Sangareddy Homeguard: హైడ్రా కూల్చివేతలో గాయపడ్డ హోం గార్డ్ ను ప్రభుత్వం గాలికొదిలేసిందన్న హరీష్‌ రావు-governement neglected home guard who was injured in the demolition of hydra ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy Homeguard: హైడ్రా కూల్చివేతలో గాయపడ్డ హోం గార్డ్ ను ప్రభుత్వం గాలికొదిలేసిందన్న హరీష్‌ రావు

Sangareddy Homeguard: హైడ్రా కూల్చివేతలో గాయపడ్డ హోం గార్డ్ ను ప్రభుత్వం గాలికొదిలేసిందన్న హరీష్‌ రావు

HT Telugu Desk HT Telugu
Oct 02, 2024 01:35 PM IST

Sangareddy Homeguard: హైడ్రా కూల్చివేతలలో ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ఒక్క పోలీస్ అధికారి కూడా వచ్చి హోం గార్డ్ ను పరామర్శించలేదని మాజీమంత్రి హరీష్‌రావు ఆరోపించారు. హోం గార్డ్ అంటే పోలీస్ ఉన్నతాధికారులకు అంత చులకనా? అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.

హోంగార్డు గోపాల్‌ను పరామర్శిస్తున్న మాజీ మంత్రి హరీష్‌రావు
హోంగార్డు గోపాల్‌ను పరామర్శిస్తున్న మాజీ మంత్రి హరీష్‌రావు

Sangareddy Homeguard: సంగారెడ్డి మల్కాపూర్‌ చెరువు కూల్చివేతలో గాయపడిన హోంగార్డును పోలీస్ అధికారులు పరామర్శించక పోవడాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు తప్పు పట్టారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ పెద్ద చెరువులో బాంబులతో భవనం కూల్చివేతలో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోం గార్డ్ గోపాల్ ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రమాదకరమైన డిటోనేటర్లతో పేలుళ్ళు చేసినప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే గోపాల్ ప్రమాదానికి గురి అయ్యారని ఆరోపించారు. ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ఒక్క పోలీస్ ఉన్నతాధికారి కూడా వచ్చి పరామర్శించలేదన్నారు. ప్రభుత్వం వైద్య ఖర్చులు కూడా భరించకపోవడంతో ఇప్పటి వరకు హోం గార్డ్ కుటుంబం చికిత్సకి రూ. లక్ష ఖర్చు చేసిందని అన్నారు.

వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని.…

నాలుగు నెలల నుండి జీతం రాకపోవడంతో, వైద్య ఖర్చులు భరించలేక పోతున్నామని కుటుంబ సభ్యులు వాపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గోపాల్ తలకు దెబ్బ తగిలి మాట పడిపోయిందని, పూర్తిగా మాటలు రావడానికి నాలుగు నెలల పాటు స్పీచ్ థెరఫీ అందించాలని డాక్టర్లు చెప్పారని వివరించారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేయకుండా గోపాల్ కి పూర్తిగా నయం అయ్యేంత వరకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని, గోపాల్ కుటుంబాన్ని ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అలాగే నాలుగు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం ....

సంగారెడ్డి జిల్లా ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ గోపాల్ మృతి చెందాడని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ హోంగార్డ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పుప్పాల అశోక్ ఒక ప్రకటనలో తెలిపాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఇటువంటి ప్రచారం చేయడంతో బాధిత కుటుంబం క్షోభకు గురవుతుందన్నారు.

గోపాల్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని.…

మల్కాపూర్ పెద్ద చెర్వులోని అక్రమ నిర్మాణం కూల్చివేత సమయంలో గాయపడిన హోంగార్డు గోపాల్ ను మెరుగైన వైద్యం కోసం AIG ఆసుపత్రికి ఎస్పీ రూపేష్ పంపినట్టు సంగారెడ్డి జిల్లా పోలీసు సంఘం అధ్యక్షులు దుర్గారెడ్డి అన్నారు. అతడి ఆరోగ్య విషయమై ఎస్ఐ స్థాయి అధికారిచే పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం జరుగుతుందని, పోలీసు శాఖ అతనికి అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు.

జిల్లా ఎస్పీ, సిబ్బంది సంక్షేమానికి పోలీస మొదటి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. హోంగార్డు కు రావలసిన జీతాలు అన్ని సకాలంలో రావడం జరుగుతుందని, జీతాలకు సంబంధించి ఎలాంటి పెండింగ్ బిల్స్ లేవని అన్నారు. ప్రస్తుతం గోపాల్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని, సోషల్ మీడియా, ఇతర న్యూస్ చానల్ లలో వస్తున్న అవాస్తవాలను ఎవ్వరూ నమ్మరాదన్నారు.

Whats_app_banner