Russia Ukraine war: కీవ్ పై రష్యా భీకర దాడులు
Russia Ukraine war: ఉక్రెయిన్ పై దాడుల తీవ్రతను రష్యా పెంచింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై శుక్రవారం మిస్సైల్స్ తో విరుచుకుపడింది. కీవ్ తో పాటు దక్షిణాన ఉన్న క్రివ్యి రీ, ఈశాన్యాన ఉన్న ఖార్గివ్ పట్టణాలపై వైమానిక దాడులు చేసింది.
Russia Ukraine war: రష్యా దాడులు తీవ్రం కావడంతో ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించింది. వైమానిక దాడుల నుంచి తప్పించుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో దాడుల తీవ్రతను కాస్త తగ్గించిన రష్యా, డిసెంబర్ ప్రారంభం నుంచి క్రమంగా దాడుల సంఖ్యను, తీవ్రతను పెంచుతూ వస్తోంది.
Russia Ukraine war: కీవ్ పై వరుస దాడులు
ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా దాడులు చేసింది. క్షిపణి దాడులతో రాజధాని దద్ధరిల్లిందని స్థానిక మీడియా వెల్లడించింది. రష్యా దాడులతో ఖార్కివ్ నగరంలో విద్యుత్ సౌకర్యం నిలిచిపోయిందని, ఇతర అత్యవసర సేవలకు కూడా అంతరాయం ఏర్పడిందని ఖార్కివ్ మేయర్ తెరెఖోవ్ సోషల్ మీడయా యాప్ ‘టెలీగ్రామ్’లో వెల్లడించారు. నగరంలోని కీలక మౌలిక వసతుల కేంద్రాలపై రష్యా దాడులు చేసిందన్నారు. క్రివ్యి రీ నగరంలోని ఒక నివాస భవనంపై రష్యా మిస్సైల్ దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్ష భవనం ప్రకటించింది. ఈ దాడిలో ప్రాణ నష్టం సంభవించిందని, శిధిలాల కింద ఎందరు ఉన్నారో లెక్క తెలీదని తెలిపింది. ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది.
Russia Ukraine war: పౌరులకు హెచ్చరికలు
రష్యా దాడుల నేపథ్యంలో అండర్ గ్రౌండ్ టన్నెల్ షెల్టర్లలోకి వెళ్లాల్సిందిగా కీవ్ మేయర్ విటాలి క్లిచ్కో కూడా నగర ప్రజలకు సూచించారు. కనీసం నాలుగు డిస్ట్రిక్ట్స్ లో భారీ దాడులు జరిగాయని మేయర్ వెల్లడించారు. కీవ్ పై మరిన్ని దాడులకు అవకాశం ఉందన్నారు. రష్యా దాడులతో విద్యుత్ కేంద్రాలు కూడా ధ్వంసం కావడంతో కీవ్ కాకుండా, ఖార్కివ్, కొరొవొహడ్, డోనెస్క్, నిప్రొపెట్రొవ్క్స్ ల్లోని ప్రధాన రైల్వే మార్గాల్లో విద్యుత్ సౌకర్యం నిలిచిపోయింది.
టాపిక్