HarishRao on Revanth: నాడు ఓటుకు నోటు, నేడు నోటుకు సీట్లంటూ రేవంత్‌ను విమర్శించిన హరీష్ రావు
HarishRao on Revanth: ఒకప్పుడు నోటుకు ఓటు కేసులో పట్టుబడిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు నోటుకు సీట్లు అమ్ముకుంటు న్నాడని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల నిజస్వరూపం టికెట్లు ఇవ్వడంతో బయటపడిందని, 10 కోట్లకు ఒక టికెట్ అమ్ముకున్నారని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారన్నారు.
HarishRao on Revanth: నాడు నోటుకు ఓటు కేసులో పట్టుబడ్డ రేవంత్, ఇప్పుడు నోటుకు సీట్లు అమ్ముకుంటున్నాడని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేటలో జరిగే సీఎం సభ ప్రాంగణాన్ని పరిశీలించిన తర్వాత హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల నిజస్వరూపం టికెట్లు ఇవ్వడంతో బయటపడిందని,వారు 10 కోట్లకు ఒక టికెట్ అమ్ముకున్నారని కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారని, అలాగే ఐదు ఎకరాలకు మరో టికెట్ అమ్ముకున్నారని ఢిల్లీలో, గల్లీలో కాంగ్రెస్ నాయకులు నిరసనలు తెలుపుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.
సీట్లు కావాలన్నా, పదవులు కావాలన్నా ఢిల్లీకే పోవాలని, ఆఖరికి ఓట్లు కావాలంటే కూడా ఢిల్లీ నుంచి నాయకులను రప్పించాల్సిన పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్ బిజెపి పార్టీలదని మంత్రి హరీష్ అన్నారు.
బీజేపీ కి పోటీ చేసేందుకు నాయకులే లేరని, ఓడిపోతామనే భయంతో కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటివారు కూడా ఎమ్మెల్యేకి పోటీ చేయమని ఎంపీకి పోటీ చేస్తామని తప్పించుకు తిరుగుతున్నారని ఆయన అన్నారు.బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణ కొచ్చి ఎక్కువగా మాట్లాడుతున్నారని, ఆయన ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే నవ్వుల పాలవడం తప్ప ఏమీ లేదని హరీష్ రావు ఎద్దెవా చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ పార్లమెంట్ లో తెలంగాణ సంక్షేమాన్ని, అభివృద్ధి ని పొగుడుతూ రాజకీయం కోసం తెలంగాణలో తిట్టడం ఎందుకు అని ప్రశ్నించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను ఆపి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీ పార్టీ తెలంగాణకు చేసిన ఒక రూపాయి అభివృద్ధి ఏంటో చెప్పాలని మంత్రి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను నగదు పెంచి పేరు మర్చి ప్రవేశపెట్టామని కాంగ్రెస్ పార్టీ అంటుందని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లే కేసీఆర్ పథకాలను కాపీ కొట్టారని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో పెట్టిన పథకాలు అన్ని తెలంగాణ ప్రబుత్వం ఇప్పటికే అమలుచేస్తుందని అన్నారు.
నమ్మకానికి మారుపేరు కెసిఆర్ అని, నయవంచనకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు.తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఇతర రాష్ట్ర మేనిఫెస్టోలలో పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డదన్నారు.
తెలంగాణ ఆచరిస్తున్న దానిని దేశం అనుసరిస్తుంది అన్న విధంగా మారిందని అన్నారు.కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు అవకాశం ఇచ్చిన ఏమి చేయలేదని కానీ కేసీఆర్ 9 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి చూసి ప్రజలు కేసీఆర్ గెలిపించుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. మూడోసారి మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. సిద్దిపేట కలను నిజం చేసిన నాయకుడు సిద్దిపేట ముద్దుబిడ్డ కేసీఆర్ సిద్దిపేటకు వస్తున్న నేపథ్యంలో వారి సభను విజయవంతం చేయాలని హరీష్ రావు కోరారు .