Hyderabad Rains : హైదరాబాద్‌లో మళ్లీ దంచికొడుతున్న వర్షం.. అలర్ట్‌గా ఉండాలన్న అధికారులు-heavy rain in many parts of hyderabad city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Rains : హైదరాబాద్‌లో మళ్లీ దంచికొడుతున్న వర్షం.. అలర్ట్‌గా ఉండాలన్న అధికారులు

Hyderabad Rains : హైదరాబాద్‌లో మళ్లీ దంచికొడుతున్న వర్షం.. అలర్ట్‌గా ఉండాలన్న అధికారులు

Basani Shiva Kumar HT Telugu
Sep 24, 2024 12:56 PM IST

Hyderabad Rains : హైదరాబాద్ నగరాన్ని వర్షం మళ్లీ వణికిస్తోంది. మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలు కాలనీల్లో మోకాళ్ల లోతు నీరు వచ్చింది. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

హైదరాబాద్‌లో మళ్లీ వర్షం
హైదరాబాద్‌లో మళ్లీ వర్షం (Photo Source: @YounusFarhaan)

హైదరాబాద్ నగరంలో మళ్లీ వానలు దంచి కొడుతున్నాయి. ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, అంబర్‌పేట్, రామంతపూర్, తార్నాక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మాదాపూర్ ఏరియాలో వర్షం కారణంగా ట్రాఫిక్‌కు జామ్ అయ్యింది. ఇటు ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

రాష్ట్రంలోని భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్‌లోని పెద్దపల్లి, మహబూబాబాద్ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. నిజామాబాద్‌, సిరిసిల్ల, యాదాద్రి, వికారాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 26వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

హైదరాబాద్ ఐఎండీ ప్రకారం.. 24వ తేదీ మంగళవారం.. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ్‌పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

25వ తేదీన బుధవారం.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే సమయంలో.. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

26వ తేదీన గురువారం.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.