Telangana Rains : తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు...! ఈ జిల్లాలకు హెచ్చరికలు-heavy rains are likely to occur in telangana for three days imd weather details read here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Rains : తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు...! ఈ జిల్లాలకు హెచ్చరికలు

Telangana Rains : తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు...! ఈ జిల్లాలకు హెచ్చరికలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 22, 2024 07:02 AM IST

Telangana Rain Updates : బంగాళాఖాతంలో 23వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో తెలంగాణలోని మూడు నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. శనివారం రాత్రి హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురిసింది.

తెలంగాణకు భారీ వర్ష సూచన
తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. శనివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవగా… హైదరాబాద్ లో మాత్రం కుండపోత వాన పడింది. దీంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 23వ తేదీన పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో తెలంగాణలో మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఈ జిల్లాలకు హెచ్చరికలు….!

తెలంగాణలో ఇవాళ చూస్తే ఇవాళ పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌ కర్నూల్‌, నల్గొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరికొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఇక రాష్ట్రంలో సెప్టెంబర్  24, 25, 26 తేదీల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని  వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 24వ తేదీన కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని అంచనా వేసింది.

ఇక సెప్టెంబర్  25వ తేదీన కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 26వ తేదీన కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది.

హైదరాబాద్ లో కుండపోత వర్షం!

హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం తర్వాత కుండపొత  వర్షం కురిసింది. సికింద్రాబాద్‌, నాచారం, ఉప్పల్‌, రామంతాపూర్‌, తార్నాక, మేడిపల్లి, కోఠి, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, ఎల్బీనగర్‌, మాదాపూర్‌ సహా పలు ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షానికి రోడ్డన్నీ చెరువులను తలపించాయి. దీంతో ఐటీ కారిడార్‌తోపాటు సికింద్రాబాద్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వాహనదారులు ఇబ్బందులుపడ్డారు.

భారీ వర్షం దాటికి లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. వర్షం ధాటికి రోడ్లన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ జామ్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాంపల్లి, కోఠి, బషీర్‌బాగ్, అబిడ్స్, నారాయణగూడ, ముషీరాబాద్, హిమాయత్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, ఉప్పల్, ఎల్బీ నగర్, కంటోన్మెంట్, తార్నాక, నాగోల్, లక్డీ కపూల్, బంజారా‌హిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్‌ నగర్, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

గోల్కొండలో అత్యధిక వర్షపాతం నమోదు

గోల్కొండలో అత్యధికంగా 9.1 సెం. మీ వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్ 8.6 సెం. మీ, ఆసిఫ్ నగర్ 8.0 సెం. మీ,నాంపల్లి 6.7 సెం. మీ వర్షపాతం రికార్డైంది. ఇక రాజేంద్ర నగర్ లో 6.6 సెం. మీ, హిమాయత్ నగర్ - 6.5 సెం.మీ, సికింద్రాబాద్ - 6.1 సెం. మీ, బహదూర్‎పుర - 5.8 సెం.మీ, షేక్ పేట్ - 5.9 సెం. మీ, కాప్రా - 5.73 సెం. మీ, ముషీరాబాద్ లో 4.33 సెం. మీ వర్షపాతం నమోదైంది.