Tirumala Laddu : తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్.. చంద్రబాబు వ్యాఖ్యలపై దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి
Tirumala Laddu : తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. చంద్రబాబు వ్యాఖ్యలపై దర్యాప్తు జరపాలని పిటిషన్ దాఖలు చేశారు మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి. ఆధారాలు లేకుండా చంద్రబాబు ఆరోపణలు చేశారని సుబ్రమణ్యస్వామి పిటిషన్‌లో పేర్కొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు ఇచ్చే ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగిస్తున్నారని వివాదం జరుగుతోంది. ఈ ఇష్యూ తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఆలయాల నిర్వహణ, స్వతంత్ర విచారణకు రిటైర్డ్ జడ్జిని నియమించాలని కోరుతూ.. సుప్రీం కోర్టులో మూడు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఐకానిక్ ఆలయంలో ప్రసాదంగా అందించే లడ్డూలను తయారు చేసేందుకు.. నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును ఉపయోగించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ పిటిషన్లు దాఖలు అయ్యాయి.
సుదర్శన్ న్యూస్ టీవీ ఎడిటర్ సురేష్ ఖండేరావ్ చవాంకే తరపు న్యాయవాదులు సత్యం సింగ్ రాజ్‌పుత్, రాజీవ్ రంజన్, ఏఓఆర్ నిఖిల్ బెనివాల్ పిటిషన్ దాఖలు చేశారు. చవాంకే దాఖలు చేసిన పిటిషన్‌లో సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రసాదంలో మాంసాహార పదార్థాలను ఉపయోగించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 ప్రకారం భక్తుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించిందని వ్యాఖ్యానించారు. మతపరమైన విషయాల్లో తమ సొంత వ్యవహారాలను నిర్వహించకూడదని స్పష్టంచేశారు.
కేంద్ర ఏజెన్సీతో దర్యాప్తు జరపాలి..
లక్షలాది మంది భక్తులకు ఈ విషయం చాలా ముఖ్యమైనదని, మతరమైన ఆచారాల పవిత్రతను కాపాడేందుకు, ఆలయ పరిపాలనపై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి అత్యున్నత న్యాయస్థానం తక్షణమే దృష్టి పెట్టాలని పిటిషన్‌లో కోరారు. ఈ వివాదానికి సంబంధించిన నేరపూరిత కుట్ర, అవినీతిపై దర్యాప్తు చేయడానికి సీబీఐ లేదా మరొక స్వతంత్ర కేంద్ర ఏజెన్సీ ద్వారా దర్యాప్తు చేయాలని కోరారు. పారదర్శకత, మతపరమైన ఆచారాలకు కట్టుబడి ఉండేలా ఆలయాలు, పుణ్యక్షేత్రాల నిర్వహణను పర్యవేక్షించడానికి రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించాలని పిటిషనర్ కోరారు.
సిట్ విచారణ కోరుతూ పిటిషన్..
కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ తో విచారణ జరిపించాలని కోరుతూ.. సుప్రీం కోర్టులో మరొక పిటిషన్ దాఖలు అయింది. లడ్డూలను తయారు చేయడానికి జంతువుల కొవ్వును ఉపయోగించారని, దీని ఫలితంగా తిరుపతి బాలాజీ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఆరోపిస్తూ.. హిందూ సేన అధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాదవ్ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పవిత్ర ప్రసాదం తయారీలో అపవిత్రమైన పదార్థాలను వినియోగించడం వల్ల హిందూ భక్తుల తరపున ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు పిటిషనర్ తెలిపారు.
నిరాధారమైన ఆరోపణపై విచారణ జరపాలి..
బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి సుబ్రమణ్యస్వామి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 'ఈ రోజు నేను పిటిషన్ దాఖలు చేశాను. తిరుపతి తిరుమల దేవస్థానం ప్రసాదంలో జంతువుల మాంసం, ఇతర కుళ్లిపోయిన వస్తువులతో కల్తీ చేశారని, భక్తులను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన నిరాధారమైన ఆరోపణపై విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరాను' అని ఆయన తెలిపారు.
సీజేఐకి లేఖ..
ఇదిలా ఉండగా లడ్డూ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు.. న్యాయవాది సత్యసింగ్ లేఖ రాశారు. గత టీటీడీ బోర్డు హయంలో ప్రసాదంలో మాంసాహార ఉత్పత్తులను ఉపయోగించినట్లు వెలుగు చూసిందని, ఈ చర్య హిందూ మతపరమైన ఆచారాలు, ప్రాథమిక సిద్ధాంతాలను ఉల్లంఘించడంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం.. రాజ్యాంగం పరిరక్షణపై దాడికి పాల్పడడమేనని పేర్కొన్నారు. పవిత్ర నైవేద్యాన్ని మాంసాహారంతో కలుషితం చేయడం భక్తుల హక్కులను ఆలయ నిర్వాహకులు కాలరాయడమేనని అన్నారు. తిరుమలలో ఉల్లంఘన జరిగిందనే వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని జ్యోకం చేసుకోవాలని సీజేఐని కోరారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)