుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. నిల్వ ఉంచిన బాణసంచాపై.. పిండి వంటలు చేస్తుండగా.. నిప్పు రవ్వలు ఎగిసిపడి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. తాము గతంలో చాలాసార్లు చెప్పామని.. బాణసంచాను ఇంట్లో నిల్వ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అధికారుల 10 సూచనలు..

1.టపాసులు విక్రయించే దుకాణాల వద్ద బకెట్లలో ఇసుక, డ్రమ్ముల నిండుగా నీళ్లు ఉంచుకోవాలి.

2.నాణ్యతతో కూడిన తీగలు, విద్యుత్తు సామాగ్రితో వసతులు ఏర్పాటు చేసుకోవాలి.

3.చట్టబద్ధంగా ఆమోదించిన, నాణ్యమైన టపాసులను విక్రయించాలి.

4.పోలీస్, అగ్నిమాపక శాఖ తనిఖీల్లో బాణసంచా అక్రమ నిల్వలను గుర్తిస్తే కఠిన చర్యలుంటాయి.

5.నిబంధనల ప్రకారం ఇళ్ల మధ్య పెద్ద ఎత్తున నిల్వలుంచొద్దు. అలా చేస్తే లైసెన్స్‌లు రద్దు చేసి కేసులు నమోదు చేస్తాం.

6.నాణ్యమైన టపాసులు కొనుగోలు చేయడం ఉత్తమం.

7.భవనాలు, వాహనాలు, మండే స్వభావం ఉన్న పదార్థాలకు దూరంగా.. పార్కులు, మైదానాలు, బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం శ్రేయస్కరం.

8.కాటన్‌ వస్త్రాలు ధరించాలి. కాల్చిపడేసిన వాటిన ఒక బకెట్‌లో వేయాలి.

9.చిన్నారులు బాణసంచా కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి. పేలని టపాసులను మళ్లీ కాల్చేందుకు ప్రయత్నిస్తారు. కళ్లు, చేతులకు గాయాలయ్యే ప్రమాదముంది.

10.తక్షణ సాయానికి..: ఏదైనా ప్రమాదం సంభవించినా, ఇబ్బందులెదురైనా వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించాలి.

Whats_app_banner