Russia-Ukraine War: మేం పిచ్చోళ్లం కాదు: రష్యా అధ్యక్షుడు పుతిన్-nuclear risk is rising but we are not mad russia president vladimir putin comments on ukraine war ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Russia-ukraine War: మేం పిచ్చోళ్లం కాదు: రష్యా అధ్యక్షుడు పుతిన్

Russia-Ukraine War: మేం పిచ్చోళ్లం కాదు: రష్యా అధ్యక్షుడు పుతిన్

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 08, 2022 11:25 AM IST

Russia-Ukraine War: ఉక్రెయిన్‍తో తమ యుద్ధం ఎంత కాలం సాగుతుందన్న విషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) స్పందించారు. అణ్వాయుధ ప్రయోగం గురించి కూడా మాట్లాడారు.

Russia-Ukraine War: మేం పిచ్చోళ్లం కాదు: రష్యా అధ్యక్షుడు పుతిన్
Russia-Ukraine War: మేం పిచ్చోళ్లం కాదు: రష్యా అధ్యక్షుడు పుతిన్

Russia-Ukraine War: రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం సాగుతూనే ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‍లో ప్రవేశించిన రష్యా.. దాడులు కొనసాగిస్తూనే ఉంది. అయితే ఈ యుద్ధం ఇంకెంత కాలం అన్న విషయానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ (Vladimir Putin) సమాధానం చెప్పారు. అలాగే అణ్వాయుధ వినియోగం గురించి కూడా స్పందించారు. రష్యా మానవ హక్కుల కౌన్సిల్ సమావేశంలో ఈ విషయాలను పుతిన్ వెల్లడించారు. కీలక విషయాలను పంచుకున్నారు.

అలా అయితేనే అణ్వాయుధం

Russia-Ukraine War: అణు యుద్ధం (Nuclear War) ముప్పు క్రమంగా పెరుగుతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. అయితే తాము ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమని చెప్పారు. తమకేం పిచ్చి లేదని, అణ్వాయుధం అంటే ఏంటో తెలుసని అన్నారు. “అణ్వాయుధాలు అంటే ఏంటో మాకు తెలుసు. వేరే ఏ దేశం వద్ద లేనటువంటి అత్యంత అధునాతన, మోడ్రన్ ఆయుధాలు మా వద్ద ఉన్నాయి. అయితే ప్రచారం చేసుకునేందుకు మేం ప్రపంచమంతా పరుగెత్తం” అని పుతిన్ అన్నారు.

మరోవైపు అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగటంతో అణ్వాయుధ ప్రయోగం గురించి పుతిన్ ఆలోచనలు తగ్గిపోయాయని జర్మన్ ఛాన్సిలర్ ఒలఫ్ స్కోల్జ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు పుతిన్ కూడా అణ్వాయుధాలను తాము ముందుగా ప్రయోగించబోమని స్పష్టం చేశారు.

యుద్ధం ఇప్పట్లో ముగియదు

Russia-Ukraine War: ఉక్రెయిన్‍తో తమ యుద్ధం ఇప్పట్లో ముగియదనేలా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ చెప్పారు. ఇది సుదీర్ఘ ప్రక్రియ అని అన్నారు. ఇప్పట్లో ఉక్రెయిన్‍లో ఉన్న తమ సైన్యాన్ని మరోసారి వెనక్కి పిలవబోమని చెప్పారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‍లో స్పెషల్ మిలటరీ ఆపరేషన్‍ను రష్యా ప్రారంభించింది. నాటి నుంచి ఉక్రెయిన్‍పై దాడులు చేస్తూనే ఉంది. నగరాలను ఆక్రమించుకోవడం, క్షిపణులు ప్రయోగించడం, సైనిక దాడులు, మౌళిక సదుపాయాల ధ్వంసంతో పాటు అనేక చర్యలతో ఉక్రెయిన్‍ను దెబ్బ తీస్తోంది. అయితే ఉక్రెయిన్ మాత్రం తలొగ్గడం లేదు. దీంతో పుతిన్ సేన.. యుద్ధాన్ని కొనసాగించేందుకే మొగ్గుచూపుతోంది.

ఉక్రెయిన్‍లో సుమారు 3లక్షల మంది రష్యా సైనికులు ఉండగా.. వారిలో సగం మందిని సెప్టెంబర్, అక్టోబర్ లో వెనక్కి పిలిచింది రష్యా. ఇంకా సుమారు లక్షన్నర మంది రష్యా సైనికులు ఉక్రెయిన్‍లోనే పాగే వేశారు. అలాగే రష్యాకు చెందిన 77వేలకు పైగా యుద్ధ యూనిట్లు ఉక్రెయిన్‍లో ఉన్నాయి. అయితే, తమ సైనికులను ఇప్పట్లో వెనక్కి పిలవబోమని పుతిన్ స్పష్టం చేశారు.

మరోవైపు రష్యాసేనలు మళ్లీ యాక్టివ్‍గా మారాయని ఉక్రెయిన్ అంటోంది. ఎయిర్ ఇంటెలిజెన్స్ మిషన్లను తరచూ ప్రయోగిస్తోందని ఉక్రెయిన్ యూనిట్ కమాండర్ గుర్రె బండేరా ఇటీవల చెప్పారు.

IPL_Entry_Point