విద్యార్థుల బందీపై సమాచారం లేదు: విదేశాంగ శాఖ
భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ దళాల చేతిలో బందీలుగా ఉన్నట్టు సమాచారం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
ముట్టడిలో ఉన్న ఖార్కివ్ నగరంలో భారతీయ విద్యార్థులను బందీలుగా ఉంచినట్లు రష్యా చేసిన వాదనలను భారతదేశం గురువారం కొట్టిపారేసింది. భారతీయులను ఖార్కివ్ నగరం, పొరుగు ప్రాంతాల నుంచి బయటకు తీసుకురావడానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంలో ఉక్రెయిన్ అధికారుల మద్దతును అభ్యర్థించినట్లు తెలిపింది.
కొంతమంది భారతీయ విద్యార్థులను ఉక్రేనియన్ భద్రతా దళాలు బందించాయని, విద్యార్థులను మానవ కవచంగా ఉపయోగిస్తున్నారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కార్యాలయం నుంచి వెలువడిన ఒక ప్రకటన తర్వాత ఇండియా స్పందించింది.
కొంతమంది భారతీయ విద్యార్థులు తూర్పు ఉక్రేనియన్ నగరమైన ఖార్కివ్, పలు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయినందున వారిని పొరుగు దేశాలకు తరలించేందుకు సురక్షిత మార్గాన్ని సులభతరం చేయాలని రష్యా, ఉక్రెయిన్‌లను కోరింది.
‘ఏ విద్యార్థికి సంబంధించి బందీ పరిస్థితి గురించి మాకు ఎలాంటి నివేదిక అందలేదు. ఖార్కివ్, పొరుగు ప్రాంతాల నుండి విద్యార్థులను దేశం పశ్చిమ భాగానికి తీసుకెళ్లడానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంలో మేం ఉక్రెయిన్ అధికారుల మద్దతును అభ్యర్థించాం’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులతో నిరంతరం టచ్‌లో ఉందని ఆయన చెప్పారు.
‘ఉక్రేనియన్ అధికారుల సహకారంతో చాలా మంది విద్యార్థులు నిన్న ఖార్కివ్ నుండి బయలుదేరారని మేం గమనించాం’ అని బాగ్చి చెప్పారు.
ప్రధాని మోదీ బుధవారం పుతిన్‌తో మాట్లాడి ఖార్కివ్‌తో సహా ఉక్రెయిన్‌లోని దాడులు జరుగుతున్న ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షితంగా తరలించడంపై చర్చించారు.
‘నాయకులు ఉక్రెయిన్‌లో పరిస్థితిని సమీక్షించారు, ముఖ్యంగా ఖార్కివ్ నగరంలో చాలా మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. వారు సంఘర్షణ ప్రాంతాల నుండి భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడం గురించి చర్చించారు’ అని సంభాషణపై విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఖార్కివ్, సుమీలో తన శత్రుత్వాన్ని తక్షణమే నిలిపివేయాలని ఉక్రేనియన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ రష్యాను కోరింది. తద్వారా విదేశీ విద్యార్థులతో సహా పౌర జనాభాను సురక్షిత నగరాలకు తరలించడానికి ఏర్పాట్లు చేయవచ్చని తెలిపింది.
‘రష్యన్ సాయుధ దళాలు నివాస ప్రాంతాలు, పౌర మౌలిక సదుపాయాలపై విచక్షణారహిత బాంబుల దాడి, అనాగరిక క్షిపణి దాడుల కారణంగా భారతదేశం, పాకిస్తాన్, చైనా, ఇతర కౌంటీల నుంచి విద్యార్థులు బయలుదేరలేరు’ అని అది పేర్కొంది.
రష్యా కాల్పుల విరమణకు పాల్పడితే ఉక్రెయిన్ ప్రభుత్వం ఖార్కివ్, సుమీ నుండి తరలించడానికి విదేశీ విద్యార్థులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని పేర్కొంది.
‘రష్యన్ బాంబు దాడులు, క్షిపణి దాడులకు గురవుతున్న నగరాల గుండా తరలింపులను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదకరం’ అని పేర్కొంది.
భారతీయ విద్యార్థులపై మీడియా ప్రశ్నలకు బాగ్చి గురువారం స్పందిస్తూ ఉక్రెయిన్ నుండి భారతీయులను తరలించడానికి రష్యా, రొమేనియా, పోలాండ్, హంగేరి, స్లోవేకియా, మోల్డోవాతో సహా ఈ ప్రాంతంలోని దేశాలతో భారతదేశం సమర్థవంతంగా సమన్వయం చేసుకుంటోందని అన్నారు.
గత కొద్దిరోజులుగా ఉక్రెయిన్ నుంచి పెద్ద సంఖ్యలో భారతీయులు స్వదేశానికి తరలివస్తున్నారు. ‘దీనిని సాధ్యం చేయడానికి ఉక్రెయిన్ అధికారులు అందించిన సహాయాన్ని మేం అభినందిస్తున్నాము. భారతీయ పౌరులను స్వాగతించడంలో ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతీయ పౌరులకు మేం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతీయులు విమానాల కోసం వేచి ఉన్నప్పుడు వారికి వసతి కల్పించినందుకు మేం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం..’ అని అన్నారు.
టాపిక్