TS Politics : బీఆర్ఎస్‌కు మరో షాక్... గద్వాల జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ రాజీనామా-gadwal zp chairman saritha resign to brs party ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Politics : బీఆర్ఎస్‌కు మరో షాక్... గద్వాల జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ రాజీనామా

TS Politics : బీఆర్ఎస్‌కు మరో షాక్... గద్వాల జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ రాజీనామా

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 20, 2023 10:56 AM IST

BRS Party Latest News: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీకి షాక్ ఇస్తున్నారు అసమ్మతి నేతలు. తాజాగా గద్వాల జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ సరిత బీఆర్ఎస్కు రాజీనామా చేశారు.

బీఆర్ఎస్కు షాక్
బీఆర్ఎస్కు షాక్

Gadwal BRS: మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టికెట్లు ఆశించే నేతలతో పాటు అధినాయకత్వంపై అసమ్మతితో ఉన్న లీడర్లు... దారి చూసుకునే పనిలో పడ్డారు. ఇటీవలే మహేశ్వరం నియోజరవర్గానికి చెందిన తీగల కృష్ణారెడ్డి... బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రంగారెడ్డి రెడ్డి జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ గా ఉన్న ఆయన కోడలు కూడా.... కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఇదిలా ఉండగానే... గద్వాల జిల్లోలోనూ బీఆర్ఎస్ కు షాక్ తగిలిగింది. ఆ జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత కూడా గులాబీ పార్టీకి రాజీనామా చేశారు.

కాంగ్రెస్ గూటికే…

ఇవాళ, రేపో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమె ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో గత కొంత కాలంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి , జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితకు మధ్య గ్యాప్ కొనసాగుతుంది. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ ను వీడాలని సరిత నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సరిత దంపతులు... కాంగ్రెస్ లో చేరికపై జూపల్లితో చర్చలు జరిపారు.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారంగా జులై 20న కొల్లాపూర్ లో సభను నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సభకు ప్రియాంక గాంధీ వస్తారని టీపీసీసీ నేతలు చెప్పారు. ఈ సభా వేదికగానే జూపల్లితో పాటు ఇతర నేతలు జాయిన్ కావాల్సి ఉంది. వర్షాల కారణంగా ఈసభ వాయిదా పడటంతో... వీరి చేరికలు కూడా ఆగిపోయాయి. ఈ క్రమంలోనే ఇవాళ సరిత దంపతులు కాంగ్రెస్ లో చేరనున్నారు. వీరి గద్వాల టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ హామీతోనే పార్టీలో చేరుతున్నారనే చర్చ నడుస్తోంది.

మరోవైపు చేరికలతో బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే జూపల్లి, పొంగులేటి వంటి నేతలను చేర్చుకోవటంతో పాటు… అసమ్మతితో ఉన్న నేతలను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు కీలక నేతలు కూడా హస్తం గూటికి చేరుతారనే లీక్ లు వస్తున్నాయి. ఓ జాబితా కూడా వైరల్ అవుతోంది. రేపోమాపో చేరికలపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం