Ts Youth In Ukraine War: ఉద్యోగాల పేరుతో మోసం.. రష్యా యుద్ధంలో చిక్కుకున్న తెలంగాణ, కర్ణాటక యువకులు-fraud in the name of jobs telangana youth caught in russian war ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Youth In Ukraine War: ఉద్యోగాల పేరుతో మోసం.. రష్యా యుద్ధంలో చిక్కుకున్న తెలంగాణ, కర్ణాటక యువకులు

Ts Youth In Ukraine War: ఉద్యోగాల పేరుతో మోసం.. రష్యా యుద్ధంలో చిక్కుకున్న తెలంగాణ, కర్ణాటక యువకులు

Sarath chandra.B HT Telugu
Feb 22, 2024 10:00 AM IST

Ts Youth In Ukraine War: ఉపాధి, అధిక వేతనం ఆశ చూపించి భారతీయ యువకుల్ని రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తరలించారు. తెలంగాణ, కర్ణాటకలకు చెందిన పలువురు యువకులు ఇలా యుద్ధంలో చిక్కుకుపోయారు.

అధిక వేతనాల ఆశజూపి భారతీయ యువతను రష్యా తరలిస్తున్నారు.
అధిక వేతనాల ఆశజూపి భారతీయ యువతను రష్యా తరలిస్తున్నారు. (REUTERS)

Ts Youth In Ukraine War: అధిక వేతనాలు ఎరవేసి భారతీయ యువకుల్ని రష్యాకు తరలించిన వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. తెలంగాణకు చెందిన 22 ఏళ్ల యువకుడితో పాటు కర్ణాటకలోని కలబురగికి చెందిన మరో ముగ్గురు యువకులు ఉక్రెయిన్ సరిహద్దులో జరుగుతున్న యుద్ధంలో చిక్కుకుపోయారు. వారిని దుబాయ్‌ మీదుగా ఉద్యోగాల పేరుతో భారతీయ యువకుల్ని Indian youth రష్యా తరలించినట్టు కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ సుఫియాన్ అనే యువకుడు ఉక్రెయిన్‌ Ukraine war యుద్ధంలో చిక్కుకుపోయాడు. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యాRussia చేస్తున్న యుద్ధంలో బందీగా మారాడు. ఏజెంట్లు చేసిన మోసంతో రష్యా కోసం బలవంతంగా పోరాడటానికి వినియోగిస్తున్న యువకుల్లో సుఫియాన్ కూడా ఉన్నాడు.

రష్యాలో చిక్కుకున్న భారతీయ యువకులను సురక్షితంగా తరలించాలని, ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సుఫియాన్ కుటుంబం కేంద్ర ప్రభుత్వంతో పాటు విదేశాంగ Externala affairs మంత్రిత్వ శాఖను కోరింది.

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ సమస్యను తాజాగా ప్రస్తావించారు. రష్యా ప్రభుత్వంతో మాట్లాడి యువకులను వెనక్కి తీసుకురావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

"నరేంద్ర మోదీ ప్రభుత్వం రష్యా ప్రభుత్వంతో చర్చలు జరపాలని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న 12 మంది భారతీయ యువకులను తిరిగి తీసుకురావాలి" అని AIMIM ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

రష్యాలో చిక్కుకుపోయిన భారతీయుల గురించి సుఫియాన్ సోదరుడు ఇమ్రాన్ మీడియాకు వివరించాడు.

"తన సోదరుడిని బాబా బ్లాక్స్ కంపెనీ ఉద్యోగంలోకి తీసుకుందని ఆ సంస్థ దుబాయ్, ఢిల్లీ మరియు ముంబైలో కార్యాలయాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మొదటి బ్యాచ్ 2023 నవంబర్ 12న బయలుదేరినట్లు వివరించారు.

మొత్తం 21 మంది యువకులను రష్యాకు పంపారని, ఏజెన్సీ ఫీజులుగా ఒక్కొక్కరి నుండి రూ. 3 లక్షలు తీసుకున్నారని వివరించారు. అక్కడకు వెళ్లిన తర్వాత రష్యన్ బాషలో ఉన్న పత్రాలపై నవంబర్ 13న రష్యాలో ఒక ఒప్పందంపై సంతకం చేశారని తెలిపాడు.

భారత్‌ నుంచి వెళ్లిన వారికి ఆర్మీ హెల్పర్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్లు యువతకు చెప్పారని, చివరికి వారిని సైన్యంలోకి చేర్చి ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి మోహరించినట్లు వివరించారు. నెలకు నాలుగు లక్షల వరకు వేతనం ఆఫర్ చేయడంతో పెద్ద సంఖ్యలో యువత సహాయకులుగా ఉద్యోగాలు చేసేందుకు వెళ్లారని చెప్పాడు.

ఒప్పందాలపై సంతకాలు చేసే సమయంలో ఏజెంట్లు తప్పుడు అనువాదాలను వారికి ఇచ్చారని, ఆర్మీ సహాయకుల పని అని వారికి చెప్పారని రెండు రోజుల తరువాత, వారిని సైనిక శిక్షణ కోసం తీసుకున్నారని ఆరోపించారు. యువకులు నిరసన వ్యక్తం చేసినా, భారతీయ ఏజెంట్లు మళ్లీ వారిని తప్పుదారి పట్టించారని, ఇది శిక్షణలో భాగం మాత్రమేనని, వారిని ఫ్రంట్‌లైన్‌ యుద్ధాలకు పంపబోమని హామీ ఇచ్చారని ఇమ్రాన్ చెప్పారు.

దశల వారీగా శిక్షణ తర్వాత, వారిని ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోకి తీసుకు వెళ్లారని వివరించారు. అప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్న యువకులు తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఏజెంట్లకు చెప్పారని, ఏజెంట్లు మళ్లీ శిక్షణలో భాగమని, వారిని తిరిగి మాస్కో తీసుకు వస్తామని అబద్ధం చెప్పారని తెలిపారు.

మొత్తం తొమ్మిది మంది భారతీయ యువకులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్నారని, జనవరి 1 నుంచి తన సోదరుడు తమను సంప్రదించడం లేదని ఇమ్రాన్ తెలిపారు.

తన సోదరుడితో పాటు , మరో ఇద్దరు యువకులకు బుల్లెట్ గాయాలయ్యాయని, నడవలేని స్థితిలో ఉన్నారని ఆయన వివరించారు. తమకు ఎలాంటి సహాయం లేదా ఖచ్చితమైన సమాచారం అందడం లేదని వాపోయారు. అక్కడ చిక్కుకున్న యువకుల విడుదలకు సహాయం చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరారు.

రష్యాలో ఉద్యోగాల పేరుతో మోసపోయిన వారి క్షేమ సమాచారం కోసం తాము ఎంబసీని అభ్యర్థించినా నెల రోజులుగా ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా అనేకసార్లు లేఖలు వ్రాసామని, ప్రతిస్పందన రాలేదన్నారు.

'MADAD' పోర్టల్ నుండి ప్రతిస్పందన వచ్చిందని ఆ పత్రాలను రష్యా అధికారులకు పంపామని, వారి స్పందన కోసం వేచి చూస్తున్నామని ఇమ్రాన్ తెలిపారు.

రష్యాలో చిక్కుకుపోయిన తమ వారిని రక్షించేందుకు భారత ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రమే మాకు సహాయం చేయగలవన్నారు. అక్కడ చిక్కుకున్న యువకులను వెనక్కి తీసుకురావడంతో పాటు మోసాలకు పాల్పడుతున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.