Damodar Raja Narasimha: రాజీనామాకు సిద్ధమైన దామోదర రాజనరసింహ
Damodar Raja Narasimha: ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల కేటాయింపు చిచ్చు రేపింది. తుది జాబితాలో పటాన్‌చెరు, నారాయణ ఖేడ్ నియోజక వర్గాలకు అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపుపై అసంతృప్తికి గురైన దామోదర రాజనరసింహ పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Damodar Raja Narasimha: కాంగ్రెస్ పార్టీ తుది విడత టిక్కెట్ల కేటాయింపుపై అసంతృప్తికి గురైన మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనరసింహ పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కేటాయింపులో తమ సూచనలు పట్టించుకోకపోవడం దామోదరను మనస్తాపానికి గురి చేసింది. పార్టీలో పని చేస్తున్న వారికి టిక్కెట్లు కేటాయించాలని కొత్తగా వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వొద్దని చేసిన సూచనలు పట్టించుకోక పోవడం దామోదరకు ఆగ్రహం కలిగించింది.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో దామోదర రాజనరసింహ రాజీనామా వార్తలతో కాంగ్రెస్ అప్రమత్తం అయ్యింది. ఆ పార్టీ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే దామోదర్‌కు ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నం చేయడంతో దామోదర ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. పరిస్థితులు సర్దుకుంటాయని థాక్రే నచ్చచెప్పే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు.
పార్టీలో ఉద్దేశపూర్వకంగానే తమను అవమానించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పటాన్‌చెరులో కాటా శ్రీనివాస్ గౌడ్‌ను కాదని నీలం మధుకు టిక్కెట్ కేటాయించడంపై దామోదర్ రాజ నరసింహ ఆగ్రహంతో ఉన్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కాదని సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో పార్టీని వీడి తన దారి తాను చూసుకుంటారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు పటాన్‌చెరు టిక్కెట్ నీలం మధుకు కేటాయించడంపై కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు రేవంత్ రెడ్డి ఇంటినిముట్టడించారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు నినాదాలు చేశారు. అటు నారాయణ్ ఖేడ్ నియోజక వర్గం విషయంలో కూడా దామోదర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజీనామాకు సిద్ధమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.