TG Govt Job Notifications : తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లకు బ్రేక్ - ఆ తర్వాతే ప్రకటనలు..! 10 ముఖ్యమైన అంశాలు-govt job notifications will come in telangana only after 60 days check out these10 important points ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Job Notifications : తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లకు బ్రేక్ - ఆ తర్వాతే ప్రకటనలు..! 10 ముఖ్యమైన అంశాలు

TG Govt Job Notifications : తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లకు బ్రేక్ - ఆ తర్వాతే ప్రకటనలు..! 10 ముఖ్యమైన అంశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 10, 2024 10:44 AM IST

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు బ్రేక్ పడనుంది. దాదాపు రెండు నెలల తర్వాతే మళ్లీ నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం లేదు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీం తీర్పు అమలుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో నోటిఫికేషన్లకు అంతరాయ రానుంది.

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం… ఖాళీలను త్వరితగతిన పూర్తి చేస్తామని చెబుతూ వస్తోంది. ఇప్పటికే డీఎస్సీ రిక్రూట్ మెంట్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. మరికొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని నిర్ణయించారు. అంతేకాదు… ఏక సభ్య కమిషన్ ను నియమించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఏక‌స‌భ్య క‌మిష‌న్ నివేదిక స‌మ‌ర్పించిన అనంత‌రం దానికి అనుగుణంగా రాష్ట్రంలో నూత‌న నోటిఫికేష‌న్లు జారీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఎటువంటి న్యాయ‌పర‌మైన ఇబ్బందులు ఎదుర‌వ‌కుండా హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తితో క‌మిష‌న్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఆ క‌మిష‌న్ 60 రోజుల్లో నివేదిక స‌మ‌ర్పించాల‌ని గ‌డువు నిర్దేశించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లకు బ్రేక్ పడనుంది. కమిషన్ ఏర్పాటు నుంచి 60 రోజుల గడువు ఉంటుంది. కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత… ప్రభుత్వం కూడా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణపై సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు చేసే దిశగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి.

ముఖ్యమైన విషయాలు :

  • తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియకు బ్రేక్ పడనుంది. దాదాపు రెండు నెలల తర్వాతనే మళ్లీ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది.
  • ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
  • ఏర్పాటు కాబోయే ఏక సభ్య కమిషన్ 60 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.
  • నివేదిక అందిన తర్వాత ఎస్సీ వర్గీకరణపై సుప్రీం ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది.
  • ఏక‌స‌భ్య క‌మిష‌న్ నివేదిక స‌మ‌ర్పించిన తర్వాత… దానికి అనుగుణంగా రాష్ట్రంలో నూత‌న నోటిఫికేష‌న్లు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
  • కమిషన్ ఏర్పాటు నుంచి 60 రోజుల నాటికి రిపోర్ట్ ఇస్తుంది. ఆ తర్వాతనే రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతాయి.
  • తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం… ఈ అక్టోబర్ నెలలో ట్రాన్స్ కో, టీఎస్ జెన్ కో నుంచి నోటిఫికేషన్లు రావాల్సి ఉంది. అంతేకాకుండా గెజిటెడ్ ఇంజినీరింగ్ సర్వీసులకు సంబంధించి కూడా ప్రకటనలు రావాలి.
  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజా నిర్ణయంతో…. పైన పేర్కొన్న నోటిఫికేషన్లు విడుదలకు సమయం పట్టే అవకాశం ఉంది.
  • ఇటీవలే వైద్యారోగ్యశాఖ నుంచి భారీగా నోటిఫికేషన్లు వచ్చాయి. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. వీటిల్లో కూడా ఎస్సీ వర్గీకరణ తీర్పును అమలు చేస్తారా..? లేక కొత్త నోటిఫికేషన్లకే పరిమితం చేస్తారా అనేది తేలాల్సి ఉంది.
  • మరోవైపు జాబ్ క్యాలెండర్ ప్రకారం… వచ్చే నెల(నవంబర్)లో టెట్ నోటిఫికేషన్ రావాల్సి ఉంటుంది. టెట్ రాత పరీక్షలు వచ్చే ఏడాది జనవరిలో నిర్వహిస్తారు. డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రకటన ఫిబ్రవరి 2025లో ఇస్తారు. ఏక సభ్య కమిషన్ నివేదికతో సంబంధం లేకుండా టెట్ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.

Whats_app_banner