Anantapur Road Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం-లారీని ఢీకొట్టిన కారు, ఆరుగురి మృతి
Anantapur Road Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ రోడ్డు వద్ద అదుపుతప్పిన కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ రోడ్డు వద్ద లారీని కారు ఢీకొట్టింది. టైరు పగిలి అదుపుతప్పిన కారు, ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఘటనాస్థలిలోనే మృత్యువాతపడ్డారు. బాధితులు తాడిపత్రిలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. మృతులు అనంతపురానికి చెందిన వారుగా తెలుస్తోంది.
మృతులందరూ అనంతపురం ఇస్కాన్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. తాడిపత్రిలోని ఇస్కాన్ నగర సంకీర్తన కార్యక్రమానికి వెళ్లి అనంతపురం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు వెంకన్న, సంతోష్, షణ్ముక్, శ్రీధర్, ప్రసన్న, వెంకీలుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కారులో డ్రైవర్ తో సహా ఏడుగురు ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరిలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. కారు అతివేగంగా రావడం, టైర్ పంక్చర్ అయినప్పుడు డ్రైవర్ అదుపుచేయలేకపోయాడని ప్రాథమికంగా నిర్థారించారు. యాక్సిడెంట్ లో అనంతపురం-కడప హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల అన్నమయ్య జిల్లాలో
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రాజానగర్ సమీపంలో ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి కడపకు వస్తోన్న ఆర్టీసీ బస్సు, కడప నుంచి పెళ్లి రిసెప్షన్ కోసం తిరుపతి వెళ్తోన్న ఇన్నోవా వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్నోవా వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. ప్రమాదస్థలిలోనే ఒకరు చనిపోగా, గాయపడిన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఆసుపత్రిలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఆర్టీసీ బస్సు, ఇన్నోవా వాహనం అతివేగంగా ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు. బస్సులోని ప్రయాణికుల్లో ఇద్దరు గాయపడ్డారు. ఇన్నోవాలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు చనిపోగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో ఇన్నోవా వాహనం ముందు భాగమంతా నుజ్జు నుజ్జు అయింది. వివాహ రిసెప్షన్ కు వెళ్తున్న వారికి ఇలా జరగడంతో బంధువులు, బాధితుల కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
సంబంధిత కథనం
టాపిక్